NTR's speech on 1 Nov 1986

7 views
Skip to first unread message

n m rao

unread,
Jan 19, 2013, 10:15:40 PM1/19/13
to manakosamt...@googlegroups.com

1986 నవంబర్ 1న నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు రాష్ట్ర అవతరణోత్స వాల సందర్భంగా
దేశ రాజధాని కొత్త ఢిల్లీలో చేసిన చారిత్రక మహోపన్యాసం పూర్తి పాఠాన్ని
శ్రీ రామారావు వర్ధంతి సందర్భంగా పునఃశ్చరణ చేసుకొని పునరుత్తేజులం కావడం
తెలుగువారిగా మన కనీస కర్తవ్యం, విధ్యుక్త ధర్మం.

మన విశిష్ట వారసత్వాన్ని మరువరాదు

 ఆ మహానుభావుడు ధీరోదాత్తుడు, మూర్తీభవించిన తెలుగు విరాట్ స్వరూపం. యావత్తు తెలుగు జాతి హృదయాంతరాళల్లో శాశ్వతంగా పవిత్ర స్థానాన్ని ఆర్జించుకొన్న శేముషీ దురంధరుడు. ఆయనది ప్రతి తెలుగు వ్యక్తి మదిలో 'అన్నగా' శాశ్వితమైన స్థానం. తరతరాల తెలుగు ఆచార వ్యవహారాలకు, వైభవ ప్రాభవాలకు, సంస్కృతీ సంప్రదాయాలకు, ఆయన పరిపూర్ణ దర్పణం. తెలుగు వ్యక్తిత్వానికి, అస్తిత్వానికి, పౌరుషానికి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం ఆయన విశిష్ట మూర్తిమత్వం. ఆయన నరనరాల్లో ప్రవ హించేది పరమ పవిత్రమైన తెలుగు రక్తం. ఆయన హృదయస్పందన యావత్ తెలుగు జాతి నాడి సంకేతం.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా, సాటిలేని మేటి ప్రజానాయకుడిగా, అత్యంత సమర్ధుడైన రాష్ట్రాధినేతగా భాసిల్లి - ఎనలేని ధైర్యంతో ఆయన స్థాపించిన రాజకీయపార్టీకి 'తెలుగు దేశం' అని పేరుపెట్టి - అధికారం చేపట్టిన - అధికారం చేపట్టిన తర్వాత ఆయన ప్రారంభించిన విషయం ఎవరు, ఎప్పటికి మార్చలేని, మరుగుపర్చలేని చారిత్రక వాస్తవం. యావత్ ప్రపంచంలో తెలుగుజాతి ప్రత్యేకతను, వ్యక్తిత్వాన్ని, ఉత్కృష్టతను, ఔన్నత్యాన్ని పరిఢవిల్లజేసిన మహనీయుడు ఆయన.

'ఏ వినీలాకాశ గర్భమునుండి, ఏ యుగారంభ సంరంభమున భారతీయ ప్రేమామృతం అవనికి దిగివచ్చెనో, ఎవరు చెప్పగలరు? ఇయ్యది కాలమువలెనే అనంతము. ఆకసమువలెనే సర్వవ్యాప్తము' అని ఒక సందర్భంలో శ్రీ ముట్నూరీ కృష్ణారావు వ్రాసిన వాక్యం శ్రీరామారావుకు ఎంతగానో వర్తిస్తుంది.

ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన తెలుగు ప్రపంచ మహాసభల్లో అనేక మంది తెలుగు భాషాభిమానులుగా, ప్రియులుగా, ప్రోత్సాహకులుగా చాటుకొంటున్న మహానాయకులు, మహాకవిపండితులు, కళాకారులు, ప్రభుత్వ పల్లకీ మోస్తున్న మేధావి గణాలు-కొన్ని సంవత్సరాల క్రితమే - తెలుగు నేలలోనే కాదు యావత్ భారతదేశంలోని అనితర సాధ్యమైన చరిత్ర సృష్టించిన ఒక యధార్థ, అద్వితీయ ప్రజానాయకుడు, రాష్ట్రాధినేత, స్వచ్ఛ స్పటికమైన తెలుగు వల్లభుడు నందమూరి తారకరామారావు మహోదయుని నామస్మరణ కూడా లేకుండా, రాకుండా, ఆయన పేరు కూడా స్మరించకుండా తెలుగు మహాసభలు నిర్వహించడం మన ఘనీభవించిన కృతఘ్నత.

