జేడీ లక్ష్మీనారాయణకు అరుదైన గౌరవం, రాష్ట్రపతి పోలీసు పురస్కారం అందుకోనున్న జేడీ
మహారాష్ట్ర అడిషనల్ డిజిపి, సిబిఐ పూర్వపు జాయింట్ డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణకు అరుదైన గౌరవం దక్కింది. అత్యున్నత సేవలు అందించినందుకు భారత రాష్ట్రపతి నుంచి లభించే పోలీస్ మెడల్ ను ఆయన అందుకోనున్నారు.
వచ్చింది సాధారణ కుటుంబం నుంచే. అందుకే కాస్తంత ధైర్యం ఎక్కువ. సాహసం చేయడం ఆయనకు అలవాటు. ఇంటి పేరు వీవీ అయినా జేడీ లక్ష్మీనారాయణ అంటేనే అందరికీ తెలిసేది. అంతగా ఆ పేరు పాపులర్ అయింది. సిబిఐ అంటే జేడీ లక్ష్మీనారాయణ అనుకునేంతగా ప్రాచుర్యం పొందాడు. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలో మడమ తిప్పని వ్యక్తిత్వం ఆయనది. టెర్రరిస్ట్ లు అయినా, దేశ ద్రోహులు అయినా, అవినీతి, అక్రమార్కులు ఎవరైనా దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై ఉక్కు పంజా విసిరిన ధీశాలి. నోట్ల కట్టలు విసిరినా వెరవని మనస్తత్వం. కుటుంబ సభ్యులను బెదిరించినా అదిరించినా వెనక్కి తగ్గని ధైర్యం ఆయన సొంతం.
అక్రమాలు ఏవైనా, వ్యక్తులు ఎవరైనా, కుంభ కోణం ఏదైనా, బెదిరింపులకు లొంగడు. అదిరింపులకు భయపడడు. తాను తల వంచడు. కుంభ కోణాల కూపీలను పసిగట్టి అక్రమార్కుల గుండెల్లో సింహ స్వప్నమయ్యాడు.
నల్ల ధనం పొగరు బట్టి మదగజాలను వంచిన మేరు నగధీరుడు. అంతకు మించి మానవీయ విలువలున్న ఉన్న మనిషి. సమాజ హితం కోసం నేను సైతం అంటూ ముందుకు కదిలాడు. యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. నిజమైన దేశభక్తుడిగా వారిని తీర్చి దిద్దడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. సమాజంలోని అవినీతి కలుపు మొక్కలను ఏరి మిగతా వారికి ఆదర్శంగా నిలిచాడు. ఒకరా..ఇద్దరా 54 మందికి రక్తదానం చేశారు. తద్వారా ఎందరికో ప్రాణం పోసిన పుణ్య మూర్తి. మైకు పడితే మారు మోగే చప్పట్లు. కరతాళ ధ్వనులతో ఆ ప్రసంగం వెల్లువలా సాగుతోంది. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే పాటను తరచుగా గుర్తుకు తెచ్చుకుంటాడేమో. అంతలా తన స్థానాన్ని గుర్తు తెచ్చుకుంటాడు జేడీ లక్ష్మీ నారాయణ. నీ ఆశయానికి తలవంచుతుంది ఈ దేశం.
జేడీ లక్ష్మీనారాయణను రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ అరుదైన గౌరవంతో సత్కరించనున్నారు. అత్యున్నత సేవలు అందించినందుకు గాను ఇచ్చే రాష్ట్రపతి పోలీస్ మెడల్ ను ఆయనకు బహుకరించనున్నారు. అలాంటి జేడీ లక్ష్మీనారాయణను అమేజ్ టీవీ అభినందిస్తుంది. మరెన్నో అవార్డులు, రివార్డులు మీరు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. లక్ష్మీనారాయణకు హృదయపూర్వక శుభాకాంక్షలు.