NTR sworn as CM 30 years ago - 9 Jan 1983

3 views
Skip to first unread message

n m rao

unread,
Jan 9, 2013, 10:46:20 AM1/9/13
to manakosamt...@googlegroups.com

(ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్ళు)

ఎన్టీఆర్... తెలుగుదేశం... ముప్ఫై ఏళ్ళు!!  - వారణాశి నాగార్జున

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడి నేటికి 30 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. తెలుగుదేశం పార్టీ సర్వం సహాధినేత నందమూరి తారక రామారావు, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని ప్రజా సందోహం ముంగిట లాల్‌బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ విధంగా అధికార బాధ్యతలు చేపట్టిన తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆరే. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో అనేక మిట్టపల్లాలు చవిచూసిన తెలుగుదేశం ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. దేశంలో ప్రాంతీయ పార్టీల ఏర్పాటు ద్రవిడ పార్టీలతోనే ఆరంభమయినా తెలుగుదేశం పార్టీ దూకుడు, ఎన్టీఆర్ విలక్షణ శైలి, పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి ఊతమిచ్చింది. చెన్నై నగరానికి తాగునీరు, రాయలసీమ, నెల్లూరు జిల్లాకు సాగునీరు అందించేందుకు ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు గంగ ఆ తరువాతి కాలంలో జలయజ్ఞానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది.

1983 అర్ధ భాగంలో జరిగిన ఎన్జీవోల సమ్మె మినహాయిస్తే 1989లో పరాజయం వరకు ఎన్టీఆర్ తనదైన శైలిలో పార్టీని ముందుకు దూకించారు. నాడు కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, పి.వి. నరసింహారావు, కోట్ల విజయభాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్థన రెడ్డి వంటి అతిరథ మహారథులను ఎన్టీఆర్ తన వ్యూహాలతో తుత్తునియలు చేశారు. ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతా సానుభూతి ప్రభంజనంతో కొట్టుకుపోగా ఎన్టీఆర్ ఆకర్షణ టీడీపీని 30 సీట్లతో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించేలా చేసింది. తదనంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రాభవం అప్రతిహతంగా సాగింది... రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, విద్యుత్ సరఫరాలో సరళీకృత విధానం, సహకార రంగంలో సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్‌దే.

కరణాలు, మున్సుబులు, పటేల్, పట్వారీ వ్యవస్థలను ఒక్క సంతకంతో రద్దుచేసి గ్రామీణాంధ్ర ప్రజలకు దైవంలా మారారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు ఎన్టీఆర్ ఇచ్చిన రిజర్వేషన్లు విప్లవాత్మకమైనవే. రెండున్నర దశాబ్దాల క్రితమే అణగారిన వర్గాల సముద్దరణకు ఎన్టీఆర్ కంకణ బద్ధులయ్యారు. యనమల రామకృష్ణుడు, దేవేందర్ గౌడ్, జీఎంసీ బాలయోగి, ప్రతిభా భారతి, లాల్‌జాన్ భాషా వంటి నేతలు ఎన్టీఆర్ ఇచ్చిన ప్రత్యక్ష, పరోక్ష ప్రోత్సాహం అంతింతా కాదు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా వి.పి.సింగ్ సారథ్యంలో 1989లో ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వానికి భిన్నధృవాల లెఫ్ట్-రైట్‌లు ఒకేసారి మద్దతు ఇవ్వడంలో కూడా ఎన్టీఆర్ ఆవిరళ కృషి చేశారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వ అవినీతి వ్యతిరేక ఉద్యమం, బోఫోర్స్ కుంభకోణానికి వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలను ఆరు నెలల ముందుగానే మూకుమ్మడి రాజీనామాలు చేయించారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ముద్రగడ పద్మనాభం, కె.ఇ. కృష్ణమూర్తి, జానారెడ్డిల వంటి సీనియర్లు పార్టీ నాయకత్వంతో విభేదించి పార్టీ నుంచి వైదొలిగినా పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం చెదరకుండా చేయడంలో ఎన్టీఆర్ సఫలీకృతులయ్యారు. బడ్జెట్ లీక్ ఆరోపణలతో కేబినెట్ మొత్తం చేత రాజీనామాలు తీసుకున్న సాహసి... విమర్శలకు వెరవకుండా తాను నమ్మిన సిద్ధాంతాన్ని ముక్కుసూటిగా ఆచరించడమే ఎన్టీఆర్ విలక్షణ శైలి. వివేకానందుడి గెటప్‌లో సోమశిల జలాశయాన్ని జాతికి అంకితం చేసినా, ప్రధాన ప్రతిపక్షంపై ఆగ్రహంతో సెక్రటేరియట్ ఎదురుగా నడిరోడ్డుపై పవళించినా ఎన్టీఆర్ ముక్కుసూటితనాన్ని వీడలేదు... నందమూరి పాలనలో విజయవాడ (తూర్పు) శాసనసభ్యుడు వంగవీటి మోహన రంగారావు హత్య జరిగిన సందర్భంలో తీవ్ర అవమానాలు ఎదురవుతాయని ముందే ఊహించినా వంగవీటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు యత్నించిన మొండి ఘటం. ఎన్ని విమర్శలు ఎదురైనా ముఖ్యమంత్రిగా ఉంటూ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాన్ని నిర్మించారు.

