నలుగురు యువకుల ఆలోచనా తరంగం
రూ.10 స్పూర్తినిచ్చింది పల్లె కోట్లెత్తింది ...
ఇలాగైతే లాభం లేదు...ఒకరు డబ్బు తీయాలి...నలుగురు టీ తాగాలంటే చాలా కష్టం... ఎవరో ఒకరి దగ్గరైతే డబ్బు తక్కువుంటుంది... అదే నలుగురు కలిస్తే... ఓ భరోసా ఉంటుంది....తలో రూ.10 వేసుకుని ఒక దగ్గరపెడదాం. వాటి నుంచే టీ ఖర్చులకు వాడుకుందాం.
ఆ రోజు సారంగాపూర్ మండలం కౌట్ల-బి గ్రామంలో టీ కొట్టులో కూర్చుని కొందరు కుర్రాళ్లు చేసిన ఈ ఆలోచన అనేక గ్రామాల తలరాతను మార్చింది. చరిత్రను తిరగరాసింది. పంటలు లేక, చేతిలో చిల్లి గవ్వ లేక, ఆదుకునే ఆసరాలేక అల్లాడుతున్న ఆ గ్రామాలకు ఈ పొదుపు మంత్రం తారకమంత్రమైంది. ఇది నలుగురు యువకులు ప్రవచించిన ఆర్థిక సూత్రం. మారుమూల గ్రామాల్లో వారు వెలిగించిన సమైక్య తేజం... ఆర్థ్ధిక పరి పుష్టి సాధించి... జిల్లా, రాష్ట్ర సరిహద్దులనే కాకుండా.. దేశ సరిహద్దులను చెరపేస్తూ తమ విజయ పరంపరను చాటుకుంది కౌట్ల-బి గ్రామం. ఈ స్ఫూర్తితో బీడు భూములను సస్యశ్యామలం చేసుకున్న బీరవెల్లి గ్రామం విజయగాథ ఒకటైతే.. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయ సాగు రుచి చూపించి, నూతన వంగడాలను పండిస్తోంది లక్ష్మణచాందా. మార్కెట్ దళారీ మోసాలను ఎండగట్టేందుకు.. రైతులే పంటను కొనుగోలు చేసే స్థాయికి ఎదిగింది ఎడ్‌బిడ్.
పొదుపు మంత్రం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల-బి... ఓ కుగ్రామం. అన్నిచోట్లలాగే అక్కడా రైతులకూ కష్టాలు, కడగండ్లే. నకిలీ విత్తనాలు.. నకిలీ ఎరువులు... పంట సక్రమంగా చేతికి రాక కుటుంబ పోషణ కోసం అగచాట్లు. పెట్టుబడి కోసం పడిగాపులు. జలగల్లా పీడిస్తున్న మైక్రో ఫైనాన్స్ వ్యాపారులతో బెంబేలెత్తుతున్న స్థితిలో... ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలనే ఆలోచనకు టీ బంకు దగ్గర చర్చ ఓ మార్గం చూపింది. ఆ కుర్రాళ్లు ఈ ఆలోచనను మరో పదిమంది రైతుల మదిలో వేశారు. దీంతో 51 మంది రైతులతో కౌట్ల పరస్పర సహాయక పొదుపు, పరపతి సంఘం 2003లో ఏర్పాటైంది. తొలుత ప్రతి రైతూ సభ్యత్వ రుసుంగా రూ.వెయ్యి చొప్పున పోగు చేసి బ్యాంకులో రూ.51 వేలు జమచేశారు. తొలి ఏడాది 51 మంది రైతులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నగదుతో విత్తనాలు కొనుగోలు చేసి వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా జాగ్రత్తపడ్డారు. తర్వాత అదే సంఘం కింద పంటలను విక్రయించి దాదాపు రూ.2 లక్షలకు పైగా సంపాదించారు. అలా పోగైన డబ్బుతో సమష్టి వ్యవసాయం మొదలుపెట్టారు. నకిలీల బారిన పడకుండా విత్తనాలను ప్రముఖ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. బిందు, తుంపర సేద్యం పరికరాలు, పీవీసీ పైపులు, టార్బాలిన్లు వంటి వాటితో పాటు బియ్యం, నూనెలు వంటి నిత్యావసరాలను సైతం సంఘం ద్వారానే సమకూర్చుకుంటున్నారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగలేదు. కౌట్ల-బి సంఘం చేస్తున్న కార్యకలాపాలపై విశ్వాసం పెరగడంతో పక్కనున్న సారంగాపూర్, అడెల్లి, వంజర గ్రామాలకు చెందిన దాదాపు 700 మంది రైతులు తాత్కాలిక