ఈ నికృష్ట , సంకుచితత్వం ఆయన విశుద్ధ ఆత్మకు చేసిన మహాపచారం -ఘోర అపరాధం. ఈ మహా ప్రహసనానికి అశక్త సాక్షీభూతంగా నిలచినందుకు సిగ్గుతో, బాధాతప్త హృదయంతో తలదించుకుని -తెలుగుతల్లి ప్రియ పుత్రుడైన ఆ అనర్ఘ తెలుగుతేజోరాశికి అపరాధ, క్షంతవ్య, వినమ్రతతో 1986 నవంబర్ 1న ఆయన రాష్ట్ర అవతరణోత్స వాల సందర్భంగా దేశ రాజధాని కొత్త ఢిల్లీలో చేసిన చారిత్రక మహోపన్యాసం పూర్తి పాఠాన్ని శ్రీరామారావు వర్ధంతి సందర్భంగా పునఃశ్చరణ చేసుకొని పునరుత్తేజులం కావడం తెలుగువారిగా మన కనీస కర్తవ్యం, విధ్యుక్త ధర్మం.

తెలుంగా నీకు దీర్ఘాయురస్తు-
తెలుంగురాయ నీకు బ్రహ్మాయురస్తు -
'జయంతితే సుకృతినో..
. నాస్తితేషాం యశఃకాయ జరాన్మరణజం భయం'
-భర్తృహరి



రామారావు ప్రసంగ పాఠం:
దేశ రాజధానిలో ఉన్నా, ఎక్కడ వున్నా మన విశిష్ట వారసత్వాన్ని మనం మరువరాదు, మరువకూడదు-
మన గడ్డకు విలువ తెచ్చే విధంగా, ప్రతిష్ఠ పెంచే విధంగా, బాధ్యత గుర్తించి అనుక్షణం, ప్రతిక్షణం సర్వదా-సర్వధా ఎవరైతే తమ అమూల్య ప్రాణాలను, విలువైన జీవితాలను నివేదన యిచ్చి కవోష్ణ రుధిరాన్ని ధారవోసి, వెచ్చని పారాణి భరతమాత పాదాలకు దిద్దారో, ఎవరి త్యాగఫలంగా స్వతంత్ర భారత పౌరులుగా ఈనాడు ప్రపంచ పౌరసత్వాన్ని సంపాదించుకున్నామో, అట్టి స్వాతంత్య్ర ఫలం సర్వులకూ అందజేస్తామని, సమాజంలో అన్ని వర్గాలకు,

'జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసీ'


30 వ రాష్ట్ర అవతరణ దినోత్సవ మంగళాశ్వాసనాసదస్సు, మన రాజధాని హస్తినలో జరుపుకోగలగడం, మన పవిత్ర రాజ్యాంగ బద్ధులై, దేశ సమైక్యతను రాష్ట్ర సమన్వయతను గౌరవించి, భారతదేశ పటిష్ఠతకు పరమమైత్రీ బంధాన్ని మూల సూత్రంగా ఉపాసిస్తున్న 72 కోట్ల వివిధ రాష్ట్రాల పౌరులకు, సమస్త ప్రజానీకానికి, ఆరు కోట్ల తెలుగు ప్రజానీకం తరఫున, ప్రభుత్వం తరఫున పలుకుతున్నాను సుమ ఆశీః శుభాభినందనం, ఘటిస్తున్నాను అభివందనం-దిగ్దిగంత విశ్రాంత యశో విరాజితులై ఖండ ఖండాంతరాలలో తెలుగుజాతి సంస్కృతీ వికాస విభవాలకు , ప్రజ్ఞా పాటవాలకు , శేముషీ దురంధరతకు, ప్రతీకలై వాస ప్రవేశాలలో వెలుగులు నింపుతున్న ప్రవాసాంధ్ర ప్రజా సందోహానికి దివ్య ఆశీః ప్రవచనం-

తొలుత మనం భారతీయులం-
ఆ తరువాత వివిధ రాష్ట్ర వాసులం-
భిన్నత్వంలో ఏకత్వం మన ఆదర్శం-
'ఏదేశమేగినా ఎందుకాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని-
నిలుపరా నీ జాతి నిండు గౌరవము...'



