ఎం. వి. ఎల్. పురస్కారం -1
నిన్న 29-11-25-శనివారం సాయంత్రం నూజివీడు లో శారదా ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో ‘’బాలు -ఎం వి ఎల్ స్నేహోత్సవం ‘’ముత్యాలముగ్గు ‘’సినిమా 50ఏళ్ల పండగ ఘనంగా నిర్వహించారు .ఎ౦విఎల్ శిష్యుడైన డా.ఎస్ .టి .పి. శ్రీ వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ‘ఏమ్విఎల్ సాహితీ సమాఖ్య .నూజివీడు సత్యనృత్యకళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వే౦పాటి మోహన్ ,నూజివీడు ఐఐఐటిసంగీత అధ్యాపకులు శ్రీ బి విద్యాసాగర్ లు సంగీతోత్సవ ఆహ్వానితులుగా ,సాహిత్యోత్సవ అతిధులుగా సాహితీ వేత్త ,సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,హైదరాబాద్ ప్రముఖ పాత్రికేయులు డా.ఆరవిల్లి జగన్నాథస్వామి లకు పురస్కారాలను విచిత్రంగా ‘’ఫ్రూట్ బొకే ‘’శాలువా ,దంపతులకు నూతనవస్త్రాలు ,పుష్పహారం 5వేల రూపాయల నగదు ,ఎమ్వి ఎల్ రచనలు ,శ్రీ ఎర్రోజు మాధవాచార్యులు రాసిననూజివీడు సంస్థాన చిరిత్ర పుస్తకాలు అందించారు .ఈ సందర్భంగా స్థానిక దినపత్రిక ‘’జన సమరం ‘’ప్రచురించిన ప్రత్యెక సంచిక ‘’సాహిత్యమే శ్వాసగా అందరిబంధువు -శ్రీ ఎమ్వి ఎల్ ‘’ను నాచేత ఆవిష్కరింప జేయటం నాకు లభించిన అదృష్టం .సభకు ముందు చేసిన ఇద్దరు విద్యార్ధినుల ఆహ్వాన నృత్యం ఆకర్షణీయంగా కనిపించలేదు .పాట కూడా మాధుర్యం అనిపించలేదు . కార్యక్రమం అంతా వెంకటేశ్వర్లు గారు చాలా బాధ్యతతో ఓపిక లేకపోయినా గురుభక్తి తో నిర్వహించారు .ఆయన మాటలే కాక ,అతిధుల ప్రసంగాలు కూడా వేదికపై ఉన్నవారికి అర్ధంకాలేదని పించింది .ప్రక్కన బిగ్ స్క్రీన్ పెట్టి విజువల్స్ అద్భుతంగా చూపించారు . నన్ను ‘’పెదనాన్న గారూ’’ ఆని పిలిచే ఏమ్విఎల్ గారి అమ్మాయి,విశ్వావసుఉగాదికి సరసభారతి నుంచి ఉగాది పురస్కారం అందుకున్న శ్రీమతి అనూరాధ ‘’ అమెరికా నుంచి స్క్రీన్ పై సందేశాన్నిచ్చింది .నేను మాట్లాడినప్పుడుకూడా ‘’అమ్మా అనూరాధా ‘’నువ్వు ఇక్కడ లేకపోయినా మీసమాఖ్యవారంతా చాలా గొప్పగా నిర్వహించారు వారితో పాటు నీకు కూడా ధన్యవాదాలు ‘’ఆని చెప్పాను .స్క్రీన్ పై ముత్యాలముగ్గు ఒకఅరగంట సేపు చూపారు .రాంగ్ టైం లో చూపించారేమో అనిపించింది .
