కృష్ణా జిల్లా టీడీపీ చిచ్చు వెనుక హరికృష్ణ పాత్ర
జూనియర్‌ను తెరపైకి తెచ్చే సుదీర్ఘ యత్నం
తెర వెనుక చక్రం తిప్పుతున్న పురందేశరి
బాబు ఫోన్ చేసినా తీయని ఎన్టీఆర్
హరికృష్ణ, ఎన్టీఆర్ తీరుతో నొచ్చుకున్న బాబు
సీనియర్ల కమిటీ ముందుకు కృష్ణా నేతలు!
ప్రతి అడుగునూ వ్యూహాత్మకంగా వేసే నేతకు.. అ అడుగులు ప్రతివ్యూహాలై
ఎదురు తిరిగితే? ఏకచ్ఛత్రాధిపత్యంతో పార్టీని ఏలుతున్న అధినేతకు.. బంధు
గణంలోనే తిరుగుబాటు ధ్వజమెగిరితే? ఆసరాగా ఉంటారని ఆశించిన వారే.. సై అంటూ
సమర భేరి మోగిస్తుంటే? ఎత్తుగడల్లో నిష్ణాతుడైన రాజకీయ చాణక్యుడికి
వ్యతిరేకంగా పావులు కదిపి.. 'దేశ' ముదుర్లు చుక్కలు చూపిస్తే? ఇది టీడీపీ
అధినేత చంద్రబాబు ఎదుర్కొంటున్న సంకట స్థితి!
రాజకీయ వారసత్వాన్ని నందమూరి వంశానికే దఖలు పరిచేందుకు ప్రచ్ఛన్నంగా
మొదలై.. క్రమంగా రచ్చకెక్కుతున్న పోరు! వంశీ, నానీ పాత్రధారులుగా..
హరికృష్ణ, బాలకృష్ణ సూత్రధారులుగా, జూనియర్ ఎన్టీఆర్ సమర్పణలో పురందేశ్వరి
తెరకెక్కిస్తున్న గొప్ప ఫ్యామిలీ సినిమా!
హైదరాబాద్, ఏప్రిల్ 6 : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఆయన సమీప
బంధు గణం.. నందమూరి శిబిరం సమరం ప్రకటించింది. ఆయనతో తాడోపేడో
తేల్చుకోవడానికి పావులు కదుపుతోంది. ఇంతకాలం ప్రచ్ఛన్న యుద్ధంలా నడుస్తున్న
ఈ వ్యవహారం ఇప్పుడు బహిరంగ పోరాటంగా మారుతోంది. తెర ముందు టీడీపీ రాజ్యసభ
సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈ సమరానికి సారథ్యం వహిస్తుండగా.. తెర వెనుక ఆయన
సోదరి పురందేశ్వరి చక్రం తిప్పుతున్నట్లు చెబుతున్నారు.
హరికృష్ణకు ఆయన సోదరుడు బాలకృష్ణ, కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ నైతిక మద్దతు
ఇస్తున్నారు. నందమూరి శిబిరం అంతా తనపై కత్తులు నూరుతుండటంతో టీడీపీ
అధినేత చంద్రబాబు పరిస్థితి ఇరకాటంలో పడింది. సొంత బంధు గణమే తిరుగుబాటు
ధ్వజమెత్తడంతో ఈ సమస్యను పరిష్కరించడమెలా? అని ఆయన మల్లగుల్లాలు
పడుతున్నారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల వైఖరితో ఆయన నొచ్చుకొన్నట్లు
సమాచారం.
రెండేళ్లలో సీన్ రివర్స్
కనీసం ఏడాదిపాటు శ్రమించి మొత్తం నందమూరి కుటుంబాన్ని ఒక తాటిపైకి తెచ్చిన
చంద్రబాబు నాయుడు ఆ తర్వాత రెండేళ్ళలోనే దానికి పూర్తి విరుద్ధమైన
పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్‌కు నందమూరి
కుటుంబంతో సవ్యమైన సంబంధాలు లేవు. కళ్యాణ్‌రామ్‌కు, జూనియర్‌కు మధ్య సఖ్యత
లేదు. కుటుంబాల మధ్య రాకపోకలు కూడా ఉండేవి కావు.
జూనియర్‌కు, బాలకృష్ణకు కూడా మాటలు లేవు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్నికల
ప్రచారంలో పాల్గొంటే ప్రయోజనం ఉంటుందని భావించిన చంద్రబాబు.. గత ఎన్నికలకు
ముందు అనేకసార్లు మాట్లాడటం ద్వారా వారందరినీ ఒక దగ్గరకు చేర్చగలిగారు. ఆయన
నివాసంలోనే ఈ దిశగా అనేకసార్లు కుటుంబ సమావేశాలు జరిగాయి. వీటి ఫలితంగా
బాలయ్య, ఎన్టీఆర్ కలిసి టీడీపీ సమావేశాలకు వచ్చే పరిస్థితి ఏర్పడింది.
