14_3_62 వ.
అనిన నయ్యనిమిషపతియాననం బాలోకించి.
14_3_63 క.
నిను వేఁడుట మోఘము గాఁ,జనునే యెట్లెన నాదుచచనవు సెఱప క
మ్మునిపతికి నమృతరస మి,మ్మని ప్రార్థించిన మహాత్మ యాతఁడు నాతోన్.
14_3_64 వ.
సమయంబు సేసికొని వచ్చె నత్తెఱం గాకర్ణింపు మమ్మహితసౌజన్యధన్యుండు.
14_3_65 శా.
మాతంగత్వము దాల్చి యే నరిగి సుధన్ సమ్మానించి యాభార్గవుం
బ్రీతుం జేసెద నట్టు లిచ్చిన సుధన్ హ్రీదూషితస్వాంతుఁడై
యాతం డొల్లక యున్న నేమి విను నా కన్యాయ్యవృత్తంబు గా
దీతంత్రంబున కీవ సాక్షి యని తా నే తెంచె నిన్ గానఁగన్.
14_3_66 వ.
నీవు ప్రత్యాఖ్యానంబ చేసిన నతం డంతర్ధానంబు సేసెం గా నిమ్ము దాని కేమి
సేయవచ్చు నాయిచ్చినవరంబు బొంకు గా కుండ నీకు జలం బెప్పుడుం గలుగం
జేసెద.
14_3_67 చ.
అనఘ జలంబు నీవలసినప్పుడ మేఘము లీమరుస్థలం
బున నొసఁగున్ భవద్యశము వొంపిరివోవ నుదంకమేఘనా
మనుతవిహారముల్ గలిగి మాన్యత నెప్పుడు నియ్యెడం జరిం
చును జలదంబు లింక నను సువ్రత దూఱకు పోయి వచ్చెదన్.
14_3_68 క.
అనినం బ్రీతుం డయ్యెను,ముని యంతర్దానకలనమునఁ గృషుండుం
జనియె నని చెప్పి మఱియును,జనమేజయనృపతితోడ సంప్రీతిమెయిన్.
14_3_69 వ.
వైశంపాయనుం డి ట్లనియె.
14_3_70 ఆ.
మనుజనాథ యెప్పుడును మరు దేశంబు,నందు నియతవృత్తి నద్భుతంబు
దలకొనంగ నయ్యుదంకమేఘంబు లొ,క్కొక్కపుణ్యతిథుల నొలసి కురియు.
14_3_71 వ.
అనిన విని జనమేజయుండు మునీంద్రా యుపేంద్రుని శపించుటకు నుత్స
హించినయుదంకుం డేమివిధంబుతపంబున నమ్మహానుభావంబు నొందె నెఱిం
గింపవే యనుడు నావిభునకు వైళంపాయనుం డిట్లనియె.
- జనమేజయునకు వైశంపాయనుఁ డుదంకునిచరిత్రంబు సెప్పుట -
14_3_72 సీ.
అతనికి గురుభక్తికతనఁ జొప్పడియెనత్తెఱుఁగు పెం పది విను తెలియ నతఁడు
దనగురుండైనగౌతమునకు శుశ్రూష నియతిమైఁ జేయ సన్నేహభక్తి
కంబుగఁ బెద్దముఁ గాలంబు సనిన నా సంయమిపతి శిష్యసమితి కెల్ల
వివిధవరము లిచ్చివీడ్కొల్పి పుచ్చి యుదంకునిదిక్కును దలఁప కుండె
ఆ.
నత్తపఃపరాత్ముఁ డతినిష్ఠఁ బరిచర్య,నడపు చొక్కనాఁడు గడును వ్రేఁఘు
గలుగునట్టివంట కట్టియమో పఱ్ఱు,గుదియ మోచి తెచ్చెఁ గురువరేణ్య.
14_3_73 క.
అటు మోచి తెచ్చి యం దొక,జట పెద్దయుఁ దగిలి యుండ సరభసముగవై
చుటయుఁ దెగి మోపుతో ముం,దట నది పడియెను జరాసితచ్ఛవిమెఱయన్.
14_3_74 సీ.
దాన నన్నియతుండు దనవయఃపాకంబు నెఱిఁగి శోకంబున నేడ్వ నమ్మ
హాముని యశ్రువు లంజలిఁ బట్టంగ నిజపుత్త్రిఁ బనిచె నన్నీరజాక్షి
రయమునఁ బట్టి కరంబులు వేఁడిమి నెరిసిన విడిచిన ధరయుఁ దలరె
నమ్ముని యాశిష్యు రమ్మని చేరంగఁ బిలిచి నీ వేటికి నలఁతఁ బొందె
ఆ.
దనిన నతఁడు శిష్యు లందఱపైఁ గల,కరుణ మీకుఁ బెద్దకాలమేని
మునివరేణ్య నావలన లేద దానికి,నమ్మలింప కెట్టు లుండ వచ్చు.
