లక్ష్మీజనార్దన చరిత్రము

5 views
Skip to first unread message

gabbita prasad

unread,
Oct 19, 2021, 10:56:17 AM10/19/21
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Vuppaladhadiyam Venkateswara, Gopala Myneni, గోదావరి రచయితల సంఘం రాజమహేంద్రవరం, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY, Viswanadham Vangapally, bellamk...@gmail.com, Subbarao Bandarupalli, Lavanya Pasumarthy, Padmasri Potukuchi, Padma Bulusu, Durvasula Kameswara Rao, Narasimha Sarma Rachakonda, Ramky Adusumilli, Sai Pavan, Pavan

 లక్ష్మీజనార్దన చరిత్రము

తూగోజి ధవళేశ్వరం పిడబ్ల్యుడి క్లార్క్ శ్రీ బొండాడ సూర్యనారాయణ లక్ష్మీ జనార్దన చరిత్రం, దానికి అనుబంధంగా శ్రీ వెంకటేశ్వర శతకం రాసి ,రాజమండ్రిలోని ఎస్ గున్నేశ్వరరావు బ్రదర్స్ కు చెందిన చింతామణి ప్రెస్ లో 1913లో ముద్రించారు వెల మూడు అణాలు .విజ్ఞాపనం లో కవి ‘’గౌతమీ తటం  ధవళగిరి పై వెలసిన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి కి అంకితం చేస్తూ రాశానని చెప్పాడు .దీన్ని ఆసాంతం విన్న వ.సు .కవి  అంటే వడ్డాది సుబ్బారాయ కవి గారికి వందనాలు తెలియజేశాడు .

 శార్దూల౦ లో మొదటి పద్యం ‘’శ్రీ రామామణి తో ,శేషాహిపై బండి ,యే-కారుణ్యా౦బుధి భక్త సంఘంబుల వేడ్కన్ గాంచి రక్షించు నే –

పారావార గభీరునిన్ గొలువగా  బ్రహ్మాదులున్ జాల ర-ద్ధీరున్ దైత్యకులా౦తకున్ ,వరదునిన్ .దీనావనున్ గొల్చెదన్’’ అని జనార్దన స్తవం చేసి ,కైలాస విభుడు అర్ధనారీశ్వరుడై ఆమె కోరగా హరికధలు చెప్పే శివుని గణపతిని స్తుతించి ,’’వెన్నున్ నాభిలో జనించిన చిన్నికుమారుడు ‘’బ్రహ్మను ఆయన అర్ధాంగి ‘’విరించి కూరిమి రాణి ‘’ని ,’’కరిముఖుని ‘’ కవిపెద్దలకు నమస్కరించి తర్వాత తన విషయం చెప్పాడు .తండ్రి కోదండరామస్వామి ఉదారుడు .తను బొండాడ సూర్యనారాయణ .మనసులో జనార్దానుని’’భవ్యకథ’’ రాయాలని కోరికపుట్టి౦ది సంస్కృతం తాను చదవలేదు .గౌతమీ మహాత్మ్యం లో ఉన్న కథను చదివి విపించి మనసుకు పట్టించారు శ్రీ నున్న వెంకటార్యులు .ఇక స్థల పురాణం జోలికి పోకుండా దానినే ఆధారంగా రాశాడు.ఇక కథలోకి వెడితే

