iNVESTMENT 30000/- INCOME 3 LAKHS ---- MEERE CHADAVANDI

1 view
Skip to first unread message

Govardhan Gajara

unread,
Apr 4, 2018, 4:41:59 AM4/4/18
to Muchivolu-all, Muchivolu-rss
పెట్టుబడి రూ.30 వేలు.. ఆదాయం 3 లక్షలు 
తీగ రకం కూరగాయల సాగుతో లాభాలు 
ఆదర్శంగా యువరైతు 
మల్చింగ్‌ విధానంతో ఖర్చు ఆదా 
న్యూస్‌టుడే, ఊట్కూరు 
తల్లిదండ్రులు సాగు చేస్తున్న మూస దోరణి పంటల సాగు విధానం చూసిన యువరైతు, సాగు విధానంలో మార్పు తీసుకురావాలనుకున్నారు. ఏటా నష్టాలు చవి చూసేకన్నా కూరగాయల సాగు చేసి లాభాలు ఆర్జించవచ్చని నిరూపించారు. యువకుడి ఆలోచనకు ఉద్యానశాఖ సహకారం లభించడంతో ఏటా రూ.30 వేల పెట్టుబడి పెట్టి రూ.3 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
మండలంలోని మొగ్ధుంపూర్‌ గ్రామానికి చెందిన యువ రైతు రాములు. రెండున్నర ఎకరాల పొలంలో తల్లిదండ్రుల సూచనల మేరకు బోరు బావితో సంప్రదాయ పంటల్ని సాగు చేసే వారు. ఏటా బోరు బావుల్లో నీటి మట్టం తగ్గుతున్న క్రమంలో పంటల దిగుబడి తగ్గి నష్టం వాటిల్ల్లడం మొదలైంది. ఈ నేపథ్యంలో రాములు సంప్రదాయ పంటలకు భిన్నంగా సాగు చేయాలని తలంచి కూరగాయల సాగుతో ఆదాయం ఆర్జిస్తున్నారు.

ఉద్యానశాఖ అధికారుల సహకారం 
ఉద్యానశాఖ అధికారులు తీగ రకం కూరగాయల సాగుపై , శాఖ తరఫున వచ్చే రాయితీలు సాగు విధానం అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల రాయితీతో పొలంలో పైపులైను ఏర్పాటు చేసుకుని, రాతి స్తంభాలు పాతి, మధ్యలో ఇనుప తీగలను వేయించుకున్నాడు. ఉద్యానశాఖ అధికారుల సూచనల మేరకు బీర, కాకర, సొరకాయ, హైబ్రిడ్‌ టమాటా, మిరపసాగు చేపట్టాడు. తక్కువ నీటిని వినియోగించే మల్చింగ్‌ పద్ధ్దతిలో కూరగాయల మొక్కలు నాటి ఏటా రూ. 30 వేలు పెట్టుబడి పెట్టి, రూ. 3 లక్షల పంట దిగుబడి సాగిస్తున్నాడు. మల్చింగ్‌ పద్ధ్దతిని పాటించడంతో  కలుపుతీత, ఎరువుల వాడకంపై ఖర్చు తగ్గుతోంది. పొలంలోని తోటలో పండిన కూరగాయలు తమ కుటుంబసభ్యులే  ఏరడంతో, కొంత ఖర్చు తగ్గుతోంది. పండించిన కూరగాయలను నారాయణపేట, మక్తల్‌, ఊట్కూరు తరలించి అమ్మేస్తున్నారు. అన్ని ఖర్చులు పోనూ ఏటా రూ. 3 లక్షలు ఆదాయం సమకూరుతోందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   ఈ నేపథ్యంలో పలువురు రైతులు యువ రైతు రాములు చేస్తున్న తీగ కూరగాయల సాగుపై ఆసక్తిని పెంచుకుని సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

కొంత ధర తగ్గినా.. 
బహిరంగ మార్కెట్‌లో ఏ కూరగాయల ధరలు ఎప్పుడు తగ్గుతాయో తెలియని తరుణంలో ఏది తగ్గినా నష్టాలు చవిచూడకూడదని ఒకే రకం కూరగాయలు సాగు చేయకుండా ఒకే విడతలో మూడు, నాలుగు రకాలు సాగు చేస్తున్నారు. దీని వల్ల మార్కెట్‌లో ఏదో ఒక కూరగాయ ధర తగ్గితే ఎలాంటి నష్టం వాటిల్లడం లేదు. మిగతా కూరగాయల్లో లాభం వస్తుండటంతో ఏ మాత్రం నష్టం అనిపించడం లేదని రైతు అంటున్నాడు.

మంచి ఫలితాలు సాధిస్తాం.. 
తీగరకం కూరగాయలు, పలు రకాల వేరే కూరగాయలు సాగు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తున్నా. ఏటా అన్ని పెట్టుబడి ఖర్చులు పోగా రూ. 3 లక్షలు వరకు లాభం వస్తుంది. గతంలో ఉద్యానశాఖ నుంచి నాణ్యమైన విత్తనాలను రాయితీపై అందజేసేవారు. ప్రస్తుతం విత్తనాలు ఇవ్వడం లేదు. విత్తనాల కోసం బెంగళూరు, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు వెళ్లి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. రాయితీ విత్తనాలు అందిస్తే రైతులకు ఇబ్బందులు తప్పుతాయి. యువ రైతులకు ప్రభుత్వం నుంచి అవగాహన, ప్రోత్సాహం అందిస్తే  మంచి ఫలితాలు సాధిస్తాం.


Reply all
Reply to author
Forward
0 new messages