తెలుగు అనే శబ్దం శతాబ్దాల బరువును మోస్తున్నది. ఐతరేయ శతపత బ్రాహ్మణులలో తెలుగుజాతి ప్రసక్తి ఉన్నది. మౌర్య వంశం ఏకచ్ఛత్రాధిపత్యం నడిపిన కాలంలో సామంత ప్రతిపత్తి గల్గిన తెలుగువారు ఆ సామ్రాజ్యం క్షీణించిన తర్వాత, ఒక బలవత్తరమైన సర్వసత్తాక రాజ్యాంగ వ్యవస్థను రూపొందించుకున్నారు. శాతవాహనులనాడే తెలుగు వారి పరిపాలనా దక్షత మన దేశం నాలుగు చెరగులా చెరగని ముద్ర వేసింది. వారు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి సుమారు 450 సంవత్సరాలు అవిచ్ఛన్నంగా, నిరాఘాటంగా పరిపాలించి, ఆర్థిక సామాజిక పటిష్ఠతను సాధించి, వాజ్ఞ్మయానికి, విజ్ఞానానికి, లలిత కళలకు, అపూర్వమైన పోషణ నిచ్చి ప్రతిభావంతమైన చరిత్రను సృష్టించుకున్నారు.

తర్వాత అనేక చిన్న రాజవంశాలు- ఇక్ష్వాకులు, శాలంకాయనులు, బృహత్పలాయునులు, విష్ణు కుండినులు, విష్ణు వర్ధనులు, పల్లవులు, తూర్పు, పశ్చిమ చాళుక్యులు, రెడ్డి రాజులు వివిధ ప్రాంతాలలో రాజ్యాలు స్థాపించి పాలించారు. కాకలు తీరిన కాకతీయుల కరవాలాలఖేణ ఖణలు తెలుగునాట ప్రతిధ్వనించాయి. తెలుగు వారి కీర్తి చంద్రికలు పున్నమితో పరిమళించి గుభాళించాయి. సస్యశ్యామలమై, సౌభాగ్య నిలయమై, సుఖ సంతోషాలకు ఆలవాలమై అలరిన తెలుగుజాతి యశో ప్రాభవం సరిహద్దులు దాటి, సాగర తీరాల నధిగమించి సుదూర ప్రాంతాలకు విస్తరించింది.

తెలుగు నేలపై పూచి, నవ్యతతో కొంగ్రొత్త రీతులలో పరిఢవిల్లిన తెలుగువారి కళా వైదుష్యం వెలుగు పందిళ్లు వేసి దశ దిశలా యశఃకాంతులు విరజిమ్మింది. విజయనగర రాజవీధులలో రత్నాలు బేహారు జరిగిందట. ఆనాడు ఆత్మ తృప్తికి, సాహితీ సౌరభాలకు, వేదాంత విజ్ఞాన విశేషాలకు కలిమికీ, బలిమికీ కొరత లేనంత అఖండంగా జీవించారు. మన వారు సోదర భావం, సౌహార్ధత సర్వమత సహనం ప్రదర్శించారు.

ఆనాడే ఛండాలోస్తు -చతుర్విదోస్తు అన్న ఆదిశంకరుల సమ భావనా విధానం, ఆనాటి పలనాటి బ్రహ్మన్న చాపకూటి సిద్ధాంతం, అనేక రాజ్యాల సామ్రాజ్యాల శౌర్య సాహస విస్తరణం, పతనం, ఆ నదీపరీవాహక ప్రాంతాలలో సంభవించాయి. వివిధ వంశాల వైభవ స్పందనం ఆ నదీతారలనే పులకితం ప్రభావితం. గోదావరి చారిత్రక స్రవంతి అయితే, కృష్ణవేణి సాంస్కృతిక ప్రవాహం-

'దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్ '
అని రవళించిన గురజాడ ప్రభోదం -
'పొలాలనన్నీ హలాలదున్నీ ఇలాతలంలో హేమం నిండగ'