ఉయ్యూరు నుంచి నేను ,మా సరసభారతి సాంకేతిక నిపుణులు శ్రీ గంగాధరరావు ,శ్రీకాకుళం లో ఫిజికల్ సైన్స్ టీచర్ సాహిత్యోపజీవి నవ్వుల నజరానా,అవధానాల ప్రాశ్నికుడు ,పద్యకవి అప్రస్తుత ప్రసంగంలో దిట్ట ,సరసభారతి ఆత్మీయులు మా ఆస్థానకవి శ్రీ దండి భోట్ల దత్తాత్రేయశర్మగారు ఉదయం స్కూల్ లో పనిచేసి ,మధ్యాహ్నంసెలవు పెట్టి ఉయ్యూరు వచ్చి ,బందరులో జరిగిన ‘’నా జీవన సాఫల్య పురస్కారం ‘’కు హాజరు కాలేకపోవటం తో మాఇంట్లోమా దంపతులకు శాలువకప్పి ,పండ్లను ,చలికాలం కనుక ‘’దుప్పటి ‘’అందించి సత్కరించారు .దండి భోట్లవారు రావటం నాకు నిండుగా దండిగా ఉండి ..అందరం కారులో బయల్దేరి తేలప్రోలు, జంక్షన్ మీదుగా నూజి వీడు పావుతక్కువ అయిదుకు చేరాం .అప్పుడే స్కూల్ వదలటం వలన పిల్లలంతా వెళ్లిపోగా ముందుభాగం లో షామియా కింద సభా వేదిక ఏర్పరచారు .ఒకపావు గంట తర్వాత మేము ముగ్గురం బయటికి వెళ్లి పుల్కాలు తిని కాఫీ త్రాగి వచ్చాం .మేము వచ్చాక సభవారు కూడా టీఅందించారు .అప్పటికే రాం సూరి,, అత్తిలి వెంకటరమణగారు ,హరికథా విద్వాన్ శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారి అబ్బాయి ,సరసభారతి ఆత్మీయ కవులు స్థానికులుఅయిన శిఖాఆకాష్ ,వికే డి ప్రసాదరావు ,ఈమని శేషయ్యలు కూడా వచ్చారు .సభలో స్త్రీలు కూడా గణనీయంగా ఉన్నారు .జ్యోతి వారే వెలిగించారు . ముందు నూజివీడుతో నాపరిచయం రాసి తర్వాత ఫైనల్ టచ్ గా శ్రీ ఎం వి ఎల్ గారి తో నాపరిచయం ఆయన పాండిత్యం రచనా విశేషాలు తెలియజేస్తాను .
నూజి వీడు తో నా పరిచయం
నూజివీడులో రామమందిరం ప్రసిద్ధి .అది సూరి వారి మందిరంగా పేరు పొందింది దాని నిర్వాహకులు శ్రీ సూరి సీతారామంజనేయులుగారు మా ఉయ్యూరి వారి అల్లుడు గారు .ఆయన భార్య ఉయ్యూరులో డాక్యుమెంట్ రైటర్ మానాన్న గారి ఆబాల్య మిత్రుడు ‘’ఏరా అంటే ఏరా ‘’అనుకొనే శ్రీ కొలచల వెంకటరామయ్యగారి కుమార్తె .వీరబ్బాయి రాం సూరి నాకు చిన్నప్పటి నుంచి పరిచయం మంచి కవి విశ్లేషకుడు విశాఖలో తెలుగు లెక్చరర్ చేసి రిటైరై ఇక్కడే ఉంటున్నాడు .ఇతని పెద్దబాబాయి శ్రీరామ చంద్ర మూర్తి బెజవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో ఆఫీస్ సూపరి౦టే౦ డింట్ .నేను 1956-60వరకు ఇంటర్ ,డిగ్రీ చదివినప్పుడు అక్కడే ఉన్నారు .ఆయన భార్య సుందరి కూడా బంధువే మాకు చిన్నబాబాయి రఘురామ చంద్రమూర్తి ఉయ్యూరులో మామేనమామ గుండు గంగయ్య గారి పెద్దల్లుడు -అంటే రాజ్యాలక్ష్మి భర్త .
మా తోడల్లుడు శ్రీ చతుర్వేదుల శ్రీరామ మూర్తి గారు నూజివీడు స్టేట్ బాంక్ లో పని చేశారు .అప్పుడు వచ్చి వెళ్ళేవాళ్ళం .వాళ్ళు చిన్న గాంధి బొమ్మ దగ్గరనుండి విస్సన్నపేట వెళ్ళే దారిలో కుడివైపు వైశ్యుల ఇంట్లో ఉండేవారు .ఆయన తల్లిగారు రామమందిరం లో మూడు రోజులు లక్షవత్తుల నోము నోచుకొంటే మేమందరం ఉయ్యూరు నుంచి వచ్చి ఉన్నాం .నేను ఒకసారి ఉయ్యూరునుంచి విస్సన్న పేట హైస్కూల్ కు ట్రాన్స్ ఫర్ అయితే అక్కడ పూజారి మల్లయ్య గారింట్లో ఒక రూం అద్దెకు తీసుకొని వంట చేసుకొంటూ గడిపాను .ఒకసారి మా శ్రీమతి కూడా వాళ్ళ అక్కయ్యతో పాటు రెండు రోజులు వచ్చి ఉన్నది .ఏదో హిందీ సినిమా చూశాం .విస్సన్న పేట హెడ్ మాస్టర్ శ్రీ గాడేపల్లి దక్షిణామూర్తి గారు నూజి వీడు వాస్తవ్యులు . బస్టాండ్ కు వెళ్ళే దారిలో కుడిప్రక్క వారి ఇల్లు .ఆయన ఉయ్యూరు హెడ్ మాస్టార్ గాకూడా పని చేసినప్పుడు మా బజార్లోనే ఉండేవారు .ఆయన సోదరుడు మైలవరపు వారికి పెంపుడు వెళ్ళిన కృష్ణ శాస్త్రి గారు మా బావ గారు వేలూరి వివేకానంద్ గారి పెదబావ గారుఅంటే అక్కగారి భర్త .శాస్త్రి గారి భార్య హిందీ టీచర్ వెంకాయమ్మ గారు ఉయ్యూరులో కొలచల చలపతి అక్కయ్య . విస్సన్నపేట తెలుగు టీచర్ పత్రి రామమోహన రావు ,మరో ఆచార్యులుగారు నాకు మంచిమిత్రులు .నూజివీడు నేటివ్, నేను పనిచేసినప్పుడు కొద్దికాలం విస్సన్నపేటలో పని చేసిన లెక్కలమాస్టారురు ఆంజనేయ చౌదరిగారు గొప్ప సాయి భక్తులు .ఆయన భార్య డ్రిల్ మాస్టారు .అలాగే తుమ్మల నారాయణరావు సైన్స్ మాస్టారు .భార్య మెడికల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం.ఈయన అన్నగారు చంయ్యగారు నాకు ఉయ్యూరులో ఆప్తులు .
