14_2_92 వ.
అనుటయు నజ్జనపతి యతని కిట్లనియె.
14_2_93 తే.
అరయ నివి యెట్లుఁ జెడియెడునవియు కాన
వినుము మద్ధన మిది యని వీనిలోన
నొకటియందు నంగీకార మొలయ దెల్ల
విషయమును నాయదియ యనువిధము గలదె.
14_2_94 వ.
ఎట్లంటేని ఘ్రాణాదులకు గోచరంబు లయినను గంధాదులు సెడం గలయవి
గావున నాయవియన కుండుటంజేసి భూమ్యాదిభూతంబులు నాచేత నిర్జితంబు
లై మద్వశగత్వంబు నొంది యుండు.
14_2_95 చ.
అనవుడు బ్రాహ్మణప్రవరుఁ డల్లన నవ్వుచు నిన్ను నారయ
న్మనమున వేడ్క వట్టి నరనాయక వచ్చితి నేను ధర్ముఁడం
బనుపడునివ్వివేకపరిపాకము గాఢనిరూఢభావ మొం
ది నిలుచుఁ గాత నీదగుమదిన్ సతతంబును శాంతికారియై.
14_2_96 వ.
అని ధర్మ దేవత జనకునకు వరం బిచ్చి యంతర్ధానంబు సేసె నని చెప్పి యా
ధరణీసురోత్తముం డయ్యుత్తమాంగనతో హితోపదేశంబు సేసెద నవహిత
వయి యాకర్ణింపు మని పలికి యిట్లను సంసారవర్తనంబు వదల విడిచి యే
నేకతంబు యున్న యెడనీవుమ్రుచ్చిలవచ్చి మదీయవైరాగ్యంబు మాన్పఁదలంచి
నాకునధ్యాత్తబోధంబు గలుగం జేయు మని యభ్యర్థించిన నీతలం పెఱింగి
యునెఱుంగనివాఁడపోలెనధ్యాత్మవిద్యాబోధక్రకారంబులైనవాక్యంబులు
సెప్పితి నే నింక లోకంబులం గలసి చరించువాఁడం గాను నిక్కపుబ్రాహ్మణుండ
నయితి బ్రహ్మచారినయితి జీవన్ముక్తుండ నయితి మిముబోంట్లకొలఁదిగా నన్నుం
జూచెద వది నా తెఱం గెఱుంగమి యేను జగంబు సమస్తంబును వ్యాపించి
యున్నవాఁడ నాయున్నభంగికినాబుద్ధి సకలపృథ్వీరాజ్యంబును నాకలోకాధి
రాజ్యంబును సరిగా వని తలంచు నాబుద్ధియ నాకు ధనంబు దారువుల నగ్ని
యున్నచందంబున సర్వజంతువులయందును నంతర్గతయై సిద్ధి యున్నది గురు
వాసగృహవాసవనవాసపరు లగుబ్రాహ్మణుల కెల్లను శ్రేయఃప్రాప్తికిం దెరు
వొక్కండ యందఱును సరిత్తులు సాగరంబుఁ బ్రాపించిన తెఱంగునఁబరతత్త్వం
బు నొందుదురు బుద్ధినిమ్మార్గంబు నధిగమింప నగుఁ గాని శరీరంబున వశంబు
గాదు కర్మంబు లాద్యంతవంతంబులు శరీరంబు గ్రమంధనకరం బింత
యెఱుంగుదుం గాన నాహృదయంబునం బరలోకభయంబు లేదు నాచెప్పిన
యధ్యాత్మవిద్యావిషయవాక్యంబులతాత్పర్యంబు చిత్తంబున నెలకొలిపి భావ
నానిరతవయి యుండుము నన్న పోలెదు వెఱవకు మనినఁ బత్ని సాష్టాంగదండ
ప్రణామం బాచరించి కేలు మొగిచి.
14_2_97 సీ.
నీవు చెప్పినమహనీయవాక్యనికాయమతిగహనం బకృతాత్ములకును
నర్థగ్రహణక్తి యనఘ కల్గునె కృతాత్మలకైన గ్రమ్మనఁ దెలియవచ్చి
యుండ దయ్యెఱుకకు నుదయింపఁ బట్టైన యట్టియుపాయంబు నాదరమున
నాకుఁ బ్రసాదింపవే కరుణాకర నావుడు నాతఁ డన్నాతితోడ
ఆ.