సభ్యులుగా చేరారు. ఇప్పుడు కౌట్ల-బి సంఘంలో రూ.3 కోట్లకుపైగా నగదు జమ ఉందంటే వారి విజయాన్ని అర్థం చేసుకోవచ్చు. గ్రామంలో సొంతంగా కార్యాలయ భవనం, గోదాములు, సంఘం భవిష్యత్తు అవసరాల కోసం ఎకరం భూమి సమకూర్చుకున్నారు. గుమస్తా, కంప్యూటర్ ఆపరేటర్లు, స్వీపర్ల జీతభత్యాలను సంఘమే చెల్లిస్తుంది. ఇతర ప్రాంతాల్లో కొత్తరకమైన పంటలు పండిస్తుంటే.. అక్కడికి సంఘం ఆధ్వర్యంలో రైతులు క్షేత్రŸ పరిశీలనలు చేస్తారు. ప్రభుత్వంపైనో.. వడ్డీ వ్యాపారులపైనో పెట్టుబడులకోసం ఎదురు చూడకుండా సంఘమే రైతుల అవసరాలను తీరుస్తుందని అధ్యక్షుడు వంగ రామిరెడ్డి చెప్పారు. ఇప్పుడు కౌట్ల-బి గ్రామం తీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పూరి గుడిసెలే ఉన్న ఈ పల్లెలో.. పట్టణంలో మాదిరిగా రెండు, మూడు పడకల గదుల ఇళ్లే కనిపిస్తాయి |
బీడు భూముల్లో బంగారం.. బీరవెల్లిది మరో విజయగాథ. ఇక్కడి పరస్పర సహాయక సహకార పొదుపు పరపతి సంఘం తరఫున భూమి ఉన్న ప్రతి రైతుకు రుణ సదుపాయం లభిస్తుంది. చేతిలో పైసా లేకున్నా సరే దుక్కి దున్నే దగ్గర నుంచి విత్తనాలు, ఎరువులతో పాటు పంట చేతికి వచ్చే వరకు సంఘం తరఫున పెట్టుబడులు అందిస్తోంది. పంట చేతికి రాగానే తీసుకున్న రుణం సంఘానికి సాధారణ వడ్డీతో తిరిగి చెల్లించాలనేది నియమం. 2003లో 33మందితో మొదలైన బీరవెల్లి పరస్పర సహకార పొదుపు పరపతి సంఘంలో ఇప్పుడు 67మంది శాశ్వత సభ్యులున్నారు. గ్రామంతో పాటు చుట్టుపక్కన ఉన్న ప్యారమూర్, తాండ్ర, వైకుంటాపూర్, వంజర్, కాల్వ, కాల్వతాండ, సిర్గాపూర్ గ్రామాలకు చెందిన ఆరేడువందల మంది రైతులతో సహా ఇక్కడి నుంచే సేవలు పొందుతున్నారు. రూ.33వేల మూల ధనంతో ప్రారంభమైన సంఘం .. ఇప్పుడు రూ.2.50కోట్ల వార్షిక ఆదాయానికి చేరింది. సంఘం ద్వారా 40మంది రైతులకు రుణాలిచ్చి బీడు భూములను సాగు భూములుగా మార్చుకునేలా చేశారు. 300మంది రైతులు బోర్లు వేసుకోవడానికి ఆర్ధిక సహాయం చేసి.. సాగుకు నీటి ఇబ్బందులు లేకుండా చేసుకున్నారు.అవసరాలను బట్టి విద్యుత్తు మోటార్లు, ట్రాక్టర్ల కొనుగోళ్లకు, ప్రతి రైతుకు ఏడాదికి రూ.లక్ష పంట రుణం, ఆఖరుకు పొలం వద్దకు వెళ్లడానికి అనువుగా ద్విచక్రవాహనాలకు కావాల్సిన రుణాలను సైతం సంఘం ద్వారానే అందచేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, కల్తీ లేని ఎరువులను కొరత లేకుండా అందుబాటులో ఉంచి రైతులకు అవసరమైన సమయాల్లో అండగా నిలుస్తున్నారు. సంఘంలోని సభ్యులెవరైనా మృత్యువాత పడితే.. ఆ కుటుంబానికి రూ.2లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తారు. రైతులే సంఘంగా ఏర్పడి వ్యవసాయంలో కష్టనష్టాలను అధిగమిస్తున్న స్ఫూర్తి సమీప గ్రామాలు, రాష్ట్రానికే కాకుండా విదేశాలకు సైతం పాకింది. అమెరికా, దక్షిణాఫ్రికా, చైనా, అస్సాం, సిక్కిం, మణిపాల్, త్రిపుర,ఔరంగాబాద్, ముంబాయి, ఒరిస్సా, అలహాబాద్, దిల్లీల నుంచి పలువురు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేశారు. |
