పోతప్పినాడు అనే రాజ్యంలో, ఉడుప్పూర్ గ్రామములో నాగడు అను ఒక బోయరాజు ఉండేవాడు.
అతని భార్య పేరు దత్త. భార్యాభర్తలిద్దఱు సుబ్రహ్మణ్యస్వామి
భక్తులు. స్వామి దయ వలన చాల కాలమునకు వారికి ఒక పుత్రుడు జన్మించాడు. తల్లిదండ్రులు
ఆ బాలునకు "తిన్నడు" అని నామకరణము చేశారు.
శ్రీ కాళహస్తీశ్వర పురాణముననుసరించి తిన్నడు పూర్వజన్మములో అర్జునుడు. శివుని
గూర్చి తపము చేసి, పాశుపతాస్త్రమును పొందినాడు. కానీ అప్పుడు పరమేశ్వరుడు బోయవానిగ
అర్జునుని ముందరకు వచ్చినప్పుడు, అర్జునుడు శివుని గుర్తించలేకపోయాడు.
ఆ కారణముచే, మరుజన్మలో అర్జునుడు బోయవాడుగా (తిన్నడుగా) జన్మించి, ఆ రూపంలో
శివుని మెప్పించి, శివ సాయుజ్యాన్ని పొందాడు.
నాగడు తిన్ననికి బోయలకు వలయు సకల విద్యలను నేర్పించినాడు. తిన్నడు
విలువిద్యలో ఆరితేరాడు. చిన్నవాడుగా వుండగానే నాగడు తిన్నని
రాజ్యాభిషిక్తుడుగా చేశాడు. బోయవాడుగా తన కులధర్మమును అనుసరించి వేటాడినా -
తిన్ననికి అన్ని జీవులయెడల - వాత్సల్యము, ప్రేమాభిమానములు అభివృద్ధి
నొందాయి. జంతువులలో పిల్లలని, ఆడవాటిని, రుగ్మతతో ఉన్న జంతువులని
వేటాడేవాడు కాదు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను
జయించాడు.
ఒక రోజున తిన్నడు
వేటకు వెళ్లాడు. ఒక సూకరము (అడవిపంది) అతని వలనుంచి తప్పించుకొని పారిపోజూచింది. తన
అనుయాయులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్లాడు. ఆ సూకరమునకు అలసట
వచ్చింది. ఒక చెట్టు ముందర ఆగింది. తిన్నడు దానిని చంపాడు. ఆ ముగ్గురూ
అలిసిపోయారు. దప్పికైంది. పందిని మోసుకొని స్వర్ణముఖీ నదీ తీరానికి చేరారు.
కాళహస్తి పర్వతము, దేవాలయము కనిపించాయి. తిన్నడు ఆ పర్వతమెక్కి - ఆ
దేవాలయమును చూడదలచాడు. "అక్కడ ఉన్న పరమేశ్వరుడి పేరు - కుడుము దేవారు (అంటే పిలక ఉన్న
దేవుడు)" అని నాముడు తిన్నడికి చెప్పాడు. కాముడు పందిని పచనము చేయ మొదలుపెట్టాడు.
తిన్నడు ఆ పర్వతము ఎక్కడం ప్రారంభించాడు. ఆ పర్వతమెక్కుతుంటే, తిన్ననిలో మార్పు కానవచ్చింది. అది పూర్వ
జన్మసంస్కార ఫలము. తనమీదనుంచి బరువు ఏదో తగ్గుతున్నట్లు అనిపించింది.
దేహ స్పృహకూడా మందగించింది. అక్కడి శివలింగమును చూడగానే, దానిమీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆ లింగమును కౌగలించుకున్నాడు. ముద్దులు
గుమ్మరించాడు. ఆనంద భాష్పాలు రాలటంతో, శివునితో, "ఈశ్వరా! ఈ దట్టమైన
అడవిలో ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా వున్నావు? నీకు ఆహరము ఎలా లభిస్తోంది? ఇప్పటినుండి నేనూ నీతోనే
వుంటాను. నీకు ఆకలిగా ఉన్నట్లున్నది. నేను ఆహారము తీసుకుని వస్తాను" అని పలికి, శివుని ఆకలిదీర్చుటకు వెంటనే కొండ దిగాడు.
