Fwd: Mahasamadhi day of kanchi paramacharya

54 views
Skip to first unread message

Sai Siva Gorthi

unread,
Jan 8, 2018, 11:11:02 PM1/8/18
to babasatsang

---------- Forwarded message ----------
From: SHIRDI SAI CULTURAL MISSION VIDYANAGAR <acharyavani...@yahoo.co.in>
Date: 2018-01-08 23:03 GMT+05:30
Subject: Mahasamadhi day of kanchi paramacharya
To: Acharyavani Vidyanagar <acharyavani...@gmail.com>




Show original message


పరమాచార్య స్వామివారి ఆరాధన సందర్భంగా ఈ వ్యాసం

కంచి శ్రీచరణులు మహాసమాధి చెందారు

దక్షిణ భారతంలోని తమిళనాడులోని కంచి కామకోటి పీఠాధిపతులు పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 1994 జనవరి 8న శనివారం రోజు బ్రహ్మీభూతులయ్యారు . వారి శత సంవత్సరం పూర్తి కావడానికి కేవలం నాలుగు నెలలు ముందే వారు విదేహముక్తులయ్యారు. కంచి మఠం 68వ పీఠాధిపత్యం అనుకోకుండా ఈనాడు మధ్యాహ్నం 2:58ని పరిసమాప్తమయ్యింది. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, పేద - ధనిక, ఉన్నత వర్గం – నిమ్న వర్గం అనే తేడా లేకుండా మొత్తం భారతదేశం వారికి నివాళులు అర్పించడానికి తరలి వచ్చింది. ప్రధానమంత్రి పి.వి నరసింహారావు గారు తమ కార్యక్రమాలన్ని రద్దు చేసుకుని తమిళనాడుకు పయనమయ్యారు. 

సంవత్సరం ఆరంభంలో స్వామి వారికి కఫం తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలకు స్వామి వారి దర్శనం ఆపేసారు. కాని వారు కొద్దికాలంలోనే తేరుకుని మళ్ళా ప్రజలతో మమేకమయ్యారు. ఈరోజు మహాస్వామి వారు ఉదయాన్నే 100 మంది భక్తులు పఠించిన విష్ణుసహస్రం విన్నారు. ఇద్దరు శిష్యులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి, శంకరవిజయేంద్ర సరస్వతి స్వామి వార్లు మద్యాహ్నం 2:30 అప్పుడు పరమాచార్య స్వామి వారిని కలిసి, మద్రాసు దగ్గర్లోని తాంబరం వెళ్ళడానికి అనుమతి తీసుకున్నారు. శ్రీమఠం మేనేజరుని కూడా ఏదో నెపం మీద బయటకు పంపించి, సేవకుని చేత వారి తల్లితండ్రుల చిత్రపటాన్ని తెప్పించి ఈ జన్మను ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపి, మళ్ళీ పుట్టనవసరం లేని స్థితిని కల్పించిన గురువుల బృందావనములు ఉన్న కలవై వంక తిరిగి నమస్కరించి, యోగమార్గం ద్వారా బ్రహ్మరంధ్రము నుండి ప్రాణముల ఉద్గమింపజేసి కొన్ని కోట్ల మందిని ఎన్నో విధాలుగా ఉద్ధరించి సాక్షాత్ ‘నడిచే దైవం’గా ప్రస్తుతింపబడిన మహాస్వామి వారు తము ఈ భూమికి వచ్చిన కార్యాన్ని ముగించుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్యాన్ని పొందారు. 

మద్రాసుకు వెళ్తున్న స్వామివార్లకు, పెద్దస్వామి ఆరోగ్యం విషమించిందని సమాచారం అందగానే సాయింత్రం 4:30కి వెనక్కి వచ్చారు. శ్రీమఠం చేరగానే స్వామి వారు విదేహముక్తులయ్యరు అన్న విషయం తెలిపారు. మొదట జయేంద్ర సరస్వతి స్వామి వారు ఆ వార్త విని వ్యాను దిగడానికి కూడా శక్తి లేనంతగా మ్రాన్పడిపోయారు. తరువాత తేరుకుని, విజయేంద్ర సరస్వతి స్వామిని వెంటబెట్టుకుని లోపలికి పరిగెత్తారు. భాస్కరన్, రంగనాథన్, సాంబమూర్తి ముగ్గురు వైద్యులూ స్వామి వారి చివరి నిముషం వరకు సేవ చేసారు. 

స్వామి వారి దేహాన్ని రాత్రి 7:05 నిముషాలకు ప్రజల సందర్శనార్థమై వెలుపలికి తెచ్చి, వారు ఎప్పుడూ కూర్చుని భక్తులను ఆశీర్వదించే అరుగుపై ఉంచారు. సశరీరులుగా స్వామిని దర్శించిన చోటులోనే స్వామి వారిని చివరిగా చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. మొత్తం కంచి వీధులన్ని వేలమంది జనంతో నిండిపోయాయి. స్వామివారు జాత్యాతీతులు. వారిని దర్శించుకోవడానికి ఎందరో మహమ్మదీయులు, క్రైస్తవ సన్యాసినులు మూడు మైళ్ళ పొడవైన వరుసలను సైతం లెక్కచేయకుండా వచ్చారు. 18 గజాల మడిచీరలు కట్టుకుని సంప్రదాయబద్ధంగా వచ్చే బ్రాహ్మణ స్త్రీలు కూడా ఆరోజు అంటుముట్టు వదిలెసి మరీ జనసందోహంలో కలిసిపోయారు స్వామివారి చివరి దర్శనం కోసం. 