14_3_75 వ.
అనుటయుఁ గృప చిగు రొత్తుచిత్తంబుతోడ.
14_3_76 క.
ఎలప్రాయ మిచ్చితిని నీ,కలఘుమతీ యిచ్చెదను మదాత్మజ నుల్లం
బలరఁగఁ బెండిలి గమ్మని,పలికి మఱియు నాతపస్విపతి యిట్లనియెన్.
14_3_77 క.
నీతేజంబు సహింపఁగ,నీతామరసాక్షి దక్క నెవ్వరికిఁ దప
స్స్ఫీతా శక్యము గా దిది,చేతోగతిఁ జూచి తగవు సిద్ధించుటకై.
14_3_78 వ.
ఇమ్ముద్దియకును.
14_3_79 క.
తను వొండుగఁ జేసెద నది,జననాంతర మెట్టు లట్ల సజ్జననుత నీ
వనుమానము దక్కుము యౌ,వనమును గైకొనుము కన్య వరియింపు తగన్.
14_3_80 వ.
అధర్మంబు గా కుండునట్లుగా వరం బిచ్చితి నని యనుగ్రహించి యక్కన్యకా
రత్నంబునకును.
14_3_81 చ.
తనులత యొండు సేసిన నుదంకుఁడు యౌవనలక్ష్మిఁ దాల్చి య
వ్వనిత వివాహ మయ్యె నృపవర్య పదంపడి యమ్మునీంద్రుతో
ననుఁ బని గొండు మీరలు మనంబున నెద్ది దలంచి వేడ్కసే
సిన నది దెత్తు మీకరుణఁ జేసియ కల్గెడు నాకు శక్తియున్.
14_3_82 క.
అని విన్నపంబు సేసిన,విని దక్షిణఁ బ్రీతి యగుట వే ఱొరులకుఁ గా
కనఘ భవదీయచరితం,బునఁ జూవే నాకు ననియె ముని మనుజేంద్రా.
14_3_83 తే.
అంత నిలువక మునిపత్ని కతఁడు భక్తి,నెఱఁగి తల్లి మీరానతి యిండు మీకు
వలయునట్టిపదార్థ మవశ్యమును స,మాహరింతు నే ననుటుయు నయ్యహల్య.
14_3_84 చ.
వలవదు లాఁతి వాఁడవె భవద్గుణతోషితగౌతమాంచితో
క్తులు మది నూఁదు మన్నను నకుంఠితచిత్తతనొత్తిపల్కెన
య్యలఘుతపస్వి యాసతి ప్రియంబున మిత్త్రసహాఖ్యుదేవికుం
డలములు దెమ్ము నాకుఁ బ్రకటంబుగఁ బెంపు వహింపు తమ్ముఁడా.
14_3_85 వ.
అని యిట్లు వనిచిన నాతండు ప్రీతుం డయి యప్పనికిం జనియెఁ బదంపడి
గౌతముం డుదంకునిం బొడగాన మెచట నున్నవాఁ డని యహల్య నడిగిన
నాభృగువంశవరుం డరిగినతెఱం గెఱింగించిన నద్దయాళుం డద్దేవియాననం
బాలోకించి.
14_3_86 క.
ఆసౌదాసనరేంద్రుం,డాసురచరితుండు శాప మాతని నటు గాఁ
జేసినయది మానుషమాం,సాసక్తుం డగు టెఱుంగఁ డమ్ముని యతనిన్.
14_3_87 సీ.
అకటయెట్లగునొక్కొయనుపల్కుకృపదోఁపఁబలికిననమ్ముగ్ధభయముగొనుచు
నెఱుఁగ నిట్లగుట మునీశ్వర నామీఁదిదయ చిగు రొత్త నాతనికిఁ గీడు
రా కుండునట్లుగాఁ జేకొని కావవే యనిన నాసంయమి యంత వెఱవ
నేల యేనతనికి నెడరు రానీ నని తగ నూఱడించె నుదంకుఁ డరిగి
ఆ.
మనుజరక్తసిక్త తనువును గోరిమీ,సములు వృత్తలోచనములు నైన
యుగ్రమూర్తితోడ నొక్క శూన్యాటవి,నెలమి నున్నరేంద్రుఁ గాంచె.
14_3_88 క.
ముని యిట్లు నెమ్మిఁ గాంచినఁ,గని యతఁ డాఁ కొనుటఁ జేసి గాసిలి యెచ్చోఁ
గనువాఁడనొ తగుభక్ష్యం,బనుచుండఁగ వచ్చితివి ప్రియంబుగ ననుడున్.
14_3_89 వ.
ఉదంకుం డతని కిట్లనియె.
14_3_90 క.
గురుకార్యంబునకై భూ,వర నిన్నుం గాన నేను వచ్చితి గుర్వ
ర్థరతులు హింస్యులు గారి,ట్లరయక యాడుదె యధర్మ మగుమాట నృపా.