నమస్కారం
వికీపీడియా గురించి తెలియని జాలవాడుకర్లే ఉండరు అన్న మాట అతిశయోక్తి అనిపించేంతగా వికీ మనకు దగ్గరయింది.
ఆంగ్లంలో ప్రతి వాడుకరి దాదాపు ఏ కొత్త విషయమై తెలుసుకోవాలన్నా వికీ నే సందర్శిస్తారు
అయితే తెలుగునాట తెలుగు జనంలో వికీ ఇంకా చాలా ప్రాచుర్యం పొందాల్సి ఉంది
వికీపీడియా ఒక్క విజ్ఞానసర్వస్వమే కాక ఇంకా మరెన్నో రూపాలుగా మనకు ఉపయోగపడుతుంది కొందరికి యాత్రాదర్శినిగా, కొందరికి ఏదో ఒక విషయమై ప్రమాణంగా పరిగణించబడుతుంది
ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని రకాలుగా వికిఇని మనం వాడుకోవచ్చు
వికీపీడియా మరియు అనుబంధ కార్యక్రమాలను ఆంగ్ల మాధ్యమం వారు విరివిగా వాడుకుంటారు
వికీపీడియా : విజ్ఞాన సర్వస్వం -- మనకు తెలియని కొత్త విషయాలని తెలుసుకోవటం, తెలిసిన విషయాలను మరింత క్షుణ్ణంగా తెలుసుకోవటంలో సహాయకారి
విక్షనరి ః నిఘంటువు -- ఇందులో మనమంతా సంకల్పిస్తే సంవత్సరం లో మన అన్ని మాండలిక మరియు మౌఖిక పదాలను వాటి అర్థ-స్వరూప-ఉదాహరణ సహితంగా చేర్చి ఉపయోగించుకోవచ్చు
వికికోట్ : ప్రముఖులు పలికిన వాక్యాల సమాహారం -- ఇక్కడ కూడా మనం ఎందరో మహానుభావులు పలికిన అమృతతుల్య వాక్యాలను చేర్చవచ్చు
వికిబూక్స్ః పుస్తకాల నెలవు -- మనకు ఉచితంగా అందుబాటులో ఉన్న పుస్తకాలను ఇక్కడ చేర్చవచ్చు
వికిసోర్స్ః మూలరూపాల సమాహారం -- మనం నిత్యం చదువుకునే ఏ స్మృతి-శృతి సంహిత అయినా, మన శతకకారులు రచించిన శతకములు, వేద-వేదాంగాలు, పురాణ-ఇతిహాసాలు ఇక్కడ వాటి మూల రూపంలో పొందుపరుచవచ్చు.
వికిస్పిషీస్ః జీవరాశుల సమాచారం -- మన జీవ శాస్త్రం అన్ని రకాల జీవ-వృక్ష-జంతువులను ఒక ప్రణాళికననుసరించి క్రమబద్ధీకరించి విభజించింది. ఆయా జీవాల విభజన సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంటుంది.
వికీన్యూస్ః సమాచార స్రవంతి -- వార్తలు వాటి విశ్లేషణలు
వికివర్సిటీః అభ్యాస సామగ్రి -- వివిధరకాల విషయాలపై అధ్యయనం, ఆలోడనం చెయ్యాలనుకునే వారికి సహాయకారి
వికీమీడియా కామన్స్ః ఉచితంగా అందుబాటులో ఉండే చిత్రపటాల, చిత్రాల, మరియు చలనచిత్రాల సంకలనం -- ఇక్కడ మీరు అందరితో పంచుకునే విధంగా ఎటువంటి కాపీరైటులేని క్రియేటివ్ కామన్స్ మరియు ఇతర సంబంధిత లైసెన్స్ లలో అనేక చిత్రాలు(ఫుటోలు) పెట్టుకోవచ్చు
మీడియావికిః వికి లాంటి గూడును మీరూ చేస్కోవాలంటే ఇది ఒక అచ్చులా వాడుకోవచ్చు
ఈ మధ్య మన గుంపుల్లో తలెత్తిన ఎన్నో సమస్యలకి పైన చెప్పిన వివిధ ప్రాయోజకాలను మనం వాడుకోవచ్చు ఇవి అలాంటి చోట్ల చక్కగా సరిపోతాయి కూడా!