అన్న శ్రీ శ్రీ విప్లవ భావోద్దీపనా ప్రభంజన స్ని గ్ధ సుజల, వాహినీ ధారలుగా, అమృత వాహినులుగా, తెలుగు గడ్డను పునీతం చేస్తున్న పవిత్ర కృష్ణా, గోదావరీ, పెన్న, తుంగభద్రల పావన పానం-తెలుగుజాతి చైతన్యం- వేదాంత విజ్ఞాన విభవా సంపద- చిలికిన దివ్యాక్షణా సంప్రోక్షణం- అసంఖ్యాక దేవాలయాలు, బౌద్ధారామాలు, విద్యా పీఠాలు, అద్భుత శిల్ప కళాఖండాలు తెలుగు వారి కళా ప్రాభవ ప్రతీకలు ఆ నదీతీరాలనే సాక్షాత్కరించాయి.

తుంగభద్రా తీరాన తెలుగువారి విజయ ప్రతాపం మహోన్నత శిఖరాలను అధిరోహించి, స్వన్న కథావిశేషమై, చరిత్ర గర్భంలో కలిసిపోయింది. ద్రవించిన శిలలు మన కన్నీటిలో కదలాడుతున్నాయి, తెలుగు వారి పరిపాలనా దక్షత, రాజనీతిజ్ఞత, జగద్విఖ్యాతి గాంచిన కళా ప్రసన్నతతో సింగారించుకున్న వారి పరిశ్రమలు, వ్యాపార కుశలత, భాషాపరిణామ వికాసం, తాత్విక, వైజ్ఞానిక ప్రసారం, మహోజ్వలమైన సాహిత్య సృష్టి అయ్యారే అది అద్వితీయం. అది అపూర్వం. ఇదంతా సారభూతమైన గతం. మనకెంతో పవిత్రమైన, గర్వకారణమైన వారసత్వ సంపద. మన నాగరికత, సంస్కృతీ సంప్రదాయ వికాసాలకు, మన జాతి ఉత్కృష్టతకు, ఔన్నత్యానికి, కారణభూతులైన మహనీయులకు మనమెప్పుడూ కృతజ్ఞులమే.

తెలుగువారి ప్రతిభను, వారి నాగరికతను, సంస్కృతీ ప్రాశస్త్యాన్ని, వారి మహోజ్వల చరిత్రను ప్రజల స్మృతి పరిధులలోనికి తేవడం మన పురా వైభవాన్ని గుర్తు చేయడమే. జాతీయ భావానికి పునాది స్మృతి ప్రవణతే. భావ సమైక్యతకు, చైతన్య స్ఫూర్తికి, సామాజిక పటిష్ఠతకు, భావి భాగ్యోదయానికి ప్రగతి పురోగమునకు వెలుగు బాటలు వేసేది మహిమాన్వితుల జీవన సంస్మరణమే.

అమెరికన్లు న్యూయార్క్ నౌకాశ్రయ ద్వారంలో స్వాతంత్య్ర దేవతా ప్రతిమను ప్రతిష్ఠించినా, రష్మోర్ పర్వత సానువుల మీద ప్రముఖ అమెరికా అధ్యక్షుల ముఖాలను మలచినా, మరొక చోట పిరమిడ్లను నిర్మించినా స్మారక భవనాలు కట్టినా, ప్రాచీన శిథిలాలను చారిత్రక అవశేషాలను భద్రపరచినా ఇతిహాసాలు రచించి, వీర గాథలను వినిపించినా ధ్యేయమొక్కటే- సారభూతమైన గతానికి అమరత్వం కలిగించడం, మన పూర్వుల భావపరంపరలను, సత్యాన్వేషణా నిరతిని, కళాభిజ్ఞతను, ఆదర్శాలను, మహోజ్వలతను వర్తమాన జీవిత విధానాలతో అనుసంధించడం.

' పృధ్వీతలం మహనీయుల సుప్తాస్థికల సమాధీ' అన్న గ్రీకు రాజనీతిజ్ఞుడు పెరిక్లస్ మాటల అంతరార్థం ఇదే. ఈ విధంగా పరికించి, పరిశీలించినట్లయితే మహనీయులు జీవిత సమాహారమే మానవ చరిత్ర అన్న సత్యం స్ఫురిస్తుంది.