ఈ శతాబ్ధపు నిజమైన సన్యాసి, సన్యాసాశ్రమ ధర్మాలను తు.చ. తప్పక పాటించిన అపర శంకరావతారులు ఎన్నో దేవలయాలను వేద పాఠశాలలను నెలకొల్పిన ధర్మస్వరూపులు. కొన్ని దశాబ్ధాలుగా పేలాలు, పళ్ళు, పాలు ఒక్కపూట మాత్రమే తీసుకుంటూ సన్యాసాశ్రమ ధర్మాన్ని నిలబెట్టడానికి కేవలం పాదాచారియై ఆసేతుహిమాచలం నడిచారు. 

జయేంద్ర సరస్వతి స్వామి వారి కోరిక ప్రకారం కంచి మఠం ఆవరణంలోనే మహాస్వామి వారి బృందావనం ఉండాలని నిర్ణయించారు. ఆ ఘనత కేవలం స్వామివారికే దక్కింది. షుమారు గంట సేపు స్వామి వారికి అభిషేకాదులు జరిగాయి. కంచిలోని ఐదు ప్రముఖ దేవాలయ ప్రసాదాలను ఐదు ఏనుగులపై తీసుకుని వచ్చి స్వామి వారి ముందు ఉంచారు. ఆదివారం జనవరి 9న, 12:15 నిముషాలకు మహాభిషేకం ప్రారంభం అయ్యింది. వేదోచ్చారణల మధ్య స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, చెరుకు రసం, పళ్ళు, పంచగవ్యాలు, గంధం మొదలగు వాటితో అభిషేకం చెయ్యడం లక్షలాది జనం తిలకించారు. సన్యాసులకు అగ్నితో సంపర్కం ఉండదు కాబట్టి, హిందూ సంప్రదాయం ప్రకారం చితిలో కాల్చకుండా వారిని ఉప్పు మొదలగు వాటితో నిండిన గోతిలో సమాధి చేస్తారు. వందల మంది ఆస్థాన విధ్వాంసులు, గాయకులు స్వామి వారికి ఇష్టమైన పాటలను పాడారు. తరువాత వారికి పుష్పాలతో పాటు బంగారు పుష్పాలతో కూడా అర్చన జరిగింది. ఏకారతి, పంచారతి, నక్షత్రారతి వంటి నానా రకములైన మంగళహారతులను ఎత్తి, చివరిగా కర్పూర హారతితో స్వామి వారికి చివరి పూజను పూర్తి చేశారు. 

సభలు నిర్వహించడం కోసం కట్టిన బిర్లా హాల్ లోనికి స్వామివారిని తిసుకుని రాగానే ఒక్కసారిగా మఠంలో హడావిడి ఎక్కువ అయ్యింది. ఒక వెదురు కుర్చీపై కూర్చున్న స్వామివారిని పది అడుగుల గుంతలో ప్రత్యేకంగా అల్లిన ఒక వెదురు బుట్టలోనికి ఉంచారు. అందులో ఉప్పు, గంధం, పూలు, ఔషధ మూలికలు ఉంచారు. దాదాపు శతాబ్ధం పాటు వారితో మమేకమైపొయిన సత్య దండాన్ని మూడు భాగాలు చేసి, ఒక భాగాన్ని స్వామివారి తలపై, మిగిలిన రెండు భాగాలు ఆ వెదురు బుట్టకి అటు ఇటు ఒకటి ఉంచారు. స్వామివారిని సమాధిచేసిన చోట ఒక బృందావనం నిర్మించి స్వామి వారి విగ్రహం ప్రతిష్టించారు. జనవరి 11న ప్రజలు పూజ చేసుకోవడానికి అనుమతిచ్చారు. వారు ఉపయోగించిన మంచము, దుప్పటి, కళ్ళజోడు, వాచీ, గోడ గడియారం అన్నిటిని ప్రజల దర్శనార్థం ఒక గాజు గదిలో భద్రపరిచారు.

భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వారి సందేశంలో, “మానవజాతి నిత్యమూ అన్వేషించే సత్యం, శాంతి, సామరస్యం అనేవాటికి సాకార రూపం మహాస్వామి వారు” అని చెప్పారు. మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ గారు తడిసిన కళ్ళతో పరమాచార్య స్వామి వారిని, “సర్వ మానవాళిని ధర్మం వైపు పయనించేలా చేసి, వారికి ఉపశాంతి అందించిన జ్ఞానజ్యోతి మహాస్వామి వారు” అని కొనియాడారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత “స్వామివారి మాహభినిష్క్రమణంతో భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక శకం ముగిసినట్టు అయ్యింది” అని అన్నారు. పార్శీలలో ప్రముఖుడైన, అమెరికాలో ఒకప్పటి భారతీయ రాయబారిగా పనిచేసిన నాని ఫాల్కివాలా ఇలా అన్నారు. “మహాస్వామి వారు జ్ఞాననేత్రంతో చూసేవారు. వారు భారతీయ సంస్కృతి యొక్క మహోన్నత సిద్ధాంతాలకు నిలవెత్తు రూపం. ఏ వ్యక్తీ తన స్వంత జీవితాన్ని ఇంత తక్కువగా పొంది ఉండడు”. మద్రాసు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఖాసిమ్ మొహమ్మద్ ఇస్మాయిల్ వార్త తెలియగానే శ్రీమఠానికి మొట్టమొదట వచ్చిన పెద్దవారు “మహాస్వామి వారు మన ప్రశంసలకు అతీతులు. కేవలం మనం వారి సమకాలీనులు అని చెప్పుకోవడమే గర్వకారణం”

- from Kanchi Paramacharya Vaibhavam

With Regards,
SSCM,
Vidyanagar.

Reply all
Reply to author
Forward
0 new messages