పోయిన ఎన్నికల్లో వీరిద్దరూ టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
హరికృష్ణ అడగడంతోటే చంద్రబాబు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. పోయిన
ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ టిక్కెట్ల వ్యవహారంలో తండ్రి కొడుకులకు
మధ్య విభేదాలు ఏర్పడి ఆ ఎన్నికల్లో హరికృష్ణ ప్రచారానికి కూడా వెళ్ళలేదు.
అయినా అవి లోలోపలే ఉండిపోయాయి.
కానీ ఆ ఎన్నికల తరువాత టీడీపీ అధికారంలోకి రాకపోగా, వివిధ పరిణామాలు
చంద్రబాబుకు, నందమూరి వారసులకు మధ్య అగాథాన్ని ఏర్పరిచాయి. కాంగ్రెస్‌లో
వైఎస్ చనిపోయిన తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యంలో ముఖ్యమంత్రి పదవికి
ప్రచారం జరిగిన పేర్లలో పురంధేశ్వరి కూడా ఉన్నారు. తాను ముఖ్యమంత్రి అయితే
తనకు నందమూరి కుటుంబం మద్దతు ఉంటుందని చాటాలని ఆ సమయంలో ఆమె అనుకొన్నారు.
సరిగ్గా టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగే సమయంలోనే తన భర్త దగ్గుబాటి
వెంకటేశ్వరరావు స్వగ్రామంలో దివంగత ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ
కార్యక్రమాన్ని ఆమె ఏర్పాటు చేసి, దానికి నందమూరి కుటుంబ సభ్యులందరినీ
ఆహ్వానించారు. హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరులంతా దానికి
హాజరయ్యారు. సరిగ్గా టీడీపీ మహానాడు జరుగుతున్న సమయంలో దానికి పోటీనా..
అన్నట్లు జరిగిన ఈ కార్యక్రమానికి వీరంతా వెళ్ళడం చంద్రబాబును ఇబ్బందిలో
పడేసింది.
ఆయన ఒత్తిడితో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మహానాడు కార్యక్రమానికి కూడా వచ్చి
కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయారు. హరికృష్ణ ప్రోత్సాహంతోనే వీరంతా దగ్గుబాటి
స్వగ్రామంలో కార్యక్రమానికి వెళ్ళారన్న అనుమానం బాబు మనసులో నాటుకుంది.
తమను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని, తమకు పార్టీలో ప్రాధాన్యం
ఇవ్వడం లేదని ఆ తర్వాత నందమూరి వారసులు భావించడం మొదలుపెట్టారు.
మలుపు తిప్పన కృష్ణా ఘటన
కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్ళిన సమయంలో జరిగిన సంఘటనను
హరికృష్ణ తన మనసులోని అసంతృప్తిని బహిర్గతం చేయడానికి
వినియోగించుకొన్నారు. ముందుగా నిర్ణయించిన ఒక కార్యక్రమాన్ని హరికృష్ణకు
చెప్పకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు రద్దు చేయడం
ద్వారా ఆయనను అవమానించారంటూ ఆ జిల్లా టీడీపీ నేతలు వంశీ, కొడాలి నాని
బహిరంగంగా ధ్వజమెత్తారు.
కేవలం ఈ ఒక్క కార్యక్రమం గురించే కాక ఉమ వైఖరి గురించి, పార్టీ అంతర్గత
వ్యవహారాల గురించి వంశీ రెండు రోజులపాటు బహిరంగంగా మీడియాలో విమర్శలు
గుప్పించారు. ఈ పరిణామం కృష్ణా జిల్లా టీడీపీలో చిచ్చు రేపి ఉమ తన పదవికి
రాజీనామా చేసే వరకూ తెచ్చింది. తాను మాట్లాడుతున్న విషయాలన్నీ హరికృష్ణకు,
జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుసునని మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీగా
మాట్లాడుతూ వంశీ చెప్పారు.