అటువంటి పరమోత్తమ మానవ చరిత్రకు రూపకల్పన చేసి మహనీయులను సంస్మరించుకోవడం, వారి అడుగుజాడల్లో పయనించడం, పురోగమించడం మన మందరి కర్తవ్యం. జాతిని సుసంపన్నం చేసిన చరిత్రకు కొత్త సొగసులు కూర్చిన తేజో మూర్తులను అలక్ష్యం చేయడం, విస్మరించడం మానవాదర్శం కాదు-కారాదు.

చిరకాలంగా తెలుగు జాతికి జీవగర్రలై, స్ఫూర్తి ప్రదాతలై, పథనిర్దేశకులై ధ్రువ తారలుగా నిలిచిన మహనీయులను మన స్మృతిపథంలో గౌరవించుకోవడం, చెరిగిపోని రీతిగా సుస్థిరంగా ప్రతిష్ఠించుకోవడమే మన జాతి జీవిత, జీవన పరమార్థం. ఆ మహనీయుల, చరితార్థుల భావపరంపరలను, సత్యాన్వేషణా నిరతిని, కళాభిజ్ఞతను, ఆదర్శాలను, మహోజ్వలతను, వర్తమాన జీవన విధానాలతో అనుసంధించడం, మన చారిత్రక కర్తవ్యం. విస్మరించగూడని బాధ్యతా విధానం.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి మునుపే దక్షిణాపథంలో చైతన్యానికి లక్షీ నరసుచెట్టి మూల పురుషుడని చరిత్ర చెబుతున్నది. సత్యాగ్రహ సమరాన్ని నడిపిన జాతిపిత పూజ్య బాపూజీ, సత్యాహింసలే ఆయుధాలుగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య సింహాన్ని జూలుపట్టి, అదలించి మాతృభారతిని విదేశ దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేశాడు. ఆ స్వతంత్ర మహా సంగ్రామంలో ఆ జాతిపిత ఆధ్వర్యంలో తెలుగు వారు నిర్వహించిన పాత్ర అనన్య సామాన్యము, అద్వితీయము.

సర్వశ్రీ కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, టంగుటూరి ప్రకాశం, గాడిచర్ల హరి సర్వోత్త మరావు, త్రిపురనేని రామస్వామి చౌదరి, గొట్టిపాటి బ్రహ్మయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, కల్లూరి సుబ్బారావు, బులుసు సాంబమూర్తి, క్రొవ్విడి లింగరాజు, డాక్టర్ పట్టాభి సీతారామయ్య , అయ్యదేవర కాళేశ్వరరావు, అనేక మంది సుప్రసిద్ధ పాత్రికేయులు, ఆధునిక కవులు, మున్నగు తెలుగు ప్రముఖుల మాననీయమైన సారథ్యంలో తెలుగువారు అపూర్వ త్యాగాలు చేశారు.

స్వరాజ్యఉద్యమంలో సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ ముఖ్, వేలాల కృష్ణాబాయమ్మ, వావిలాల మాణిక్యాంబ ఇంకా ఎందరో మరెందరో మహిళామణులు వీరోచిత పాత్ర నిర్వహించారు. అజ్ఞాత వీరులైన స్వచ్ఛంద సేవకులు దేశ సేవలో తమ సర్వస్వాన్ని ధార పోశారు. కవోష్ణ ధారలతో భరత మాత పాదకమలాలకు వెచ్చని పారాణి దిద్దారు. అమరత్వంలో దివ్యత్వం సిద్ధించుకున్నారు.

జాతికే గర్వకారణమైన, భారత స్వాతంత్య్ర సమరదీప్తి జ్వాలకు చిహ్నమై నేడు విశ్వంభర వీధులలో ఉత్తిష్టంగా రెపరెపలాడుతున్న జాతీయ పతాక ప్రదాత పింగళి వెంకయ్య తెలుగువారి కీర్తి తిలకం.

మధ్యందిన భానుడిలా మన్నెంలో మెరిసి బెబ్బులిలా గాండ్రించి కుటిల నియంతల ఆగడాలకు స్వైర విహారాలకు బలై బ్రతుకుతున్న ఆటవికులను సంఘటితపరచి, తెల్ల దొరల గుండెల్లో నిదురించిన తెలుగు తల్లి అనుంగు బిడ్డ అల్లూరి సీతారామరాజు కు గుండెల నిండుగా స్మృత్యంజలి. భారత స్వాతంత్య్ర సమరారంభ దినాలలోనే ప్రత్యేక రాష్ట్ర నిర్మాణో ద్యమానికి అంకురార్పణ జరిగింది. ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురుమూర్తి, చెట్టి నరసింహం ఆ భావానికి నాందీ వాచకం పలికారు.