కాముడు పచనము చేసిన పంది మాంసమును, తిన్నడు రుచి చూచి, అందులోనుండి, రుచిగా ఉన్నదానిని శివునికోసం వేరుగా ప్రక్కన ఉంచాడు. నాముడు తిన్నడితో, "ఈశ్వరునకు ఆహారమూ సమర్పించే ముందు, ప్రతిదినము నీటితో
అభిషేకింపబడుతాడని, పూలతో పూజింపబడతాడని" చెప్పాడు. తిన్నడు అది విని, నదివద్దకు వెళ్ళి, నోటినిండా నీళ్లను పుక్కిలి బట్టి, తను సేకరించిన పూలను తలమీద వుంచుకొని,
పచనము చేసిన మాంసమును చేతిలో ఉంచుకొని, విల్లు అంబులతో, తిన్నగా గుడికి
వెళ్లాడు. అక్కడ, పుక్కిలిబట్టిన నీటిని శివునిపై వదిలాడు. అదే శివునికి
అభిషేకమయింది. తన తల మీదవున్న పూలతో శివుని అలంకరించాడు. అదే శివునికి అర్చన అయింది.
తర్వాత, తాను తెచ్చిన పందిమాంసమును దేవుని ముందు పెట్టాడు. అదే ఆయనకు నివేదన
అయింది. ఆ గుడి ద్వారము వద్ద, ఎవరిని, ఏ జంతువులను రానీకుండా కాపలా కాశాడు. మరునాడు ఉదయము, మరలా ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు.
తిన్నడి ప్రవర్తన చూచి, నాముడికి, కాముడికి మతిపోయింది. తిన్నడులో వచ్చిన మార్పును
మతిభ్రమణమేమోనని భావించి, వారు వెంటనే వెళ్ళి, తిన్నడి తల్లితండ్రులకు జరిగిన విషయాలు వివరించి చెప్పారు.
వారు తిన్నడిని ఇంటికి తీసికొని పోజూచారు. తిన్నడు తాను శివుని దగ్గరే
వుంటాను అని వెళ్ళలేదు.
తిన్నడు
దేవునికి ఆహారము సేకరించటానికి వెళ్ళగా, ఆ సమయంలో, ఆలయ అర్చకుడు శివగోచారి, శివునికి ప్రతీరోజులానే అర్చన చేయడానికి వచ్చాడు. ఎవరో దేవాలయమును అపవిత్రము చేశారని భావించాడు.
నిర్ఘాంతపోయాడు. ఆగమ శాస్త్రములో ఆ అర్చకుడు నిష్ణాతుడు. అందుకని అక్కడ వున్న
మాంసము మొదలగువానిని తొలగించి మంత్ర యుక్తముగా సంప్రోక్షణ గావించి, మళ్ళీ స్నానము
చేసి, మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖీ జలములతో అభిషేకము చేసి,
పూలతోనలంకరించి, విభూతినలిమి, తెచ్చిన పళ్లు మధుర పదార్ధములతో నివేదన
గావించి వెళ్ళాడు.
పూజారి
వెళ్ళగానే, తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకు వేటాడిన మాంసమును తెచ్చాడు.
పూజారి అలంకరించిన పూజాద్రవ్యమూలను తీసివేసి, తనదైన పద్ధతిలో పూజచేశాడు. ఈ
విధంగా ఐదు రోజులు జరిగాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. దుఃఖిస్తూ
పరమశివుని ప్రార్ధించాడు. "ఈ ఘోర కలిని ఆపండి" అని ఎలిగెత్తి
ప్రార్ధించాడు. శివుడు శివగోచారికి తిన్నడి భక్తి ప్రపత్తులను చూపించ దలచాడు.
అర్చకునకు కలలో కనిపించి, "నీవు లింగము వెనుక దాగియుండు. బయటకు రాక, అక్కడ
ఏమి జరుగుచున్నదో గమనించుము" అని ఆదేశించాడు.
ఆఱవ రోజున యథావిధిని తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తుండగా
దారిలో తిన్ననికి కొన్ని దుశ్శకునాలు గోచరించాయి. శివునకు ఏదో ఆపద సంభవించిందేమోనని శంకించాడు. గుడికి
పరుగెత్తుకుని వెళ్లాడు. వెళ్లి చూడగానే - శివుని కుడికన్ను నుండి రక్తము బయటకి
వస్తోంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు చేతిలోనుండి క్రింద పడిపోయాయి.
బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పనిచేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికా వైద్యం
చేశాడు. కాని రక్తము ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది. "కన్నుకు
కన్ను" అను సిద్ధాంతము మనస్సులో స్ఫురించింది. వెంటనే బాణంతో తన కుడి కన్నును పెకలించి
శివునికి పెట్టాడు. రక్తమాగిపోయింది. సంతోషించాడు. నృత్యము చేశాడు.