నరణి బ్రాహ్మణుండు గురుఁడుత్తరారణి,దపము శ్రుతమునిర్మథన మొనర్ప
జ్ఞానవహ్ని పుట్టు మానిని యని చెప్ప,వనిత యిట్టు లనియె వల్లభునకు.
14_2_98 క.
జనవినుతచరిత బ్రాహ్మణుఁ,డనఁగా క్షేత్రజ్ఞుఁ డగుట యల్పము దోఁచెన్
మనమున నతని నరణిగాఁ,గొను టవ్వస్తువు నెఱింగికొని పిదపఁ గదా.
14_2_99 వ.
అనిన నతం డిట్లనియె.
14_2_100 ఆ.
అతినిఁ దోఁపఁ జేయునట్టిసాధనము లే,దింద్రియముల కందఁ డేమి లక్ష
ణములు లేవు నిర్గుణత్వనిరూఢుం డ,హంత లేమిఁ దోఁచుఁ గాంత కనుము.
14_2_101 వ.
అని నిర్దేశించుటయు క్షేత్రజ్ఞవిషయసంశయంబు వాసి యయ్యింతి శాంతి
వొందె నని గోవిందుండు సెప్పిన గాండీవి యాబ్రాహ్మణుండు బ్రాహ్మణియు
నిట్టివా రగుదురె వారెచ్చటివారు వారల నాకెఱింగింపవే యని యడిగిన
నద్దేవుం డతనియాననం బాలోకించి.
14_2_102 క.
నామనమును బుద్ధియును గృ,పామహితా బ్రాహ్మణుండు బ్రాహ్మణియుహృషీ
కామేయమైనక్షేత్ర,జ్ఞామలవస్తు వన నేన యనియె నరేంద్రా.
- గురుశిష్యసంవాదంబు గృష్ణుం డర్జునున కెఱింగించుట -
14_2_103 వ.
అనిన విని యర్జునుం డచ్యుతునితో భవత్ప్రసాదంబున మదీయమతి యతి
విశదయును సూక్ష్మగ్రాహిణియు నయి యున్నయది పరమంబైనవేద్యం బగు
బ్రహ్మంబు నెఱింగింపవే యనుటయు నాకృష్ణుండు గురుశిష్యసంవాదం
బనునితిహాసంబు విను మది నీప్రశ్నంబునకు నుత్తరంబయి యుండెడు న
త్తెఱంగున మేధావి యగునొక్కశిష్యండు సంశితవ్రతుం డయిననగురు నడిగిన
నగ్గురుండు ప్రజాపతి భరద్వాజ భార్గవ గౌతమ కాశ్యప వసిష్ఠాత్రి విశ్వామిత్ర
ప్రముఖు లగముమునిజనంబు లాంగిరసుం బురస్కరించికొని విరించికడకుం జని
తచ్చరణంబులకుం బ్రణమిల్లి హితం జెయ్యది తత్ప్రాప్తికి సుపథం బెట్టిది
వివరింపవేయని విన్నవించిన నన్నలినాసనుండు గృపాధురీణంబైనచిత్తంబుతో
నత్తపస్వినత్తముల కెఱింగించిన తెఱంగు నీకుం జెప్పెద నవహితుండ వయి
యాకర్ణింపు మని పలికి యిట్లనియె.
14_2_104 ఆ.
ఆదరార్ద్రుఁడగుచు నలరినమోముల,కాంతి వింత గాఁగఁ గమలగర్భుఁ
డాతపస్విజనుల యాననంబులు గల,యంగఁ జూచి యిట్టు లనియె వత్స.
14_2_105 తే.
సత్యమునన భూతంబులు సంభవించు,నంద వర్తించు దానన యడఁగు నిదిగు
ణత్రయాత్మకసత్యచరిత్ర మమల,బుద్ధులార సత్యంబుప్రసిద్ధి వినుఁడు.
14_2_106 క.
శ్రుతి యనఁ దప మనఁగఁ బ్రజా,పతి యన సత్యంబునకు నపరనామంబుల్
వ్రతులార సత్య మన న,వ్వితతమహిమ మైనపరమవేద్యము సుండీ.
14_2_107 క.
కావునఁ గామక్రోధస,మావేశము లెడల విడిచి యనవరతంబున్
సేవింతురు సత్యము దృఢ,భావాకలనమున యోగిపరినిష్ఠాత్ముల్.
14_2_108 వ.
అది హితంబు దత్ప్రాప్తికి సుపథంబు సెప్పెన వినుండు.
14_2_109 క.