అయితే 1920 నుంచి 1936 వరకు ప్రత్యేక రాష్ట్ర్టోద్యమ నినాదం, భారత స్వాతంత్య్ర సమర దుందుభిధ్వానాల మధ్య మూగబోయింది. స్వాతంత్య్ర సముపార్జనానంతరం భాషాప్రయుక్త రాష్ట్ర నిర్మాణాన్ని సూత్రప్రాయంగా కేంద్రం అంగీకరించినప్పటికీ తెలుగువారి ఆశయం సిద్ధించలేదు. అకళంక దేశభక్తుడు, అద్వితీయ త్యాగనిరతుడు, ప్రత్యేక రాష్ట్ర సాధన దీక్షా కంకణుడు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో కాని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించలేదు.

హైదరాబాదు సంస్థానంలో మ్రగ్గుతున్న ప్రజానీకం, నిజాం నిరంకుశత్వ పీడనకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమాలు సర్వశ్రీ మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, ముందుమల నరసింగరావు, రామనంద తీర, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, జమలాపురం కేశవరావు, కొమరం భీం, కొండా రంగారెడ్డి , కాళోజీ, ఒద్దిరాజు సోదరులు మొదలైన మహానాయకులు రేకెత్తించిన రాజకీయ చైతన్యం ప్రభంజనంగా ప్రసరించి హైదరాబాదుకు నిరపేక్ష నిరంకుశత్వం నుంచి విముక్తి కలిగించింది.

బహుకాలంగా నిర్న్రిర్ధంగా, అవిచ్ఛన్నంగా నిర్వహింపబడ్డ మహోద్యమాలకు శుభావహమైన భరత వాక్యం. 39 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని చవిచూచాం. పూజ్య బాపూజీ నేతృత్వంలో సాధించుకున్న స్వాతంత్య్రం ఆశించిన ఫలితాలనందివ్వలేదు. కన్నీళ్ళను తుడవ లేదు. కలలు గన్న గ్రా మ స్వరాజ్యం అడియాసగానే మిగిలిపోయింది. జవహర్‌లాల్ నెహ్రూ కన్నకలలు పూర్తిగా సాకారం కాకపోవడం మన దురదృష్టం.

1983లో నాలో విశ్వాసముంచి నన్ను వెన్నుతట్టి గెలిపించి తెలుగుదేశానికి జీవంపోసి ప్రభుత్వాన్నిచ్చి ఈ బరువైన బాధ్యతా నిర్వహణలో నిండు మనసుతో నన్నాశీర్వదించారు ఆరుకోట్ల తెలుగు ప్రజానీకం. మనకు ప్రాంతీయ సంకుచితత్వం లేదు. ప్రాంతీయ బేధం లేదు. మనమంతా భారతీయులం. తరువాతే వివిధ రాష్ట్రాల వాసులం. ఆంధ్రప్రదేశ్ అఖిల భారత సమాఖ్యలో ఒక భాగం మాత్రమే -మన జాతి భవితవ్యం మనకై నిర్దేశించిన గమ్యాలు. మన కత్యంత విలువైన పరమ ప్రామాణికమైన రాజ్యాంగ పీఠికలో నిర్ద్వంద్వంగా పొందుపరచబడ్డాయి.

జాతీయాభ్యుదయమే -మన అభ్యదయం-తెలుగుదేశ పురోగమనం భారతదేశ పురోగమనంతో ముడిపడి ఆధారపడి ఉంది. భిన్నత్వంలో ఏకత్వం. ఏకత్వంలో భిన్నత్వం మన దేశపు ప్రత్యేకత -విశిష్టత-ఉత్కృష్టత -అనేక భాషల విభిన్న మతాల వేరు వేరు సంస్కృతుల అనేక ఆచార వ్యవహారాల, అశేష నమ్మకాల పుణ్యభూమి -కర్మ భూమి -ధర్మ భూమి మనది.