నృత్యము చేస్తుండగా - ఇప్పుడు శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం
గమనించాడు. భయము లేదు, మందు తెలిసిందిగా, కాని ఒక సమస్య మదిలో మెదిలింది. తన
ఎడమ కన్ను గూడ తీసిన తరువాత, శివుని కన్ను ఎక్కడ ఉందో గుర్తించడం ఎలా? అందుకని, గుర్తుకోసం, తన
పాదాన్ని శివుని ఎడమ కంటిపై బెట్టి, తన ఎడమ కన్నును పెకలించుకోబోయాడు.
పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయి, తిన్నని చేతిని పట్టుకొని
ఆపాడు. "నిలువుము కన్నప్పా! కన్నప్పా! నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిరతిశయ
భక్తిని మునుపెన్నడు చూచి ఎరుగను. పంచాగ్నుల మధ్య నిలిచి తపమొనర్చిన మునుల
ఆంతర్యముకన్న నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణానందము
కలిగించినది నీవొక్కడివే కన్నప్పా!" అని ప్రశంసించాడు.
పరమేశ్వరుడు, "కన్నప్పా" అని మూడు మారులు పిలిచాడు. అంటే కన్నప్ప
శివుని అనుగ్రహమూను మూడింతలుగా పొందాడన్నమాట. తన కన్నును
ఈశ్వరునికి అర్పించినందులకు, తిన్నడు "కన్నప్ప" అయ్యాడు. కన్నప్ప నాయనారు
అయ్యాడు. నేత్రేశనాయనారు అనునది సంస్కృత నామము.
శివుడు తన రెండు చేతులతో కన్నప్పను దగ్గరకు తీసికొని, తన అక్కున చేర్చుకున్నాడు. కన్నప్పకు మరలా ఇంతకు ముందులానే చూపు వచ్చింది. కన్నప్ప అప్పటినుండి, సాక్షాత్తూ శివ స్వరూపుడై జీవించాడు. శివగోచారికి తిన్నని అపురూపమైన శివభక్తి గోచరమైంది.
ఈ కథలో ఒక దివ్యార్ధముకూడా దాగి ఉన్నది. కన్నప్పన్నాయనారు అన్ని దోషములను
జయించగలిగాడు. కానీ అహంకారము మాత్రము ఇంకా మిగిలివుంది. అది గూడ
తొలగిపోవాలి. అడవిపంది ఈ విషయాన్ని చూపుతుంది. ఆ పందిని తరిమి తరిమి
వేటాడాడు. చంపగలిగాడు. అది చంపబడగానే అతనిలోని అహం నశించింది. తిన్ననిలో
నిరతిశయ భక్తి పుంజుకుంది. దాన్ని వేటాడేటప్పుడు మంచి, చెడు అతనితోనే ఉన్నాయి. నాముడు - దేవుడుగూర్చి అభిషేకము, పూజ, నివేదనము మొదలగునవి
తిన్ననికి చెప్పాడు. నాముడు - మంచికి ప్రతీక. కాముడు (చెడు) వెనకనుండి
పోయాడు. మంచి సంస్కారాలతో కన్నప్ప శివుని దగ్గఱకు వెళ్లాడు. దేవుని
చేరాలన్నచో తనొక్కడే ప్రయత్నించాలి. అందుకు శివుని పూజకు తనొక్కడే వెళ్ళాడు.
నాముడు, కాముడు అతని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లారు. నాయనారు తల్లిదండ్రులు
అంతర్లీనంగా దాగియున్న భవ బంధాలు. తిన్నని ఆపటానికి ప్రయత్నించారు. తిన్నడు
ఆ భవ బంధములనుండి కూడా వైదొలగి, ఒక్కడుగా ఉండిపోయాడు. పరమశివుడు తన (లింగం)
వెనుక పూజారిని దాగి యుండమన్నాడు. భక్తుడైన తిన్నడు పరమశివుని
ముందర ఉన్నాడు. అంటే భక్తి - క్రియాకలాపాల కన్న మిన్న. తన కళ్ళని పెకలించి
శివునికిచ్చుటలో, తిన్నని సంపూర్ణ శరణాగతి, ఆత్మ నివేదన గోచరిస్తుంది. అంతకన్న
అనితరమైన భక్తి తత్పరత కనిపించదు. వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింప
చేస్తుంది. చేయగలదు.