ఉదాహరణకు మనం విక్షనరీని మన భాషా పదాలకు, ప్రస్తుత వ్యావహారిక పదాలకు, ప్రాచీనాంధ్ర పదాలకు, ప్రాంతీయ మాండలికాలకు ఒక నిఘంటువుగా మలచుకోవచ్చు.
అలానే మన వద్ద ఉన్న అందరితో పంచుకోదగ్గ చిత్రాలను యథావిధిగా వికీ ద్వారా మాత్రమే పంచుకోగలం...
కొందరు తెలుగులో ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాలు సరిగా లేవు అంటారు, అలాంటివారు వికివర్సిటి ద్వారా ఆయా విషయాలకు వికిఇ లోనే సామగ్రిని ఏర్పరిచి అప్పుడు ఉన్న పాఠ్యాంశాల్లో తప్పులు చూపుతూ మీరు రాసిన అంశాలను చూపండి కనీసజ్ఞానం ఉన్నవారు ఖచ్చితంగా స్పందిస్తారు లేదా ఆ విషయపు విద్యార్థులు మీ అంశాలను చదువుకుంటారు.
వార్తలపై విశ్లేషణలు వికిన్యూస్ లో రాయండి
ఇలా ఎన్నో వికి తో చెయ్యవచ్చునని అనుభవ పూర్వకంగా నేను చెపుతున్నాను.
అయితే పైన చెప్పిన వాటి గురించి ఎంతో కొంత సమాచారం అవసరం, అవగాహనా ఉండాలి.
తెలుగుపదాలకై నేను ఒక స్ప్రెడ్ షీట్ పెట్టి అందులో రాయమంటే ఎవ్వరూ రాయలేదు, కారణం ఎలా రాయాలో తెలీదు. మరింకే
రండి మీ మీ పదాలను ఎలా పొందుపరచాలో మీ తాతల, లేక తండ్రుల చరిత్రలను పొందుపరచటం ఎలానో తెలుసుకోండి.
మనం మన వంటకాలను కూడా వికీపీడియాలో పొందుపరచుకోవచ్చు
"ఇక ఇదంతా నేను నా బ్లాగులో కూడా చేసుకోగలను అయితే ఏంటంటా?" అన్నది మీ ప్రశ్న అయితే
సమాధానం
- వికీపీడియా ఎల్లప్పుడు అందరికీ అందుబాటులో ఉంటుంది. బ్లాగులు ఆయా సైటులు ద్దిగువన ఉన్నప్పుడు కనబడవు
- బ్లాగులు మీ వ్యక్తిగతం మాత్రమే, వాటి లింకులున్న వారి వరకే మీ బ్లాగులు చొచ్చుకుపోగలవు, కానీ మొత్తం ప్రపంచానికే వికీ అందుబాటులో ఉంటుంది
- గూగుల్ వంటి అన్వేషి కూడా వికీ నే ముందుగా చూపుతుంది
- చాలా జనం బ్లాగుకన్నా వికీ నే చదవటానికి మొగ్గు చూపుతారు
- వికీ లో ఎటువంటి వాణిజ్యప్రకటనలు ఉండవు
- ఇది స్వేచ్ఛావాహక కార్యక్రమం

అంచేత మీకున్న పనులన్నీ కాస్త వేరే సమయాలకి కేటాయించి ఆదివారం ఉదయం పది నుండి పన్నెండు వరకు వికీపీడియాకు కేటాయించండి!
మరియు మీ రాకను తెలియచేయండి.
మీ భవదీయుడు
రహ్మానుద్దీన్ షేక్
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామపివర్ధతాం॥
గమనికః ఆంగ్ల సదస్సు మరియు తెలుగు సదస్సు వేరు వేరు రెండూ ఒక్కటి కాదు కాకపోతే వేదిక ఒకటే!