‘’సత్యలోకంలో బ్రహ్మ సభలో వాణీ నాథుడు కొలువు తీరి ఉన్న సమయం లో నారద మహర్షి వచ్చి ‘’గౌతమీ తటమున ఉన్న తీర్ధాలలో ముఖ్యమైనదేది ?””అని అడుగగా ,బ్రహ్మ ‘’జహ్నుని సుతతో తుల్యమగుచుండును గౌతమి .దీన్ని గౌతమమహర్షి తెచ్చాడు .అనగా ఎందుకు తెచ్చాడు అని అడుగగా ,గౌతముడు తీవ్ర తపస్సు చేస్తుంటే మునులు ఆయన ఆశ్రమ౦ లో ఉంటూ సపర్యలు అందిస్తున్నారు .వామనావతారం లో బలిగర్వం పోగొట్టటానికి విష్ణువు వామనావతారం ఎత్తి ,బ్రహ్మా౦డమంతా ఆక్రమిస్తే ,అప్పుడు తాను  తన కమండలోదకం తో ఆయన పాదాలు కడుగగా ,ఆ జలం నాలుగుపాయలై ,శివుని జటాజూటం చేరింది .ఆమెపై శివుడికి మక్కువ పెరగటం తో పార్వతి ఖిన్నయై ఎలాగైనా గంగను వదిలించుకోవాలని సాయం చేయమని  కొడుకు వినాయకుని కోరితే , ‘’తల్లి చింత వలదు ,తధ్యంబుగా నీకు గలుగు –వంతదీర్ప గలను జుమ్మీ -‘ఎలుక వాహనం మీద పూర్వం ఘోరయుద్ధం చేశాను అని అభయమిచ్చి,తనకు అది పెద్దపనే కాదు అని ‘’కొక్కు తేజిపై హాయిగా ‘’కూర్చుని తల్లి దీవెనలు పొంది ,అతి వేగంగా గౌతమాశ్రమం చేరి .అక్కడి మునిజనం తో సఖ్యంగా ఉంటూ ఉన్నాడు .

 గౌతముడు నివ్వరి ధాన్యం పొలం లో చల్లి రోజూ నీళ్ళు పెట్టి పెంచుతూ ఒక రోజు మర్చిపోతే .ఇదే అదను అనుకోని’’ మాయ గిడ్డి ‘’ని కల్పించి ఆపాలం అంతా మేసేట్లు చేస్తే మునికి కోపం వచ్చి దర్భపుల్లతో ఆ ఆవును అదలిస్తే అది ముని ఆశ్రమం ముందు చనిపోతే దుఖభారం పొందిన గౌతముడు ని  శ్చేస్టుడుగా ఉంటె మునులందరికీ ఒక ఉపాయం చెప్పాడు’’కనకాచల ధన్వి జటను గలిగిన గంగన్ -  ఇలకుగొని తెచ్చిగౌతముండిచట నదిని ‘’పారిస్తే ,మళ్ళీఆశ్రమ౦  పవిత్రవంతం అవుతుందని సలహాచేప్పాడు .ఆమాట నచ్చి ముని గౌతముడు కైలాసం వెళ్లి శివుని మెప్పించగా ,ఒక జడ ఊడదీసి గంగను పారించాడు .ఆ ముని వెంట ఆనది పరిగెత్తుకొంటూ ఆశ్రమం దాకా రాగా ,అందరు పవిత్ర స్నానాలు చేశారు .గౌతముడు తీసుకు వచ్చాడుకనుక ‘’గౌతమి ‘’అయింది .

  నారదుడు మళ్ళీ బ్రహ్మను ‘’గౌతమమునిని వంచించటం వినాయకునికి సాధ్యమా ?””అని అడిగితె ‘’’’హరిహర లీలలు నెన్నగ-హరిహరులకే చెల్లుగాని యలవియె మనకున్ -  నరులకు మేలొనగూర్ప-హరిహరు లిట్లాచారింతురాశ్చ  ర్యముగాన్ ‘’అన్నాడు .గౌతమీ తీరం లో జనార్దన తీర్ధం ఉంది అది చాలామహత్తరమైనది దాని వివరాలు చెబుతా వినమన్నాడు –మొదట్లో నాముఖ గహ్వరం నుంచి వెలువడిన వేదాలు అన్నిటా వ్యాపించాయికాని మునిజనాలకు అందుబాటు కాలేదు .వారి మనోబాద తీర్చటానికి’’ జనార్దనుడు వాటినన్నిటి నొక ప్రోగుగా జేసె శిలోచ్చయాకృతిన్ –గాన జనార్దనాద్రి యన –గా నుతి గాంచెను నమ్మహీన్ద్రమున్ ‘’ఇలా నాలుగు వేదాలను అద్రి రూపంగా మార్చికరుణా ప్రపూర్ణు డయ్యాడు హరి .అక్కడ జనార్దన స్వామిగా వెలిశాడు.ఆతర్వాత బాదరాయణ వ్యాసమహర్షి అక్కడికి వచ్చి ‘’అత్య౦త భక్తితో శిఖరి యందలి నాలుగు తున్కలన్ గడున్ బ్రీతి ఎలర్పగాగొనుచు బృధ్వికొసంగెను బ్రాతమిన్కులన్ ‘’  .