చతురాశ్రమములును జరణ,చతుష్టయము గాఁగ వర్ణ సముదయసంసే
వ్యత నొప్పెడుధర్మము సుం,డతులంబు శివప్రదంబు నగుపథమరయన్.
14_2_110 వ.
నాలు గాశ్రమంబులకు సామాన్యంబ యధ్యాత్మవిత్త్వంబు లేక పరతత్త్వంబు
నొంద రామి మారుతాదిత్యేంద్రప్రజాపతులకును లోనుగా నిట్టిద యధ్యాత్మ
దర్శనం బనం జతుర్వింశతిత్త్వావలోకనంబు గావున దత్త్వంబులు వివరించెద.
14_2_111 తే.
అంబరాదిభూతములు శబ్దాదిగుణము
లింద్రియము లిరుదెఱఁగు మునీంద్రులార
మన మహం కారబుద్ధు లి ట్లొనరి ప్రకృతి
గలయ దత్త్వచతుర్వింశకత్వ మొందు.
14_2_112 క.
వినుఁడు ప్రభవవిలయజ్ఞా,ననిరూఢము గాఁగ వీని నైజ మఖిలముం
గనిన భవమోహ మొందఁడు,గనుఁ బరతత్త్వంబు నతఁడు గతకల్మషుఁడై.
14_2_113 వ.
అని నిర్దేశించి యద్దేవుండు వెండియు.
14_2_114 క.
వ్యక్త మనిర్వాచ్యం బ,వ్యక్తము సుస్థిరము ధ్రువము వ్యాపిత్వధురా
యుక్తము కలితగుణత్రయ,శక్తినవద్వారపుర మసాధ్యము సుండీ.
14_2_115 క.
తత్సాధనంబు దద్గత,చిత్సులభత్వప్రసిద్ధిఁ జేయుఁ ద్రిగుణసం
పత్సారవంత మది గుణ,జిత్సువ్రతు లైనవారిచే సాధ్య మగున్.
14_2_116 సీ.
సంయమివరులార సత్త్వరజస్తమోనామరూఢములు గుణంబు లవియు
నన్యోన్యమిథునత్వ మన్యోన్యసంశ్రయ మన్యోన్యసంకలితానువృత్త
భావ మన్యోన్యోపజీవనాచరణంబు గిలిగి దుర్భోధత్వగాఢభంగు
లైయుండుఁ దమము నియమితమైనరజస్సుఁ దన్ని యమమున సత్త్వంబునడచు
తే.
సత్త్వ మడఁగినచోఁ దమశ్చరిత మెసఁగు
లోభశోకసమ్మోహనిద్రాభయములు
వికృతిదుర్మానమౌఢ్యపాపకృతికోప
శాఠ్యమాత్సర్యములు దమస్సంభవములు.
14_2_117 ఉ.
పాములుఁ దేళ్లునుం బసులుఁ బందులుఁ గుక్కలు మీలుఁ గోళ్లులుం
జీమలుఁ గాకులుం గ్రిములు జింకలు నక్కలు గొంకనక్కలు
న్దోమలు మ్రాఁకులుం బొదలు నోవులఁ బీడలఁ బొందువారు మున్
తామసభాగు లట్ల మఱి తద్విధజంతువు లెన్ని యన్నియున్.
14_2_118 క.
ఇవి తామసంబు లని గుణ,నివహములోఁ గీడు వాప నేర్చునతఁడుత
ద్వివిధవికృతినిరసనహే,తువివేకము గలుగఁ గా నధోగతి దలఁగున్.
14_2_119 చ.
బలమును శౌర్యమున్ మదముఁ బ్రాభవమున్ సుఖదుఃఖభాగితా
కలనముఁ జెల్మి సేఁతయును గాంక్షయు నొల్లమియుం బ్రతాపముం
గలహము నీర్ష్యయున్ బహువికల్పపుభాషలుఁ గామినీజనం
బులయెడ గాఢరాగతయు బొంకును నుబ్బు రజఃప్రభూతముల్.
14_2_120 చ.
అవి దొలుబామునం గలుగునట్టిజనంబులు నీతు లిట్టి వి
ట్టివి యవినీతు లన్మతిపటిష్ఠత గల్గి త్రివర్గవర్తనం
బువెరవు నొంది యర్థములఁ బొంపిరి వోవుచుఁ గామసౌఖ్యవై
భవములఁ గ్రాలుచున్ మనుజభాపనిరూఢతఁ బొల్తు రెంతయున్.