సువర్ణావకాశాన్ని వదులుకోవద్దు
- భోగాది వేంకటరాయుడు
అధికారంలోకి రావడానికి తాళం చెవి చంద్రబాబు చేతుల్లోనే ఉంది. ఆయన
చెప్పవలసిన రెండు ముక్కలూ వదిలేసి అవసరంలేని అరవై ఆరు విషయాలు చెప్పడం
వల్ల ఎంత ఉపయోగముంటుందో ఆయన ఆలోచించుకోవాలి. పాదయాత్ర ద్వారా లభించిన
సువర్ణావకాశంలో చంద్రబాబు నేలవిడిచి సాము చేస్తున్నారనేదే ఆయన అభిమానుల
ఆందోళన అంతా. భేషిజం ప్రమాదకరం.
రాజకీయాలు వేరు. అధికారం వేరు. రాజకీయాలతో ప్రజలను విశేషంగా
ఆకట్టుకున్నవారు - అధికారాన్ని చేజిక్కించుకోలేకపోవచ్చు. అధికారాన్ని
చేజిక్కించుకునే కిటుకులు తెలిసిన వారు - రాజకీయాల్లో గెలవలేకపోవచ్చు.
ఇందుకు వర్తమాన రాజకీయాలలో ఎన్ని ఉదాహరణలైనా కనిపిస్తుంటాయి. వామపక్షాలనే
తీసుకుంటే, ప్రజల కోసం సమాజంలోని నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రాణాలకు
తెగించి మరీ వారు ఉద్యమిస్తుంటారు. వారి ఉద్యమ లక్ష్యాలతో విభేదించే వారు
కనిపించరు.
అయినప్పటికీ పాలనాధికారం అనేది వారికి కనుచూపు మేరలో
కనిపించదు.
చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయాణం చిత్రాతి చిత్రమైనదనే చెప్పాలి. 1978
నుంచీ ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పటికీ గత ఆరు నెలల్లోనే ఆయన ఒక
పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారు. ఆయన ప్రజా జీవనంలోకి
అడుగుపెట్టిన దగ్గర నుంచీ అధికారానికి దగ్గరగానో... అధికారంలోనో ఉండడం వల్ల
విజయవంతమైన నాయకుడిగా ఎదిగే అవకాశం లభించలేదు. కాంగ్రెస్‌లో ఉన్నంత కాలమూ
అధికారానికి దగ్గరగానో... అధికారంలోనో ఉన్నారు.
తెలుగుదేశంలోకి
వచ్చిన తరువాత అధికారంలో మునిగి తేలడమే సరిపోయింది. ఈ హవా 2004 ఎన్నికల
వరకు కొనసాగుతూనే ఉంది. 2004 ఎన్నికల తరువాత ప్రారంభమైన రాజశేఖర రెడ్డి
రాజకీయ ప్రభంజనం ముందు రాజకీయ నాయకుడిగా ఎదిగే అవకాశం చంద్రబాబు నాయుడికి
లభించలేదు.
రాజశేఖర రెడ్డి అకాల మరణంతో, కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య ఎదురైంది.
రాష్ట్రం సంగతి దేవుడెరుగు - కనీసం ఒక్క జిల్లానైనా ప్రభావితం చేయగలిగిన
నాయకుడు లేని పరిస్థితి ఆ పార్టీలో కనిపించింది. కాంగ్రెస్‌లో ఎవరికి వారే
ఒక రాజశేఖర్ రెడ్డిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
అటు రాజకీయం,
ఇటు పాలనా వ్యవస్థ కూడా చిన్నాభిన్నమై పోయాయి. నిజానికి - తిరిగి
అధికారంలోకి రావడానికి - తెలుగుదేశం పార్టీకి ఇంతకంటే అనువైన రాజకీయ
పరిస్థితి మరొకటి ఉండదు. కానీ, పులి మీద పుట్రలా - వైఎస్ జగన్మోహన రెడ్డి
తెరమీదకు వచ్చారు.
రాజశేఖర రెడ్డి అకాల మరణం వల్ల ప్రజల్లో
పెల్లుబికిన సానుభూతి కెరటాలను ఆయన ఒడుపుగా పట్టుకుని, తనవైపు
మళ్ళించుకోగలిగారు. మొత్తం రాజశేఖర రెడ్డి కుటుంబం అంతా ప్రజా జీవనంలోకి
అడుగుపెట్టింది. దీంతో తెలుగుదేశం ఆశలు ఆవిరైపోయాయి. ఒక పక్క జగన్, మరో
పక్క టీఆర్ఎస్ విసిరిన సవాళ్ళతో తెలుగుదేశం ఉక్కిరిబిక్కిరై పోయింది.