  గౌతమి ఒడ్డున ధవళేశ్వరం గిరిపై జనార్దనుడు లక్ష్మీ దేవితోశంఖ చక్ర గదాది ఆయుధాలతో  కొలువై ఉంటూ భక్తజనావళిని కాపాడుతూ ఉంటాడు .తర్వాత వ్యాస బ్రహ్మ ,శ్రీ కంఠుడు 10మత్తకోకిలలో జనార్దన స్తోత్రం చేసి పూజించారు .తర్వాత అనేక లలితపద వృత్తాలలో  శ్రీ రమా స్తుతి చేశారు .క్రౌంచపద వృత్తాలో జనార్దనాష్టకం పాడారు .వ్యాసాదులు చేసిన ఈ స్తోత్రాలకు పరమ ప్రీతి చెంది దేవ దేవులు సంతోషించి ఈ స్తోత్రాలు భక్తిగా పఠించిననవారికి మంచి జరుగుతుంది అంటే వ్యాసుడు దర్శించినవారికి మోక్షం  అనుగ్రహించమని కోరితే తధాస్తు అన్నారు .ఈ తీర్ధాన్ని వ్యాస కృత జనార్దన తీర్ధం అంటారని కూడా చెప్పాడు .

ఆతర్వాత రామావతారం  వర్ణించాడు కవి .వనమయూర వృత్తం లో శ్రీ రంగాష్టకం చెప్పాడు –‘’దేవ నిను గొల్చెదను దీనుడను బాపిన్ –గావదగు బబేరిమి ని గంజదళా నేత్రా –నీ విమలకార్యములు నేర్తునె నుతింపన్ –దేవతలకెల్ల సుర దేనువవు రంగా ‘.తర్వాతస్వాగత వృత్తాలలో రామాష్టకం రాశాడు కవి –‘’నన్ను బ్రోవు రఘునందనరామా- సన్నుతించెదను,జానకి నాథా – నిన్నే నమ్మితి ,నీకే భటుండన్-బన్నగారి రధ బంకజ నేత్రా ‘’.భుజంగ ప్రయాతం ఇంద్రవ్రజం వృత్తాలూ సమర్ధంగా రాశాడు .చివరగా –

‘’నీరజ నేత్రా ఘన నీలగాత్రా –కారుణ్య ధామా ,రిపుకంజ సోమా –శ్రీరామమూర్తీ .నరసింహమూర్తీ-సారెందు కీర్తీ సుర చక్రవర్తీ ‘’అని 188వ పద్యంతో ముగించాడు .

  తర్వాత శ్రీ వెంకటేశ్వర శతకం కూర్చాడు .మొదటిపద్యం గీతపద్యం –‘’శ్రీల జనులకోసగుచు సిరియు ధరయు –నీళలవయంబు రక్తితో నిను భజింప –వారలు నీ వొనరి౦చెద వందనములు –విగత భవ పాశ తిరుపతి వేంకటేశ ‘’

చివరి 101వ ఆట వెలది పద్యం తో శతకం ముగించాడు –‘’ని౦డుభక్తి తోడ బొండాడ సూర్య నా-రాయణుండుసేససెనర్పణము –గీత శతకమొకటి పీతాంబరా –దీని వేడ్కతోడ బొందు వేంకటేశ ‘’  తిరుపతి వేంకటేశ మకుటం లో రాసిన శతకమిది .గోదావరీ తీర క్షేత్రమైన జనార్దనునిని క్షేత్రమహాత్మ్యాన్ని ‘’గలగలా పారే గోదారిలా ,కమనీయంగా మృదు మధురంగా ,గోదావరీ పావనోదార పవిత్రంగా  భక్తీ అనురక్తీ ,కధాకధన శక్తీ మేళవించి మహా భక్తకవుల స్థాయిలో రసబందురంగా రాశాడు కవి .ఈ కావ్యం, ఈకవినీ పట్టించుకొన్న దాఖలాలు లేవు .నాకు పరిచయం చేసే మహద్భాగ్యం కలిగింది జైజనార్దనా .

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్-19-10-21-ఉయ్యూరు  

    

image.png

   

 


--



Telugu Wikipedia : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
             8520805566

Land Line : 08676-232797


Reply all
Reply to author
Forward
0 new messages