తే.
హాత్మునకుఁ గల్గి యుండు నయ్యార్యవర్యుఁ
డఖిలసంకల్పములఁ బాచి యాత్మ నాత్మ
యంద కాంచి యనామయ మజర మమృత
మనుపదమ్ముఁ బ్రాపించుఁ గృతాత్ములార.
14_2_212 వ.
అని యిట్లు కమలగర్భుండు.
14_2_213 క.
జ్ఞానపరినిష్ఠితాత్మకు,లైనవిముక్తిపదనిర్ణయజ్ఞులచేస
మ్మానిత యగుగతి యది క,ర్మాను గతివిరక్తజనసమంచిత సుండీ.
14_2_214 వ.
అని నిర్దేశించి వెండియు.
14_2_215 క.
కోరికలకుఁ జొరక యసం,గారూఢత గలిగి యెల్ల యందును సమతం
గూరినచిత్తంబులు గల,సారాత్మకు లీపథమునఁ జనుటకు శక్తుల్.
14_2_216 క.
చెప్పితి సర్వంబును నీ,చొప్పున నడవుఁ డెడనొండు సొర నీకుఁడు మీ
రొప్పెడు తెరు విది దీనం,దప్పదు పరమపదసిద్ధి ధార్మికులారా.
14_2_217 క.
అని యిట్లు కమలగర్భుఁడు,మునులకుఁ దత్త్వోపదేశమును జేసిన వా
రనవద్యసమాధికులై,యనితరసులభ మగుసౌఖ్య మందిరి వత్సా.
14_2_218 వ.
అని పలికి గురుం డాశిష్యునితోడ.
14_2_219 క.
నీవును నివ్వాక్యంబులు,భావంబున నెలవుకొలిపి పరమసమాధి
శ్రీ వాటింపుము నిత్యప,దావాప్తి ఫలించు నీ కనాయాసమునన్.
14_2_220 క.
అని గురుఁడు ప్రబోధించిన,మనమునఁ దెలి వొంది తత్సమంచితమార్గం
బున నడచి పొందె శిష్యుం,డనామయం బజర మమృత మనియెడిపదమున్.
14_2_221 చ.
అని వసుదేవసూనుఁడు సమాదరమేదురచిత్తవృత్తిఁ జె
ప్పిన విని వారయుల్లముల పెం పిటు లుండునె వార లెవ్వరో
వినుటకు నాదుడెందమున వేడ్క జనించె నెఱుంగఁ జెప్పవే
యనుటయుఁ బార్థుమోముఁ గృప నమ్మహితాత్ముఁడు సూచి నవ్వుచున్.
14_2_222 క.
అనఘ విను మే గురుఁడ నా,మనంబు శిష్యుండు విమలమానసనీపైఁ
బనుపడుప్రీతిం జెప్పితి,ననితరసుభాతిగుహ్య మగునిప్పదమున్.
14_2_223 క.
విమలము నచలము నగుచి,త్తము నాదెస నేకభక్తితత్పరముగఁ జే
యుము నిత్యము నీయధ్యా,త్మము ననుసంధింపు పాసెదవు దురితములన్.
14_2_224 క.
సమరమునప్పుడు నీ కీ,యమృతపద ప్రాప్తిహేతు వగుసమ్యగ్బో
ధము వివరించితి నచలత,రమింపు మిం దెపుడు శమధురాధుర్యుఁడవై.
14_2_225 వ.
అని యిట్లు కృష్ణుండు జిష్ణున కధ్యాత్మవిద్య వివరించె ననిచెప్పినఁబరమగురుం
డును విశిష్టశిష్యుండును నగునప్పురుషవరులుమఱియు నెవ్విధంబునంబ్రవర్తిం
జి రాకర్ణించుకౌతుకంబు నామంబున నెసకం బెసఁగెడు మునీంద్రా యెఱిం
గింపవే యని యడుగుటయు.
14_2_226 చ.
పరమదయావిధేయ పరిపాలిత వేదకలాప పక్వని
ర్భరశమసూక్ష్మతాతనువిభాసిత పన్నగతల్పభూషణా
దరభరితా పవిత్రపదతామరసస్మరణా పరావర
త్వరహిత పద్మజాదిసురవందిత పశ్చిమనాళనందితా.
14_2_227 క.
వినుత చతుర్వర్ణకసం,జనకముఖభుజోరుపాద సంవిదభేదా
మునిహృత్కమలమరాళా,జననమరణహరణచరణసరసిజలీలా.
14_2_228 మాలిని.
పదనమదమరాలీ భక్తసంపోషశాలీ
విదళితసురవైరీ విశ్వలోకైకధారీ
మదరహితహితైషీ మాన్యయోగప్రతోషీ
సదవనపరచిత్తా సర్వనిర్మాణవేత్తా.
గద్యము. ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి
తిక్కనసోమయాజిప్రణీతం బైన శ్రీమహాభారతంబున యశ్వమేధపర్వంబు
నందు ద్వితీయాశ్వాసము.