పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలంకాని కాలంలో వాతావరణంలో మార్పులు, వినాశనాలు, విపత్తులు తప్పవన్నారుట. ఈ వేసవికాలంలో రోహిణికార్తె సమయంలో వర్షాలేమిటో! భానుడి భగభగలు తట్టుకోలేక వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది కానీ “అర్ధరాత్రి అంకమ్మ శివాలు” లాగా బుధవారం రాత్రి వర్షం ధాటికి మా ఇంట్లో గంటసేపు మేము పడిన అవస్థకి చికాకు వేసింది. సూరీడు ఉంటేనే బాగుండు ఈ వరుణదేవుడు చంపుతున్నాడు అనిపించింది.
కొత్త ఇంట్లో తలుపులు ఎండకి బిగుసుకుపోయి ఇలా వర్షం పడ్డప్పుడు ఖాళీలు వస్తున్నాయి విచిత్రంగా. రాత్రి కొట్టిన వర్షానికి 2 గంటలకి లేచి నీళ్ళు ఎత్తి పారపోసుకుంటూ గంటసేపు మేము పడిన అవస్థ వర్ణనాతీతం. ఎక్కడో 3వ అంతస్థులో ఉన్న మాకే ఇలా ఉంటే నేను పెరిగిన ఊరు దగ్గర లంకల్లో ఉండేవాళ్ళ పరిస్థితి ఏంటా అని జాలేసింది. మా అబ్బాయి అంత రాత్రి లేచి నాకు సాయం చేసేటప్పటికి వాడి నిద్ర ఎగిరిపోయి కథ చెప్పమని కూర్చున్నాడు. మరీ చిన్నవాడు కాదనుకోండి. కానీ చిన్నప్పటినుంచి కథలువింటూ పడుకోడం అలవాటు చేసుకున్నాడు. బాగా చిన్నప్పటి నుంచి సుమారు 6వ తరగతి వరకు నేను చెప్పాను.అప్పటినుంచి వాళ్ళ నాన్నగారు రామాయణం, భారతం, శివపురాణం ఇలాంటివి చందమామలో చిన్నప్పుడు ఆయన చదువుకున్నవి చెబుతున్నారు.
నా చిన్నప్పుడు నా స్నేహితురాలు చెప్పిన ఒక కథ గుర్తొచ్చింది. మా అబ్బాయికి చిన్నప్పుడు చెప్పేదాన్ని. దీనిలో చాలా నీతులు పిల్లలకి చెప్పవచ్చు.
పిచ్చుక, కాకి ఒక చెట్టుమీద నివాసం ఉంటూ ఉంటాయి. పిచ్చుక గడ్డితో ఇల్లు కట్టుకుంటుంది కదా! చిన్న గాలివానకి దాని గూడు పడిపోతుంది. అప్పుడు కాకి దగ్గర కొచ్చి పిల్లలు తడిసిపోతున్నారు. నీ గూడులో ఒకచోట కాస్త జాగా ఇస్తే తలదాచుకుంటాను అంటుంది. కాకి కుదరదు పొమ్మని నిర్ధాక్షిణ్యంగా గెంటేస్తుంది. పిచ్చుక ఏడుస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమయ్యి అప్పటికి వాళ్ళకష్టం తొలగించి, అక్కడ మూడు గుంటలు తీయి నీకు మంచి జరుగుతుంది అని వెళ్ళిపోతాడు. తరవాత కొన్ని రోజులకి ఈదురుగాలులతో కూడిన చాలా పెద్ద వర్షం వస్తుంది. కాకి గూడు చెదిరిపోతుంది. కాకి పిచ్చుకని సాయం అడిగితే దాని ఇంట్లో జాగా చూపించి వర్షంలో తడిసిన కాకి పిల్లలు ఉపశమించేలా చేస్తుంది.
పిచ్చుక వైభోగం చూసిన కాకి ఎలా వచ్చింది అని అడిగితే పిచ్చుక విషయం మొత్తం చెబుతుంది. అప్పుడు కాకి కూడా వెళ్ళి పిచ్చుక తవ్విన చోటనే 3 గుంటలు తవ్వుతుంది. పిచ్చుకకి వెండి, బంగారం, వజ్రాలు వచ్చిన స్థానే కాకికి పురుగులు, తేళ్ళు, పాములు వస్తాయి. వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళని అదృష్టాలు వరించాయి.
మనలోని అహంకార మమకారాలు, ఈర్ష్యా ద్వేషాలు వీడిననాడు అంతా మంచే జరుగుతుంది. అన్నిటా మంచే కనబడుతుంది. దీన్ని పిల్లలు పెరుగుతున్నప్పుడు వివిధ స్థాయిల్లో వివిధ ఉదాహరణాలతో, మంచి మాటలతో చెప్పవచ్చు అని నా అభిప్రాయం.
మంచి చెడుల మధ్యన తేడా చూపాలంటే పిల్లలకి క్లాసులు పీకే కన్నా కథలు ఉపయోగ పడతాయి. కథల ద్వారా మంచి మాటలు, మంచి అలవాట్లు, విషయపరిజ్ఞానం పెంపొందిచవచ్చు అనుకుంటున్నా. ఈ సు’ప్రభా’తం తో ఈ వారానికి నా ప్రభోదం అయిపోయింది. సూక్తిముక్తావళి సమాప్తం. 😆
🙏
ప్రభ పొనుగుపాటి,
#సుప్రభాతం# | May 24, 2024.