14_3_32 వ.
అతిలోభంబునంజేసి వంశధర్మంబు విడిచి యెవ్విధంబులను సంధికిం జొరక కు
రుకుమారులు పాండువులతో భండనం బొనర్చి సబంధపరిజనంబుగా మర
ణంబునొంది యుత్తములోకంబుల కరిగి రిక్కడఁ బాండునందనపంచకంబు
దక్కం దక్కటివారెల్ల నట్ల పోయిరి కాలనియతి గడప నెవ్వరికిని శక్యం బ
బగునే యనిన విని రోషకషాయితంబు లగు తారకంబు లుద్వృత్తంబులు సే
యుచు నత్తపోధనసత్తముండు.
14_3_33 క.
కౌరవకులమును మిథ్యా,చారుఁడవైత్రుంచి తకట శక్తుఁడ వయ్యున్
నేరిమిమైఁ జేయువ పొం,దారఁఘ నిక్కిల్బిషమున కంతటికిఁ దగన్.
14_3_34 వ.
ఘోరప్రకారం బగుశాపంబు నీకిచ్చెద ననిన నచ్యుతుం డామునితో నా
మాటలు దేటపడ విని తగినయట్లు సేయుదు గాక యని పలికి యిట్లనియె.
14_3_35 చ.
కినయుట మాను మేలె మునికిం గుపితత్వము శాంతవృత్తి నా
యనునయ మాదరింపు విను మల్పతపంబులచేతఁ గోలుపో
దునె మఱి యట్లుఁ గాక యతిదుష్కర మైనతపంబు సంచితం
బనఁ దగుబ్రహ్మచర్యమును నాఱడిఁ బోవె కటా శపించినన్.
14_3_36 వ.
అనిన విని యుదంకుండు శ్రీవత్సాంకు నవలోకించి.
14_3_37 క.
అగుఁ గాక నీవు సెప్పెడు,తగ వెయ్యది సెపుమ వినియెదం బోలిన నే
మగిడించెద శాపాన్ముఖ,మగుమన్మానసము సనుడు నల్లన నగుచున్.
14_3_38 చ.
తమము రజస్సు సత్త్వము నుదంక మదీయవశప్రవర్తమా
నములు మరుద్వసుప్రభృతినాకిచయంబు మదుద్భవంబు స
ర్వమునను నేన నిల్తు సుఖవాసతనన్ దగఁ జెంది నిల్చు స
ర్వము విను మేన చూవె యపరంబు పరం బనఁ గల్గుతత్త్వముల్.
14_3_39 తే.
ప్రణవముఖవేదములుఁ జతుర్వర్ణములుఁ జ
తుర్విధాశ్రమములును దత్సర్వకర్మ
జాతములును సమంచితస్వర్గమోక్ష
ములును మన్మయముల కాఁగఁ దెలిసికొనుము.
14_3_40 క.
క్రతుపరులు నన్న తగ సం,స్తుతించి ఫల మందఁ గండ్రు దోషయతులు స
మ్మతిఁ బ్రాయశ్చిత్తంబులఁ,గృతాత్ములగుదురు మదీయకీర్తపపరులై.
14_3_41 క.
మానసు మదగ్రపుత్త్రుం,గా నెఱుఁగుము ధర్మునిని జగద్రక్షకు నై
యే నభిమత కాలములను,మానితజన్మముల నొంది మనుతుఁ దపస్వీ.
14_3_42 క.
భవవర్థనవిలయంబులు,నవలీలన వరుస బ్రహ్మ యన విష్ణుఁ డనన్
శివుఁ డన నిర్వర్తింతును,భువనంబుల నేన చూవె భూరిమహిమలన్.
14_3_43 క.
ధర్మంబుకలఁకఁ గాంచి య,ధార్మికులంబొలియఁ జేసి ధార్మికులను బే
రర్మిలి రక్షింతు నుచిత,కర్మాచరణముల నే జగద్ధితమునకై.
14_3_44 వ.
అట్టివాఁడ నయి యుండియునధర్మపరుగుధార్తరాష్ట్రులనత్యంతధార్మికుల
ధర్మనందనాదులతోఁ గలపుటకుం బలుదెఱంగులం బడితి నది దివ్యజ్ఞాన
ప్యమాను లగుపారాశర్యభృతిమునివరులచిత్తంబుల కెక్కె నక్కౌరవు
దమదౌరాత్మ్యంబున మాహాత్మ్యవంతు లగునాకౌంతేయులం దొడరి ధర్మ
మరంబున సమసిరి నాచేసనపని యిట్టిది నన్ను నుదంక నీ వింక నే మనియె
పను మని పలికిన నతండు వినతుం డగుచు నిట్లనియె.
14_3_45 ఉ.
ఇప్పుడు నీమహామహిమ యేర్పడ సమ్యగనుగ్రహంబునం
జెప్పినయీసమంచితవిశేషము లెల్ల నెఱుంగుదున్ మదిం
గప్పినయీదురాగ్రహపు గర్వము నీ వొసఁగంగ నాకు మున్
చొప్పడియెన్ సుధాసదృశసూక్తులఁ దేర్చితి వీవ యచ్యుతా.
14_3_46 వ.
అని వెండియు.
14_3_47 ఆ.