నమ్మిన వారిని అందలాలు ఎక్కించడం నందమూరి బలహీనత, బలం కూడా. 1989లో అధికారం కోల్పోవడం కన్నా, కల్వకుర్తిలో వ్యక్తిగత పరాజయం ఎన్టీఆర్‌ను తీవ్రంగా కలచివేసిందని బెజవాడ పాపిరెడ్డి వ్యక్తిగత సంభాషణలలో వివరించారు... అధికారం కోల్పోయిన ఎన్టీఆర్‌ను కాంగ్రెస్ శాసనసభ్యులు అవమానించడంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకు అసెంబ్లీలో ప్రవేశించనని భీష్మించి, అలాగే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెట్టిన మొండి ఘటం నందమూరి.. ఈ మధ్యలో తన చిరకాల స్వప్నం సామ్రాట్ అశోక్ చిత్ర నిర్మాణంతో పాటు సుదీర్ఘ తన చలనచిత్ర జీవితంలో చిట్టచివరి చిత్ర రాజం మేజర్ చంద్రకాంత్‌లో నటించారు... మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి విస్తృతంగా పర్యటించారు. 1994 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధంపై తొలి సంతకం చేశారు.

మద్యపాన నిషేధం తెలుగులోగిళ్ళలో నిజమైన సంక్రాంతి తెచ్చిందని చెప్పవచ్చు. మాట ఇస్తే దానిని నెరవేర్చేందుకు ఎన్టీఆర్ తహతహలాడేవారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 1994 ఎన్నికల్లో 26 సీట్లకు దిగజారిన కాంగ్రెస్ చివరికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. 1994-95ల మధ్య ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో చోటుచేసుకున్న పలు వివాదాస్పద అంశాలను పక్కనపెడితే తెలుగు వారికి విశ్వవ్యాప్త కీర్తి వచ్చేందుకు కారకుడు ఎన్టీఆర్. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భిన్న భావజాలాలు గల పార్టీలను, నేతలను ఒకే వేదికపైకి తీసుకురాగలిగిన ధీరోదాత్తుడు ఎన్టీఆర్... తెలుగు సినీ రాజకీయ రంగాల్లో మహోన్నత శిఖరాలను అందుకున్న నందమూరి తారక రామారావు రాజకీయ ప్రస్థానమే, తెలుగువారికి చైతన్య బాట...

- వారణాశి నాగార్జున
(ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్ళు)
http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2013/jan/9/edit/9edit5&more=2013/jan/9/edit/editpagemain1&date=1/9/2013
Reply all
Reply to author
Forward
0 new messages