
మద్యం తాగితే శిక్ష తప్పదు
మద్యంతో చిన్నాభిన్నమైన కుటుంబాలు మచ్చుకైనా కనిపించవక్కడ. మద్యం అమ్మరు.. ముట్టరు. ఏ సందర్భంలో అయినా తాగితే గ్రామపెద్దలు నుంచి శిక్షకు గురికావాల్సిందే. శ్రీమజ్జినపల్లి గ్రామం కర్ణాటకకు కూతవేటు దూరంలో ఉంది. అక్కడ 190 కుటుంబాలున్నాయి. గ్రామ జనాభా 580 మంది. నేటికీ ఆచార వ్యవహారాల్లో భాగంగా మద్యం నిషేధాన్ని కట్టుదిట్టంగా కొనసాగిస్తుండటం విశేషం. వారి ఇష్టదైవం పాలనాయకస్వామి కావడంతో మద్యం తాగితే, కోడిమాంసం తింటే స్వామి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనేది గ్రామస్థుల విశ్వాసం. దీంతో ఈ పద్ధతులను తూచ తప్పకుండా పాటిస్తున్నారు. మద్యం తాగి గ్రామంలోకి అడుగు పెడితే పెద్దలు వెంటనే శిక్ష విధిస్తారు.
తాగిన వ్యక్తి నాలుకపై చిన్న వేప పుల్లతో వాత పెడతారు. ఈ కట్టుబాటును నేటికీ అమలు చేస్తుండటం విశేషం. అలాగే గ్రామ శాంతి కోసం ప్రతి మూడేళ్లకోసారి 24 గంటలు పాటు పిల్లాజల్లాతోపాటు గ్రామం వదిలి ఆరుబయటే వంటావార్పు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామాన్ని ఖాళీ చేసిన సమయంలో గ్రామం చుట్టూ ముళ్లకంచె వేసి కాపలా ఉంటారు.
జీవితాలు బాగుపడతాయ్
ఆచారాలు, సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నాం. మద్యం అమ్మకాలు లేవిక్కడ. తాగితే శిక్షకు గురికావాల్సిందే. పాలనాయకస్వామి ఆగ్రహానికి గురికావాల్పిందే. కోళ్లు పెంచం సరికదా వాటి మాంసం తినం. కట్టుబాట్లు వలన జీవితాలు బాగుపడుతున్నాయి. దీంతో గ్రామం అభివృద్ధి చెందడానికి వీలుంది.