బెంగళూరు: వివిధ రంగాల్లో చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఇచ్చే ‘పద్మ’ అవార్డులను కేంద్రం రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఇందులో భాగంగా కర్ణాటకకు చెందిన యోగా గురు సిద్ధేశ్వర్ స్వామిని ‘పద్మ శ్రీ’ అవార్డుకు ఎంపిక చేసింది. అయితే ఈ అవార్డును స్వీకరించడానికి తాను సిద్ధంగా లేనంటూ ప్రధాని మోదీకి స్వామి లేఖ రాశారు. ఆధ్యాత్మిక రంగంలో తన సేవలను గుర్తించిన ప్రభుత్వానికి ధన్యవాదాలనీ, అయితే తనకు అవార్డులమీద, ప్రశంసల మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ‘పద్మ శ్రీ’ స్వీకరించడాన్ని అసౌకర్యంగా భావిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తన మనవిని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా తీసుకుంటుందని అనుకుంటునుకుంటున్నట్లు అందులో ప్రస్తావించారు. తనను ఇంతటి గొప్ప గౌరవంతో సత్కరించదలిచిన ప్రభుత్వానికి ధన్యవాదాలని, ఈ విషయంలో తనని మన్నించాల్సిందిగా మోదీకి లేఖ రాశారు. కర్ణాటకలో ‘జ్ఞాన యోగాశ్రమ’ పేరుతో ఆయన ఆశ్రమాన్ని స్థాపించి అక్కడ ఆధ్యాత్మిక పాఠాలు బోధిస్తు్న్నారు. యోగాలో ఈయన సలహాలు, సూచనలు తీసుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక విదేశాలనుంచి కూడా ప్రజలు అక్కడికి వస్తుంటారు. ఆధ్యాత్మిక రంగంలో ఈయన సేవలకు గానూ ప్రభుత్వం ‘పద్మ’ అవార్డుతో సత్కరించడానికి ఎంపిక చేసింది.
ఈ సంవత్సరం 85 పద్మ అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిది. ఇందులో మూడు పద్మ విభూషణ్, తొమ్మిది పద్మ భూషణ్, 73 పద్మ శ్రీ అవార్డులను ఇవ్వదలిచింది. సామాజిక సేవ, సైన్సు, ఇంజినీరింగ్, క్రీడలు, విద్య, సివిల్, వాణజ్యం, పరిశ్రమలు, పబ్లిక్ అఫైర్స్ వైద్య, సాహిత్య రంగాల్లో మెరుగైన సేవలు అందించిన వారికి ఈ అవార్డులను ప్రభుత్వం ప్రకటిస్తుంది.