హైదరాబాద్, ఏప్రిల్ 12 : ఒకప్పుడు చంచల్‌గూడ జైలుకు ప్రత్యేకంగా
పిలిపించుకుని 'నియోజకవర్గంలో సమర్థులు కావాలి. అందుకు మీ సహకారం కావాలి'
అని ఆప్యాయంగా మాట్లాడిన జగన్... తీరా పార్టీలోకి వచ్చాక అంటీముట్టనట్లుగా
వ్యవహరిస్తుండడంతో చాలామందికి దిక్కుతోచడంలేదు. అవమాన భారం భరిస్తూ అక్కడే
ఉండలేక పలువురు నేతలు పాత పార్టీలోకి తిరిగి వచ్చేస్తున్నారు. మరికొందరు
మాత్రం ఎటూ తేల్చుకోలేక గుడ్లనీరు కుక్కుకుంటున్నారు. రాష్ట్రంలో అనేక
నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు... జగన్ పార్టీలో
చేరేందుకు మానసికంగా సిద్ధమైన వారు ఇప్పుడు వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన మిగతా 8వ పేజీలో... మాజీ మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ వంటి జిల్లా స్థాయి
నేతలే పరిస్థితి తాము అనుకున్నట్లుగా లేకపోవడంతో బయటికి వచ్చే దారులు
వెతుక్కుంటున్నట్లు తెలిసింది. అజయ్ ఇప్పటికే జిల్లా కన్వీనర్ పదవికి
రాజీనామా చేశారు. ఖమ్మం జిల్లాకే చెందిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు
అట్టహాసంగా జగన్ గూటిలో చేరారు. జిల్లాలో తాను చెప్పిందే జరుగుతుందని
ఆశించారు. కానీ ... ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. మళ్లీ అధికార
పార్టీలోకి రావాలనుకుంటున్నా... రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్ రెడ్డి
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీలో నియోజకవర్గ
స్థాయికి కుదించారని తెలుస్తోంది. చంద్రబాబు, వైఎస్‌లకు సమకాలీకుడు,
ముఖ్యమంత్రితో 'ఢీ అంటే ఢీ'అనే స్థాయి ఉన్న ఆయనతో... 'మీరు సొంత
నియోజకవర్గానికే పరిమితం కావాలి. ఇతర నియోజకవర్గాల్లో తలదూర్చవద్దు' అని
జగన్ కాస్త కటువుగానే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో... ఆయన మనస్తాపానికి
గురైనట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన మాజీ
ఎమ్మెల్యే కడప ప్రభాకర రెడ్డి వైసీపీని వదిలి అధికార పార్టీలోకి రావడం
దాదాపు ఖాయమైంది. రెండుసార్లు ఎంపీగా ఎన్నికై, ఆ తర్వాత టికెట్ దక్కక
రాజకీయాలపై అనాసక్తితో విదేశాలకు వెళ్లిన జ్ఞానేంద్ర రెడ్డి తాజాగా
వైపీసీలో చేరారు.
మొదట్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. తీరా తెలుగుదేశం పార్టీ నుంచి
అమర్నాథరెడ్డి రావడంతో జ్ఞానేంద్రరెడ్డికి ప్రాధాన్యం తగ్గిందని పార్టీ
నేతలు చెబుతున్నారు. దీంతో.. ఆయన ఆగ్రహంతో మళ్లీ విదేశాలకు వెళ్లినట్లు
తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న
జయచంద్రారెడ్డికి చెవిరెడ్డి భాస్కర రెడ్డి నుంచి సవాల్ ఎదురవుతోంది.
వాస్తవానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డితో ఉన్న స్నేహం రీత్యా
జయచంద్రారెడ్డి వైసీపీలో చేరారు. ఇప్పుడు తనకు ఆశాభంగం తప్పకపోవడంతో ఏం
చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చింతల
రామచంద్రారెడ్డి కూడా వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం
జోరుగా సాగుతోంది.
అనంతపురం అర్బన్‌లో చవ్వా రాజశేఖరరెడ్డి, కళ్యాణదుర్గంలో ఎల్ఎం మోహనరెడ్డి,
తాడిపత్రి నియోజకవర్గంలో పైలా నరసింహా రెడ్డి, హిందూపురంలో వేణుగోపాల
రెడ్డి, కదిరిలో మాజీ ఎమ్మెల్యేలు షాకీర్, జొన్నా రామయ్య కూడా అసంతృప్తితో
ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. రాయదుర్గంలో పారిశ్రామిక వేత్త బాలాజీ
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. కడప
జిల్లాలో ఎమ్మెల్యేలు కమలమ్మ, ఆదినారాయణరెడ్డి చేరిన కొన్నాళ్లకే జగన్
గూటిని వీడారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డిదీ అదే పరిస్థితి. విజయనగరం
జిల్లాలో వైసీపీలోకి వలసల పరిస్థితి గోడకు కొట్టిన బంతుల్లా మారింది.
మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, జడ్పీ మాజీ చైర్మన్ వాకాడ
నాగేశ్వరరావు, బొత్స కాశీనాయుడులు వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరే
యత్నాల్లో ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
టీడీపీ నుంచి వెళ్లిన మాజీ విప్ శంబంగి చిన అప్పలనాయుడు కాంగ్రెస్‌లో
చేరితే .. మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు కూడా అసంతృప్తితో ఉన్నారని పార్టీ
నేతలు చెబుతున్నారు. విశాఖ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తూర్పు
గోదావరి జిల్లా కాకినాడలో జడ్పీ మాజీ చైర్మన్ వేణును ఇన్‌చార్జిగా
నియమించడంపై రగడ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో
11 చోట్ల నేతల్లో అసంతృప్తి కన్పిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
జగన్‌ను కలవకుండా తమను అడ్డుకుంటున్నారంటూ పలువురు నేతలు మైసూరారెడ్డికి
ఫిర్యాదు చేశారు. చింతలపూడి ఎమ్మెల్యే రాజేశ్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో
ముప్పిడి శ్రీనివాసరావు వైసీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు.
మహిళా నేత అన్నపూర్ణాదేవి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ
నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తితో
ఉంటే.. ఆచంట నియోజకవర్గానికి చెందిన చంద్రమౌళి ఏకంగా వైసీపీ వ్యవహారాలపై
నిరసన వ్యక్తం చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఉంగుటూరులో గాదిరాజు సుబ్బరాజు, వెంకట రమణలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న
ప్రచారం జరుగుతోంది. ఏలూరు నియోజకవర్గంలో నానిపై ఇటీవల బొద్దాని శ్రీనివాస్
తిరుగుబాటు బావుటాను ఎగుర వేశారు. నర్సాపురంలో బీసీ నేత వీర్రాజు తీవ్ర
అసంతృప్తితో ఉన్నారు. కోవూరులో మోసేన్ రాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
గుంటూరు జిల్లా పత్తిపాడులో తన ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకట
రమణను దగ్గరికి తీయడంతో సీనియర్ నేత రత్తయ్య పరిస్థితి అగమ్య గోచరంగా
మారింది. వైసీపీ కార్యక్రమంలో బహిరంగ వేదికపైనే రత్తయ్యను రమణ దూషించారు.
ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరినా జగన్ పట్టించుకోలేదు. దీంతో ఆయన పార్టీ
కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.
ఒక దశలో ఆయన తిరిగి టీడీపీలో చేరాలని కూడా భావించారు. ఇక... తెలుగుదేశంలో
పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఒక వెలుగు వెలిగి, తర్వాత వైసీపీలో చేరిన
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును కూడా నియోజకవర్గానికి పరిమితం చేశారు. మాజీ
ఎమ్మెల్యే గుదిబండి వెంకట రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రకాశం
జిల్లాలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరడంతో బాచిన చెంచు
గరటయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కూడా
వైసీపీ వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిజామాబాద్ వైసీపీ
జిల్లా కన్వీనర్ వెంకట రమాణా రెడ్డి పదవికి రాజీనామా చేయడంతోపాటు ఆ పార్టీ
నేత బాజిరెడ్డి గోవర్దన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా విభాగం
జిల్లా అధ్యక్షురాలు సులోచన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. డీసీఎంఎస్
మాజీ అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు
మోహనరెడ్డి పార్టీని వీడే యోచనలో ఉన్నారు.
ఊగిసలాటలో... వైసీపీలో చేరేందుకు ఉబలాటపడి.. సమయం కోసం వేచి చూస్తున్న
పలువురు ప్రముఖులు ఇప్పుడు ముందూ వెనుక ఆలోచిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు
చెందిన కోమటిరెడ్డి సోదరులకు వైసీపీలోకి వెళ్లాలనే కోరిక బలంగా
ఉన్నప్పటికీ... తెలంగాణ సెంటిమెంట్, వైసీపీలో ప్రస్తుత పరిస్థితి
నేపథ్యంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీలోకి
వస్తారన్న ఆశతో నల్లగొండ, మునుగోడు, ఆలేరు, నకిరేకల్ నియోజకవర్గాల్లో
పార్టీ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు.
వీరు ఏ పార్టీలో చేరతారనేది మే చివరికల్లా తేలిపోతుందని స్వయంగా
ముఖ్యమంత్రి కిరణ్ జిల్లా కాంగ్రెస్ నేతలతో వ్యాఖ్యానించటం గమనార్హం. జగన్
జైలుకు వెళ్లినప్పుడు, ఆ తర్వాత వైసీపీ అనుకూల వ్యాఖ్యలు చేసిన కరీంనగర్
జిల్లా నేత జీవన్ రెడ్డి ఆ తర్వాత ఏ కారణాలవల్లోకానీ ఇప్పుడు పూర్తిగా
కాంగ్రెస్‌తోనే ఉన్నారు. ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు 'నేను
కాంగ్రెస్‌లోనే ఉంటాను' అని ప్రత్యేకంగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
ఆయన కూతురు వైసీపీలో చేరనున్నట్లు ఒక దశలో ప్రచారం జరిగింది.