అతుల మైననీదయామహిమకు నేను,బాత్ర మగుదు నేనిఁ బద్మనాభ
యనుపమానతావకాకృతిఁ జూపవే,నాకుఁ జూడ్కియును మనంబు నలర.
- కృష్ణుఁ డుదంకునకుఁ దనవిశ్వరూపంబుఁ జూపుట -
14_3_48 చ.
అనుడు దయాళుఁ డైనహరి యర్జునుచూచినదివ్యమూర్తిఁ జూ
పినఁ గని సంప్రమోదమును భీతియు విస్మయముం బెనంగొనన్
మునిపతి పాణిపద్మములు మోడ్చి నమః పురుషోత్తమాయ తే
యనుచు వినీతి నమ్ర మగునంగము నివ్వెఱ నిశ్చలంబుగన్.
14_3_49 వ.
ఒక్కింత నిలిచి నిభృతస్వరంబున.
14_3_50 సీ.
పుండరీకాక్ష యీపుడమి యంతయును భవత్పాదపం క్తిసంవ్యాప్తమయ్యె
నంబరం బెల్లను నావృత మయ్యె నీమహితసముజ్జ్వలమస్తకముల
నంతరిక్షము దావకాద్భుతకుక్షిదేశంబులచేత సంఛన్న మయ్యె
భవదీయమహనీయబాహార్లళానిచయాపిహితము లయ్యె నన్నిదిశలు
తే.
బహుచరణముల బహుశిరోభాగములను
బహుజఠరముల బహుభుజాప్రకరములను
దేవ యిట్లు సర్వంబును నీవయైత
నర్చి తిది నాదుకన్ను మనంబుఁ దనిపె.
14_3_51 వ.
విశ్వరూపాయీరూపం బుపసంహరించి నీ దగు నెప్పటి యాకారంబు గైకొన వే
యనిన నప్పరమేశ్వరుండు వరంబు గోరు మని యానతిచ్చిన నమ్మహితాత్ముండు
సంశ్రితార్తిహర నీమూర్తిఁ గంటి నింతకంటె మిక్కిలి వరంబులును గలవే
యనుటయు.
14_3_52 క.
ఆదేవుఁ డతనితో నటు,గాదు ననుం గనుట శుభము గావింపక పో
దేది ప్రియ మడుగు మిత్తుఁ బ్ర,మోదంబుగ నీకు ననిన ముని యిట్లనియెన్.
14_3_53 వ.
అవశ్యంబును నా కట్లు గావలయు నని యవధరించి తేని దేవా యిది మరుదేశం
బిచ్చట జలంబు దుర్లభంబు నాకు జలసన్నిధి యెప్పుడుం గలుగఁ బ్రసా
దింపుము.
14_3_54 క.
అనుటయు నంబుజనాభుఁడు,దనయెప్పటిలలితమూర్తి ధరియించి మునీం
ద్రునితోడ నన్నుఁ దలఁపఁగ,ననఘా దొరకొను జలంబు లని పలికి తగన్.
14_3_55 వ.
వీడ్కొని చనియెం బదంపడి యీభృగువంశవరుం డొక్కెడ మెలంగు చుండి
తృషితుం డయి హృషీకేశుం దలంచిన.
14_3_56 సీ.
కుక్కలు సుట్టి రా నొక్కమాతంగుండు బాణబాణాసనపాణియును ది
గంబరుండును మలినాంగుండు నగువాఁడు దోఁచె నచ్ఛజలంబుదొరఁగుచుండు
మేనితో నమ్ముని వానిఁ దప్పక చూడ వాఁడోయుదంక యివ్వారి డప్పి
వోఁ ద్రావు మనుడు నాభూసురాగ్రణీ యొల్లనని పల్కెఁ బల్కిన వినుము నీవు
ఆ.
నీరువట్టు శ్రమముఁ గూరిన నీమీఁది,కరుణ వచ్చినాఁడఁ గాదు నాక
యర్థిఁ ద్రావు టొప్పు ననియె నాచండాలు,నలుకమెయి నదల్చె నత్తపస్వి.
14_3_57 వ.
అదల్చిన నతండు నారమేయంబులుం దాను నంతర్ధానంబు సేసె నాసంయమి
వెఱఁగుపడి యొక్కింతవిచారించి యిక్కపటప్రచారంబు గృష్ణసంపాదితంబు
గా వలయు నని యూహించుసమయంబున నయ్యెడకుం గృష్ణుం డరుగు
దెంచుటయుం గనుంగొని యమ్మహాత్మునితోడ నమ్మునివరుండు.
14_3_58 క.
జలము నినుఁ దలఁపఁగా నిటు,గలుగునె చండాలునొడలఁ గాఱెడునీ రే
నలఘుగుణ త్రావుదునె యే,కొలఁదిశ్రమం బైన వరము గుచ్చిత మయ్యెన్.
14_3_59 చ.
అనవుడుఁ గృష్ణుఁ డిట్టు లను నాఱడిఁబోయెఁ బ్రయత్నమెల్లనీ
వనఘ యెఱుంగ వైతి సమయం బొకఁ డిమ్మెయిఁ గల్గె నేర్పడ
న్వినుము నిలింపవల్లభుని నీ కయి వేఁడితి నే సుధారసం
బనితరసాధ్యమైనశుభ మయ్యెడుభూతి దొలంగె నక్కటా.
14_3_60 వ.
అది యెట్లంటేని.