తెలంగాణా శతావధాని, రచయిత , కవితా ప్రసాద్ గారి శిష్యులు ,లెక్చరర్ , శారదా విద్యానికేతన్ కులపతి,విశ్వనాథ మెచ్చిన -శ్రీ దూపాటి సంపత్కుమారాచార్య
శ్రీమాన్ సంపత్కుమారాచార్య గారు ప్రసిద్ధ అవధాని. గ్రంథం సంపాదకులు, సత్తుపల్లి లోని శారదా విద్యానికేతన్ కులపతి, రచయిత, శతావధాని.
బాల్యం-విద్యాభ్యాసం
దూపాటి సంపత్కుమారాచార్య 1932 మే 18 న ఖమ్మం జిల్లాలో జన్మించారు. వీరి తల్లి ప్రఖ్యాతి గాంచిన కవయిత్రి శ్రీమతి శేషమ్మ గారు. తండ్రి శేషాచార్యులు గారు. వీరు ప్రాథమిక విద్యను వరంగల్లు లోను, మచిలీపట్నం లోను పూర్తి చేసి, ఎస్.ఎస్.ఎల్.సిని మాత్రం పాలకొల్లులో పూర్తి చేశారు. ఆ తర్వాత 1962 లో హన్మకొండలో బి.ఏడ్. శిక్షణను పూర్తి చేశారు. వీరు 1965 వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ప్రవేటుగా చచివి తెలుగులో ఎం.ఏ పట్టాను పొందారు. ద్విశతావధానిగా ప్రఖ్యాతి వహించిన రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి వద్ద సంపత్కుమారు గారు అవధానము చేయుటలో వున్న మెళుకువలు, రహస్యాలను నేర్చుకున్నారు.
ఉద్యోగము
సంపత్కుమారు గారు ఉపాద్యాయుడుగా తెల్లపాడు,. మధిర, కల్లూరు, పెను బల్లి, సత్తుపల్లి మొదలగు ఊర్లలో పనిచేసి ప్రధానోపాద్యాయుడై పాల్వంచలో కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత జూనియర్ కాలేజి లెక్చరర్ పదోన్నతి పొంది హైదరాబాదులోని, సిటీ కాలేజీలోనూ, కల్లూరు, నేలకొండ పల్లి, భద్రాచలం, మొదలగు చోట్ల పనిచేసి, ప్రిన్సిపాల్ గా పదోన్నతి పొంది ఆదిలాబాద్ జిల్లాలోని అసిఫాబాద్లో కొంత కాలం పనిచేశారు. కాని అనారోగ్య కారణాల దృష్ట్యా తిరిగి జూనియర్ లెక్చరర్ గా బదిలీ చేయించుకొని 1990 వ సంవత్సరంలో పదవీ విరమణ పొందారు.
అవధానల పరంపర
సంపత్కుమారాచార్యులు ఆంధ్ర ప్రదేశ్ లో ఖమ్మం, సూర్యా పేట, మనుకోట, పాలకొల్లు, హైదరాబాదు, వరంగల్లు, నల్గొండ, తిరువూరు, సత్తు పల్లి, మధిర మొదలగు చోట్ల విజయ వంతంగా అష్టావధానాలు నిర్వహించారు. ఆ విధగా వీరు సుమారు రెండు వందల పైగా అష్టావధానాలు నిర్వహించారు.
అవధాని గారి అవధానాలలో..... ఆతని ప్రజ్ఞకు కొన్ని మచ్చు తునకలు
ఏప్రిల్ తొమ్మిది 1972 వ సంవత్సరంలో సూర్యా పేటలో వారు చేసిన అస్టావధానంలో వారికిచ్చిన సమస్యా పూరణాన్ని పూరించిన విధానము: ...... ఇచ్చిన సమస్య లంజల కాలు చూచు నెడలం గలుగుంగద మోక్ష సంపదల్ అనగా వేశ్యల కాలు చూడడం వలన మోక్షం సిద్దిస్తుందని అర్థం. దీనికి వారు పూరుంచిన సమాదానము :
ఉ|| క్రొంజిగురాకు
దేహములకుం బరి ధానము లూడ్చి మాన పె
ట్టంజను గోపికాళికి తటాలున కృష్ణుడు
నిల్చె ముందు మే
నం జనియించు లజ్జ యమునా నది దూకిన
నాటి సాంధ్య వే
ళంజలకాలు చూచు నెడలం గలుగలుగుంగద
మోక్ష సంపదల్
అదే విధంగా దత్తపది అంశంలో అవ ధాని గారిని .... కాల్చి, కూల్చి, వ్రేల్చి, ప్రేల్చీ అను మాటలతో లంకా దహనం పై ఒక పద్యం చెప్పమనగా...... అవధానులు గారు వూరించిన విధానం:
ఉ: కాల్చెను కొంపలన్నియు, వికావిక లయ్యెను ప్రాంగణమ్ములే
కూల్చెను కోటలన్ పగుల గొట్టెను గోడౌ
అగ్ని కీలచే
వ్రేల్చెను నిద్రితా సురుల వీధుల లోపల
తాండవింపగా
ప్రేల్చెను వారి గుండియల వీకను మారుతి
లంక లోపలన్ .
వీరు వ్రాసిన గ్రంథాలు:
సంపత్కుమారాచార్యుల వారి కొన్ని గ్రంథాలను కూడా రచించారు. శ్రీమతి నరశన దీక్ష అను కథల సంపుటి, కావ్య కుసుమ మంజరి, గీతాశతి, యాదరిగి లక్ష్మీనృసింహ శతకం వంటివే గాక శరన్మేఘం అను ఒక నవలనుకూడ వ్రాశారు. ఉత్తమ ఉపాద్యాయునిగా, గ్రంథరచయితగా అన్నిటి కన్నా అవధానిగా సంపత్కుమారాచార్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి.
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-25-ఉయ్యూరు .

--
You received this message because you are subscribed to the Google Groups "సరసభారతి సాహితీ బంధు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z_9UHWf9%2BtongFYH_S%2BdZ7emmi8P3MD_q2ixvaKkyRsUA%40mail.gmail.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAMix2KzJ0O4Mf3EO4cVj1VYn14j3QMULUSTYjn%2BB1O_arCPAgA%40mail.gmail.com.