ఇలా చేస్తారు... ప్రతి పరపతి సంఘంలో 10మందితో కూడిన కమిటీని ఎన్నుకుంటారు. వీళ్లంతా పూర్తిగా సేవా భావంతో పనిచేయాలి. సంఘంలో సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన విధులు కేటాయిస్తారు. కమిటీ సభ్యులు ప్రతి నెలా మొదటి వారంలో సమావేశమై అప్పటి పంటల పరిస్థితుల ఆధారంగా చర్చించుకుంటారు. సీజన్‌వారీగా వేయాల్సిన పంటలు, పంట మార్పిడి, చీడపీడలు, మిగిలిన రైతుల సాధకబాధకాల గురించి మాట్లాడుకుని ఆ అవసరాలపైన నిర్ణయాలు తీసుకుంటారు. తరువాత కమిటీ తీసుకున్న నిర్ణయాలను గ్రామస్తుల ముందుంచుతారు. అవసరాల మేరకు శాస్త్రవేత్తలను ఆయా గ్రామాలకు రప్పించి రైతులకు సలహాలు సూచనలు చెప్పిస్తుంటారు గ్రామాల్లో ఎన్నికల వరకే ఎవరి పార్టీ వాళ్లది. మిగిలిన రోజుల్లో రాజకీయ పార్టీల ప్రస్థావన అనేది ఉండదు. ప్రతి ఏడాదికి ఒక సారి ఆడిట్ పూర్తయ్యాక కొత్త కమిటీ ఎన్నిక జరుగుతుంది. |
ఆధునిక సాగు.. వ్యవసాయం చేసే రైతుకు చేదోడుగా నిలిచేందుకు లక్ష్మణచాందలో లక్ష్మణచాంద పరస్పర సహాయక పొదుపు మరియు పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొదట లక్ష్మణచాందలో 200మంది సభ్యులతో మొదలై.. చుట్టుపక్కల తొమ్మిది గ్రామాలకు చెందిన 511మంది సభ్యులతో కొనసాగుతుంది. ఆధునిక పద్ధతుల్లో సాగు చేసుకోవ డంతో పాటు నూతన వంగడాలను పండిస్తున్నారు. కొత్త పంటలను చేరదీయడంలో ఇక్కడి రైతులు ముందుంటారు. వాటికి అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు రైతులకు అందిస్తున్నారు. పంటల సాగు విషయమై వ్యవసాయశాస్త్ర వేత్తలతో పాటు, అగ్రికల్చర్ విద్యార్థులచే పంటలను పరిశీలించేలా ఏర్పాట్లు చేయడం.. పంటలకు చీడ, పీడల నివారణకు సూచనలు ఇచ్చే విధంగా సహకరిస్తున్నారు. రూ.3కోట్ల టర్నోవర్ సాధించి ఆదర్శంగా నిలుస్తోంది. |
ముధోల్ మండలం ఎడ్‌బిడ్ గ్రామంలో 2007లో 36 మంది రైతులతో కలిసి సంఘంగా ఏర్పడ్డారు. ఒకప్పుడు అప్పుల కోసం మహారాష్ట్రలోని ధర్మాబాద్, భైంసా వ్యాపారులపైనే ఆధారపడాల్సి వచ్చేది. అప్పులు తీర్చలేక పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడారు. దీంతో 52 మంది రైతులు కలిసి మల్లికార్జున సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. కష్టాలను కలిసే పంచుకుందామని.. ఏ ఒక్కరూ మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దని నిర్ణయం తీసుకున్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు ఇచ్చి.. పంట పండిన తర్వాత డబ్బులు తీసుకునేవాళ్లు. మార్కెట్‌లో దళారుల మాయాజాలాన్ని అధిగమించడానికి రైతులు పండించిన పంటను సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేసేవాళ్లు. దీంతో దళారీ వ్యవస్థకు అడ్డుకట్టపడటంతో లాభాలు రైతులకే దక్కేది. ఏ రైతు పంటలకైనా చీడపీడలు వ్యాపిస్తే అది అందరి సమస్యగా భావించి శాస్త్రవేత్తల ద్వారా సహకారం పొందుతున్నారు. ఒకప్పుడు సన్నచిన్నకారు రైతులు కూడా ఇప్పుడు ఏ రైతుకైనా 10ఎకరాలకు తక్కువ కాకుండా భూములు కూడగట్టుకున్నారు. రైతులకు భీమా సదుపాయాన్ని కల్పించడమే కాకుండా.. గ్రామాభివృద్థికి, విద్యాభివృద్థికి కూడా ఆర్ధిక సహకారాన్ని అందిస్తున్నారు. - కొండబోయిన ఏడుకొండలు, ఈనాడు, ఆదిలాబాద్ |