నేను బాడ్ మింటన్ వాలీ బాల్ ప్లేయర్ ను .నేను ఆడుతుంటే’’ సచిన్’’ కున్నంత ఫాలోయింగ్ ఉండేది నూజివీడులో ఈరెండింటికి హైస్కూల్ టీం చాలా ప్రసిద్ధి కెక్కింది జిల్లాలో .శ్యాం అనే ఎన్ డి ఎస్ కోర్ట్ లో నిల బడితే అందరికి గజగజా .బాక్ లైన్ నుంచి బాల్ కొడితే అవతలివైపు బుల్లెట్ దిగినట్లుదిగాల్సిందే .ఆజానుబాహువుఎప్పుడూ కారాకిల్ళీ. కళ్ళు ఎర్రగా జ్యోతులుగా ఉండేవి. అయితే స్నేహశీలి .నేను పామర్రులో పనిచేసినప్పుడు ఫైనల్ గా నూజి వీడు టీచర్స్ తో బాడ్ మింటన్ ఆడాల్సి వస్తే మా టీం కంగారు పడి నూజి వీడు వెళ్ళద్దు ఆని మాలీడర్ డ్రిల్ మాష్టారు అంటే నేను పోట్లాడి ,ఆడాల్సిందే గొప్పవాడి చేతిలో ఓడిపోయినా గొప్పే ఆని తీసుకు వెళ్లి ఆడాం ఓడాం .ఇక్కడే విష్ణుదాస్ గారు సోషల్, ఇంగ్లీష్ టీచర్ .ఈయనా మంచి ప్లేయర్ .ఎప్పుడూ ఇన్ షర్ట్ లో ఉండేవారు .ఇంగ్లేష్ లో’’ జెం’’ .టీచర్స్ ఓరి ఎంటేషన్ క్లాసులు ఆయనే జిల్లా అంతా నిర్వహించారు .డి.యి.వో .ఆఫీస్ లో కూడా మంచి పలుకుబడి ఉన్నవారు .నాకు ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం రావాలని పట్టు బట్టిన వారు .వారి మేనమామ ముదునూరు వెంకటేశ్వర రావు గారు బాలల కార్యక్రమాలు నిర్వహించారు .ఆదర్శ ఉపాధ్యాయులు ‘’మహాత్ముల బాట ‘’లో ఆని తన జీవిత చరిత్ర రాసుకొన్నారు .అడ్డాడ హైస్కూల్ లో కొంతకాలం పనిచేశారు .నేను అక్కడ హెడ్ మాస్టర్ గా పని చేసినప్పుడు ఆయన్ను, మాబావమరిది ఆనంద్ ను పిలిచి ఒక స్వాతంత్ర్య దినోత్సవం నాడు సన్మానం చేశాను .తర్వాత సరసభారతి ఏర్పడ్డప్పుడు ఉయ్యూరు తీసుకు వచ్చి సన్మాని౦చాము .ఆయన పుస్తకం పై నేను సరసభారతి బ్లాగ్ లో విస్తృతంగా రాశాను .చనిపోయే ముందు వరకు ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు .ఇంగ్లిష్ డిక్షనరి రాశారు కూడా .నిరంతర సాహిత్యోపజీవి .తర్వాత ఇంగ్లిష్ లెక్చరర్ గా జూనియర్ కాలేజి పిన్సిపాల్ గా పని చేసి రిటైరయ్యారు .అందరికి ఆయన ఆదర్శప్రాయులు. మా బావ మరిదికి మంచి స్నేహితుడు .