ఆయన విమర్శల గురించి హరికృష్ణ "మాట్లాడనివ్వండి. ఏం జరుగుతుందో చూద్దాం''
అని ఈ విషయంలో తనను సంప్రదించిన కొందరు పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లు
సమాచారం. దీనితో హరికృష్ణ ప్రమేయంతోనే వంశీ బహిరంగంగా ధ్వజమెత్తారన్న
ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జరిగింది. హరికృష్ణ లక్ష్యం కూడా కేవలం
దేవినేని ఉమ కాదని, చంద్రబాబును నేరుగా అనలేక ఆయనకు దగ్గరగా ఉండే ఉమను
ఎంచుకొని దాడి చేయించారని కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
కృష్ణా జిల్లా పరిణామాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో
కలిసి సింగపూర్‌లో ఉన్నారు. శక్తి సినిమా విడుదలకు ముందు ఆయన జూనియర్
ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి ఆ సినిమా దిగ్విజయం కావాలని ఆశీర్వదించారు.
ఆ మర్నాడు వంశీ వివాదం చోటు చేసుకొంది. జూనియర్ ఎన్టీఆర్‌కు వంశీ
సన్నిహితుడు కావడంతో అసలేం జరిగిందో తెలుసుకోవడానికి చంద్రబాబు రెండో రోజు
సింగపూర్ నుంచి ఎన్టీఆర్‌కు ఫోన్ చేశారు. కానీ ఆయన ఫోన్‌కు ఎన్టీఆర్
ప్రతిస్పందించలేదు. ఆయన కాల్‌ను ఆన్సర్ చేయలేదు. దీనితో ఆగ్రహానికి గురైన
చంద్రబాబు కృష్ణా జిల్లాలో నేతలెవరైనా బహిరంగంగా పార్టీ విషయాలు
మాట్లాడితే కఠిన చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు.
నానీ, వంశీ పాత్రధారులే!
కృష్ణా జిల్లాకు హరికృష్ణ రావడం, దేవినేని ఉమ నిర్లక్ష్యం చేయడం, ఇవన్నీ
పైకి కనిపిస్తున్న కారణాలేనని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వల్లభనేని
వంశీ, నానీలు కేవలం పాత్రధారులేనని అంటున్నారు. కృష్ణా జిల్లాలో వివాదం
తీగను కదిపితే.. హైదరాబాద్‌లోని 'ఆహ్వానం' హోటల్‌లో డొంక కదులుతోంది.
పార్టీలో తమ కుటుంబ ప్రాబల్యం పెరగడానికి, జూనియర్ ఎన్టీఆర్‌ను వారసుడిగా
తెరపైకి తీసుకురావడానికి ఓ సుదీర్ఘ యుద్ధమే జరగాలని భావిస్తున్న హరికృష్ణ..
కృష్ణా జిల్లా వివాదం ఉపయోగించుకున్నారని అంటున్నారు.
జూనియర్‌కు కుడి, ఎడమ భుజాల్లా ఉండే వంశీ, నానీల సహకారం తీసుకున్నారని
సమాచారం. వంశీ, నానీల ఆవేశానికి హరికృష్ణదే స్క్రీన్‌ప్లే అని తెలుస్తోంది.
తాము ఎన్టీఆర్ కుటుంబ విధేయులమని పదే పదే చెప్పుకున్న వంశీ.. చంద్రబాబు
ఉనికిని కూడా ఎన్టీఆర్ అల్లుడుగానే గుర్తిస్తున్నట్లు చెప్పగలిగారంటే వారి
వెనుక హరికృష్ణ మద్దతు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు
అంటున్నాయి.
హరికృష్ణ, వంశీ, నానీలు రక్తికట్టించిన ఈ ట్రయాంగిల్ డ్రామాకు ఎన్టీఆర్
కుటుంబం మొత్తం మద్దతుగా నిలిచిందని సమాచారం. మీడియా ముందు వంశీ, నానీ
మాట్లాడిన వెంటనే వారికి హరికృష్ణ, ఆ తర్వాత బాలకృష్ణలు ఫోన్ చేసి
అభినందించారని, అండగా ఉంటాం.. రెచ్చిపోండంటూ సంకేతాలు ఇచ్చారని
విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఉగాది రోజున ఈ ఇద్దరు నేతలతో చంద్రబాబుతో
జరగబోయే సమావేశంలో ఏమేం మాట్లాడాలో నిర్దేశించారని తెలిసింది. ఈ
సమావేశానికి జూనియర్ కూడా హాజరైనట్లు సమాచారం.
తెరవెనుక పురందేశ్వరి?
నారా కుటుంబానికి, నందమూరి కుటుంబానికి మధ్య ఏర్పడిన అగాథాన్ని
వినియోగించుకొనే ప్రయత్నంలో పురందేశ్వరి తెర వెనుక చక్రం తిప్పుతున్నట్లు
చెబుతున్నారు. మొత్తం నందమూరి కుటుంబాన్ని తన వెనుక సమీకరించడం ద్వారా
కాంగ్రెస్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని, తద్వారా సీఎం పీఠాన్ని
అందుకోవాలని ఆమె ఆశిస్తున్నట్లు నందమూరి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
"కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం నాయకత్వ సమస్య ఉంది.