ప్రజాస్వామ్య రక్షణ, లౌకిక రాజ్య సిద్ధాంత పరిరక్షణ, ఫెడరల్ సమాఖ్య సమర్థ నిర్వహణ, సమసమాజ స్థాపన. దేశ సమైక్యత, జాతీయ సమగ్రత. మనముందున్న గమ్యాలు. ఆ పరమోత్కృష్ట పరమ పవిత్ర కేదారాల వైపు కలిసికట్టుగా, ఒకటిగా అరమరికలు లేకుండా, భాగస్వాములై, అవిశ్రాంతంగా పయనించడమే మన కత్యంత ఆప్తమైన లక్ష్యం-అదే చరిత్ర నిర్దేశించిన గమ్యం.

మీ అందరి ఆశీస్సులతో, సహకారంతో బడుగు బలహీన వర్గాల సముద్ధరణకు, అల్ప సంఖ్యాక వర్గాల రక్షణకు, రైతుకూలీల సంరక్షణకు, కార్మికుల సౌభాగ్యానికి, సర్వజన సంక్షేమానికి, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతిష్ఠలు ఇనుమడింపచేయడానికి సర్వతో ముఖ వికాసానికి, తెలుగుదేశం ప్రభుత్వం అంకితం. ప్రభుత్వాధినేతగా, మీ వాడుగా, మీలో ఒకనిగా ఈ ఆశయాల సాధనకు నా జీవితం అంకితం-పునరంకితం. సరైన సంక్షేమం, సమానమైన అవకాశం, సమైక్య, సమన్వయ సిద్ధాంత పరమైన ఆదరణతో భరతమాతకు వన్నె తేవాలని దృఢ ప్రతిజ్ఞాపూర్వక కంకణ ధారులం కావాలని ఈ సదస్సులో నేను ఉద్ఘోషిస్తున్నాను.

కుల, మత, వర్ణ, వర్గాలకు తావులేని, ఈర్ష్య , ద్వేష అసూయలకు లోనుగాని సమసమాజ స్థాపనోద్దీపితమైన క్రాంతితో ప్రగతికి నివాళి పట్టగలమని నిబ్బరంతో పలుక వలసిన తరుణమిది.

ఈ భావమే సద్భావమై, స్నేహ భావమై, ఈ దేశ దేశాంతరాల్లో విస్తరించి, వికసించి, పరిమళించి, గుభాళించగలదని నా దృఢ విశ్వాసం.

ఎందరో మహీమాన్వితులు -
ఎందరో రాజకీయ స్రష్టలు-
ఎందరో విజ్ఞాన ధనులు-
మరెందరో శేముషీ ధురంధురులు-



- ఈ పావన సుదినాన సంప్రాప్తమైన వారి పరిచయ వీక్షణానికి నా ఆనందాన్ని, తృప్తిని వ్యక్తంచేస్తూ ఆరుకోట్ల తెలుగు ప్రజానీకం తరఫున, తెలుగుదేశం ప్రభుత్వం తరఫున శుభాశీః పరంపరలను తెలియజేస్తున్నాను.

తెలుగుతనం ఎక్కడ ఉన్నా -ఏ దేశంలో విస్తరించినా, విచారించినా ఏ అంతస్థులు నధిరోహించినా -ఆచార నియమనిబ్దమైన-చారిత్రాత్మక స్మృతి వికాస వైభవ సంప్రోక్షితమైన -కళా విన్యాస రాగరంజితమైన మన వారసత్వం, ఏ తెలుగు బిడ్డనూ వదలదు. ఆదర్శావేశాలకు మూర్తీ భావం -అభ్యుదయ స్ఫూర్తికి స్పందనం పవిత్ర త్యాగానికి నిత్యనీరాజనం-ఉగ్గు పాలతో రంగరించి మా తెలుగు తల్లి మాకు పోసిన సంప్రదాయం.

'తెలుగదేలయన్న దేశంబు తెలుగు
ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగ లెస్స'
జై తెలుగునాడు-జై హింద్



సేకరణ: గోటేటి రామచంద్రరావు
నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వద్ద
ప్రత్యేక పౌర సంబంధాల అధికారి

Reply all
Reply to author
Forward
0 new messages