మా బావ మరిది విషయం వచ్చింది కనుక మా అత్తారిల్లు ఏలూరు- నూజి వీడు వయా ముసునూరు రోడ్ లో ఉన్న వేల్పు చర్ల .మాఅత్తగారు నాకు కజిన్ సిస్టర్ అంటే మాఅమ్మ చెల్లెలి(పిన్ని )కూతురు . మా బావమరిది స్టేట్ బాంక్ లో పని చేసి రిటైరయ్యాడు .వాళ్ళ అబ్బాయి వంశీకి పైన చెప్పిన గాడేపల్లి దక్షిణా మూర్తిగారికొడుకు కూతుర్ని ఇచ్చి నాలుగేళ్ల క్రితం నూజివీడులోనే వారింటికి ఎదురుగా ఉన్న రెండస్తుల వివాహ వేదిక లో పెళ్ళి అయితే మేమంతా వచ్చాం .మా బామ్మర్ది ,మాతోడల్లుడు గారి అబ్బాయి మధు నూజివీడులో చదివినప్పుడు ఏమ్విఎల్ గారి శిష్యులు .వీరి క్లాస్ మేట్ నేపధ్యగాయకుడు పిబి శ్రీనివాస్ గారి మనవడు సినిమాలలో బాల వేషం వేసి చలాకీనటించిన కుర్రాడు .పేరు జ్ఞాపకం లేదు .
శ్రీ కిరణ్ కుమార్ ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య సభలు జరిపించి ఒకసారి నూజివీడు హైస్కూల్ లో జిల్లాలోని కవులను రచయితలను ఆహ్వానించి సత్కారం జరిపారు .అప్పుడే నాతోపాటు శ్రీ అత్తిలి వెంకటరమణ గారూ ఉన్నారు. అదే మా మొదటి పరిచయం .కొంతకాలం ఫోన్ లో మాట్లాడుకోనేవారం .నిన్న ఆయన జ్ఞాపకం చేశారు ‘’మీరు చెరుకుపల్లి జమదగ్ని శర్మ ‘’గారి గురించిరాసిన వ్యాసం చదివాను చాలా బాగుంది ‘’అన్నారు. .ఇవాలసాయ౦త్ర౦ అత్తిలి రమణ గారు ఫోన్ చేసి మాట్లాడారు .పాతవిశాయాలన్నీ గుర్తుకు తెచ్చారు .జమదగ్ని శర్మగారు విశ్వ నాథ వారికి ప్రియ శిష్యులు .తండ్రి ముసలితనం లో సంధ్యావందనం చేయలేకపోతే శర్మగారు తన సంధ్యావందనం తో పాటు తండ్రి గారి సంధ్యా వందనం కూడా చేసేవారు .మా తోడల్లుడిగారి తల్లిగారు నూజి వీడులో లక్ష వత్తుల వ్రతం చేసుకొన్నప్పుడు ఒక రోజు జమదగ్ని శర్మగారింటికి వెళ్లి మాట్లాడాం.ఆయన చాలాపుస్తకాలు రాశారు .సాహితీ విమర్శకులు విశ్లేషకులు .మంచి అతిధిమర్యాద ఉన్నవారు .
చివరగా మాకుకృష్ణాజిల్లా టీచర్స్ గిల్డ్ ఉండేది .అందలో నేను యాక్టివ్ గా ఉండేవాడిని . శ్రీ ఎం వి ఆర్ శాస్త్రిగారు కార్యదర్శి .నూజివీడు హైస్కూల్ లో సోషల్ మాస్టారు తర్వాత హెడ్ మాస్టర్ కూడా అయారు .మహా ఉత్సాహి .ఉద్రేకి .జిల్లాన౦తా ఒంటి చేతితో నడిపేవారు తరచుగా కార్యవర్గ సమావేశాలు ఇక్కడే జరిపేవారు అలా నూజి వీడు వచ్చి హాజరయ్యేవాడిని .నాకు అత్యంత ఆప్తుడు శాస్త్రి గారు .మరో ఎం వి శాస్త్రి లెక్కలమేస్టారు తర్వాత హెడ్ మాస్టర్ .ఆయన అడివి ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఆకర్షవంతంగా తీర్చి దిద్దినవారు .అక్కడే జ్ఞాన సరస్వతి దేవాలయం కూడా కట్టించటానికి బాగా కృషి చేసినవారు. ఎప్పుడూ ఆవార్తలు పేపర్లలో వచ్చేవి .వారిద్దరూ ఇప్పుడు లేరు .
రేపటి వ్యాసం ఏమ్విఎల్ స్పెషల్ .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-25-ఉయ్యూరు.
--
You received this message because you are subscribed to the Google Groups "సరసభారతి సాహితీ బంధు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z_5vWVz2tyxok6pvUhdUC9Vx0y4yo85cRk58hhC5oAH3g%40mail.gmail.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAMix2KyqGLAH4anE2P%3D2ajuVT_k94efw38O2NzN1dLqPuoFcwQ%40mail.gmail.com.