ఎవరికైనా ఎప్పుడైనా ఏ అవకాశం అయినా రావచ్చు. దానికోసం ఆమె తన వంతు
ప్రయత్నం చేస్తున్నారు. తన కుటుంబాన్ని తనకు మద్దతుగా మలచుకోవడంలో ఆమె కొంత
వరకూ విజయం సాధించినట్లు కనిపిస్తోంది'' అని ఆ వర్గాలు
అభిప్రాయపడుతున్నాయి. బంధుత్వం కారణంగా బాలకృష్ణ బహిరంగంగా బయట పడలేకపోయినా
హరికృష్ణ మాత్రం ఊరుకొనే పరిస్థితిలో లేరని, ఏదో ఒక రోజు ఆయన తిరుగుబాటు
ధ్వజమెత్తేది ఖాయమంటున్నారు.
తరచూ ఆయన మాట్లాడే మాటలు దానినే సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. హరికృష్ణ,
జూనియర్ ఎన్టీఆర్‌ల వైఖరితో చంద్రబాబు నొచ్చుకొన్నారు. "వారు ఏం అడిగినా
కాదనలేదు. హరికృష్ణ రాజ్యసభ సీటు అడిగినా, పొలిట్‌బ్యూరో సభ్యత్వం అడిగినా
ఇచ్చేశాను. జూనియర్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో వంశీకి సీటు కావాలంటే
ఇవ్వడంతోపాటు ఎవరికీ చేయనంత ఆర్థిక సాయం చేశాను. ఎంతో శ్రమపడి కుటుంబాన్ని
అంతటినీ ఒక తాటిపైకి తెచ్చాను. ఇంకా నన్ను టార్గెట్ చేస్తే ఎలా?'' అని ఆయన
అన్నట్లు సమాచారం.
తమ తండ్రి పెట్టిన పార్టీలో తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని, తమ
పరిస్థితి గౌరవ అతిథుల్లా ఉందని హరికృష్ణ అంటున్నారు. తన తర్వాత పార్టీకి
రాజకీయ వారసునిగా చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను ముందుకు తెచ్చే ప్రయత్నం
చేస్తున్నారన్న అనుమానం కూడా హరికృష్ణను తొలుస్తోంది. ఆయన ఆగ్రహానికి ఇది
కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారం ఎటు మలుపు తిరగబోతోందన్నది టీడీపీ వర్గాల్లో
ఆసక్తికరమైన చర్చగా మారింది. పురందేశ్వరి వ్యూహం ఫలించి నందమూరి కుటుంబం
ఆమెకు మద్దతుగా నిలిస్తే కుటుంబ వ్యవహారాల్లో చంద్రబాబు ఒంటరిగా
మిగిలిపోవాల్సి వస్తుంది. పురందేశ్వరిని టీడీపీలోకి తెచ్చి తామంతా అండగా
నిలవడం ద్వారా ఆమెను చంద్రబాబు స్థానంలో నిలపాలన్న ఆలోచన కూడా నందమూరి
కుటుంబంలో కొందరిలో ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.
ఏ కుటంబాన్నైతే అతి కష్టం మీద ఒక్కటి చేసి, పార్టీకి బలం తేవాలని
చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారో.. ఆ కుటుంబమే ఇప్పుడు ఒక్కటై చంద్రబాబుకు
చెక్ చెప్పే ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. అయితే.. "చంద్రబాబు ఇలాంటి
సంక్షోభాలను చాలా చూశారు. దీనిని కూడా అధిగమిస్తారు'' అని ఎన్టీఆర్ అభిమాన
సంఘాల అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీపతి రాజేశ్వర్ ఆశాభావం వ్యక్తం
చేశారు.
కృష్ణా పరిణామాలపై దృష్టి
ఈ మొత్తం పరిణామాలకు కేంద్ర బిందువుగా మారిన కృష్ణా జిల్లా వ్యవహారాలపై
టీడీపీ అధిష్ఠానం దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం కడప జిల్లాలో ఎన్నికల
వ్యూహ రచనలో మునిగి తేలుతున్న ఆ పార్టీ.. రెండు మూడు రోజుల తర్వాత ఆ జిల్లా
నేతలను హైదరాబాద్ పిలిపించాలని భావిస్తోంది. సమస్యకు కారణాలేమిటో
అన్వేషించి, దానిని బట్టి పరిష్కారం ఆలోచించాలని అనుకొంటోంది.