కోస్తా ఆంధ్రలో జగన్, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీని
నల్లిని నలిపినట్టు నలిపేశాయనే భావన రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది.
35 ఏళ్ళ రాజకీయ జీవితంలో దాదాపు పాతికేళ్ళు అధికారానికి దగ్గరగానో...
అధికారంలోనో ఉన్న చంద్రబాబు నాయుడుకు అసలైన పరీక్షా సమయం ఎదురైంది.
నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనే సామెత ఉంది కదా! మనకు ప్రాణం
మీదకు వచ్చినప్పుడే సరికొత్త ఆలోచనలు మొగ్గతొడుగుతాయి. రాజధానిలో
మ్యానిప్యులేటివ్ రాజకీయాలకు దూరంగా.. ప్రజలకు వీలైనంత దగ్గరగా...
వీలైనంత ఆత్మీయంగా జనంలోకి చొచ్చుకుపోవడం తప్ప తనకు, తెలుగుదేశం పార్టీకి
కూడా ఇక తరుణోపాయం లేదనే నిశ్చితాభిప్రాయానికి చంద్రబాబు నాయుడు వచ్చారు.
సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం ఇది అనడంలో సందేహం లేదు.
అక్టోబర్ 2, 2012 చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఒక మైలురాయిగా
గుర్తుంచుకోదగిన రోజు. కేవలం ఎత్తులు పైఎత్తులతోనే రాజకీయ జీవితం అంతా
గడుపుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందడానికి
అవకాశం కల్పించే సుదీర్ఘ పాదయాత్రకు అంకురార్పణ జరిగిన రోజు అది. పాదయాత్ర
ప్రారంభమై ఇప్పటికి దాదాపు 180 రోజులు కావస్తున్నది. 2,500 కిలోమీటర్లకు
పైగా నడిచారు. అసంఖ్యామైన సభల్లో మాట్లాడారు. కాంగ్రెస్‌ను, జగన్ పార్టీని
- తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌గా అభివర్ణిస్తూ జనంలోకి
చొచ్చుకుపోతున్నారు. ఈ రెండు పార్టీలనూ తూర్పారబడుతున్నారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమైన పాదయాత్ర రాయలసీమ దాటి, తెలంగాణను
చుట్టేసి ఇప్పుడు తూర్పుగోదావరిలో సాగుతోంది. లంపకలోవ తిరుణాళ్ళకో...
సమ్మక్క-సారలక్క జాతరకో వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు సభలకు జనం
పోటెత్తుతున్నారు. చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
చేయబోతున్నారా? ఆ లక్ష్య సాధనలో ఈ పాదయాత్ర ఆయనకు; ఆ పార్టీకి ఎంతవరకు
ఉపయోగపడుతుంది? ఓటేసే జనంపై చంద్రబాబు నాయుడు అంచనాలు ఏమిటి? చంద్రబాబు
నాయుడిపై జనం అంచనాలు ఏమిటి?
రాయితీలకు, ఉచితాలకు జనం అలవాటు పడిపోయారు.
అసలు - అవి ఒక హక్కుగా
భావిస్తున్నారు. 'నేను పిల్లల్ని కంటాను. ఆస్పత్రి బిల్లు కట్టు. బట్టలు
కుట్టించు. స్కూలు ఫీజులు కట్టు. పెళ్ళి చెయ్యి. తింటానికి బియ్యం, సరుకులు
ఇంటికి పంపించు. మా ఇంటికి, పొలానికి కరెంటు సప్లయి చెయ్యి. ఏం? ఓటేయడం
లేదా? మీరు తేరగా తినేయడం లేదా? ఎంత తింటున్నారో మాకేమన్నా తెలుస్తుందా? ఈ
మాత్రం మాకు పెట్టడానికి మీకు బాధ ఏమిటి?' అనే మనస్తత్వం జనంలో
జీర్ణించుకుపోయింది. ఈ పాపం గత పాలకులదే అనడంలో సందేహం అవసరం లేదు. గ్రామీణ
జనం - వారి బతుకులు వారు బతికే పరిస్థితులు లేవు.
నిజాయితీగా
కష్టపడి, నాలుగు రాళ్ళు సంపాదించుకుని - సుఖంగా జీవించే పరిస్థితులు లేవు.
ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితులు లేవు. వారు జీవించడానికి అనువైన
పరిస్థితులు లేవు. అందుకే - రాయితీలను ఆశిస్తున్నారు. డిమాండ్
చేస్తున్నారు. చివరకు హక్కుగా భావించే స్థితికి వచ్చారు. అందుకే చంద్రబాబు
నాయుడు రాయితీల వరదకు గేట్లు బార్లా తెరిచారు. రాయితీలు ప్రకటించని రాజకీయ
నాయకుడు సామాజిక హితం కోరని నేతగా జనం భావించే ప్రమాదం ఉంది. అందువల్ల
చంద్రబాబు నాయుడిని తప్పుపట్టడం కష్టం.
అయితే ఈ రాయితీలతో చంద్రబాబు నాయుడు గట్టెక్కగలరా అన్నది ప్రధానం. 2004లో
చంద్రబాబు నాయుడును ఎందుకు ఓడించారు? ఇప్పుడు ఆ జనమే ఎందుకు గెలిపించాలని
చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు? ఈ రెండు ప్రశ్నలకు ఈ 180 రోజుల
పాదయ్రాతలో ఎక్కడా సమాధానం దొరకడం లేదు. 2004 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో
చంద్రబాబుకు తెలుసు. అంత కసిగా ఆయనను ఓడించారో జనానికి తెలుసు.
అయినప్పటికీ 1999 నుంచి 2004 మధ్యకాలంలో తెలుగుదేశం పాలనలో జనానికి కలిగిన
కష్టనష్టాలకు చంద్రబాబు నాయుడు గానీ, మరొక నాయకుడు గానీ పశ్చాత్తాపం
ప్రకటించిన దాఖలాలు ఈ పాదయాత్రలో ఎక్కడా కనబడలేదు. అటువంటి తప్పులు ఇక
పునరావృతం కావన్న భరోసా చంద్రబాబు నోటి వెంట వెలువడిన సందర్భం కనబడదు.
చంద్రబాబు పేరు చెబితే ఆయన పాలనా సామర్థ్యం కంటే ఆయన పాలనలో జనం ఎదుర్కొన్న
ఇబ్బందులే ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయి.
అయినప్పటికీ చంద్రబాబు ఈ
విషయాన్ని అసలు గమనించనట్టుగానే మాట్లాడుతున్నారు. ఆత్మవంచనకు పాల్పడుతూ
ఆత్మస్తుతి పరనింద ఉపన్యాసాలతో తన్మయత్వానికి లోనవుతున్నారు. కాంగ్రెస్‌ను
జగన్ పార్టీని తూర్పారబట్టడం వల్ల తమ పార్టీని గెలిపించగలరని చంద్రబాబు
నాయుడు భావిస్తున్నట్టు కనబడుతున్నది. అంటే నెగెటివ్ఓటు మీదే ఆయన
అధికారంలోకి రావాలని భావిస్తున్నట్టు కనబడుతున్నది తప్ప పాజిటివ్ ఓటు అనేది
ఒకటుంటుందనే ఆలోచనే ఆయనకు వస్తున్నట్టు లేదు.
చంద్రబాబు మంచి పాలనాదక్షుడు. సుదీర్ఘ కాలం పాటు అధికారంలోనో...
అధికారానికి దూరంగానో ఉన్నారు. దూరదృష్టి ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి
చేయాలనే తపన ఉంది. అద్భుతమైన కార్యకర్తల యంత్రాంగం ఆయనకు అందుబాటులో ఉంది.
అయితే, ఆత్మశోధనలో నిజాయితీయే ఆయనలోఆయనలో కనిపించడం లేదు. తాను, గతంలో
చేసిన తప్పులు ఏమిటో కనబడడం లేదు.
అధికారంలోకి రావడానికి తాళం చెవి చంద్రబాబు చేతుల్లోనే ఉంది. ఆయన
చెప్పవలసిన రెండు ముక్కలూ వదిలేసి అవసరంలేని అరవై ఆరు విషయాలు చెప్పడం
వల్ల ఎంత ఉపయోగముంటుందో ఆయన ఆలోచించుకోవాలి. పాదయాత్ర ద్వారా లభించిన
సువర్ణావకాశంలో చంద్రబాబు నేలవిడిచి సాము చేస్తున్నారనేదే ఆయన అభిమానుల
ఆందోళన అంతా. భేషిజం ప్రమాదకరం.
- భోగాది వేంకటరాయుడు