చిన్ననాటి జ్ఞాపకాలకి వెడితే ప్రస్తుత ప్రపంచాన్ని మరచి పోయి
ఇంద్ర లోకాల్లో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. నిజమే మరి ఆ నాటి
పల్లెటూళ్ళు , పొలం గట్లు, తాటి తోపులు , పచ్చని వరి చేలు , చెరకు,
మామిడి, అరటి లాంటి తోటలు, చల్లని పైర గాలి, అన్ని దాటుకుంటూ తాత గారి
ఊరు వెడుతుంటె ఎంత బాగుండేదని ? అసలు ఆ అందాలు, అనుభూతులు తిరిగిరాని ఆ
బాల్యం అనుభవైక మేధ్యమె కానీ వర్ణనాతీతం.
రైలు దిగి తాత గారింటికి [ అదే దివాణం ] వెళ్ళాలంటే తాత గారు
పంపిన రెండెడ్ల బండిలో గతుకుల రోడ్డులో గానీ బల్ల కట్టు దాటి పొలం
గట్లమ్మట నడిచి గానీ [ ఎందుకంటే ఏలూరు కాలవ అడ్డం గనుక ] వెళ్ళాలి.
అందుకని బండి కన్న నడకే ఇష్టం గా ఉండేది.
అందర్ని అటు ఇటు ఒడ్డుకు చేర్చే వెంకన్న మాత్రం ఎప్పుడు
వెళ్ళినా, అదే బల్లకట్టు మీద నిశ్చలంగా ఉండి పోవడం మరింత ఆనందంగా హాయిగా
ఉండేది. కరణం గారి తాలూకు అని చూడగానె మరింత వినయ విధేయతలతో ప్రేమగా
పలకరిస్తు కబుర్లు చెప్పేవాడు. అన్ని దాటుకుని దివాణంలో అడుగు పెడితె
ఎదురొచ్చి సామాన్లు అందుకునే పాలేర్లు, నానమ్మ, తాత గారు, అత్తలు,
బాబాయిలు ఇలా అందరి ఆప్యాయపు తీయని కౌగిలి.
చుట్టు పక్కల ఊళ్ళకి కరణం కావడం వల్ల, తాత గారికి తిరగడానికి
గుఱ్రం ఉండేది. ఇక రోజు ఒకసారి తాత గారి వెనకాల కూర్చుని గట్టిగా నడుం
పట్టుకుని బిక్కు బిక్కు మంటు రౌండ్లు తిరగడం బలే మజాగా ఉండేది.
ఇక వేసవి కాలం ఐతె సాయంత్రాలు నాన్న గారు, తాత గారు, బాబాయిలు,
పిల్లలందరం కలసి పొలంకి వెళ్ళి, కొబ్బరి బొండాలు కొట్టించుకుని నీళ్ళు
తాగడం , తాటి ముంజలు తెప్పించు కోవడం. మామిడి పళ్ళు సరేసరి, ఇక తేగలు
లాంటివి వేరే చెప్పాలా ? సాయంత్రాలు ఆరుబయట వెన్నెట్లో పక్కలు వేసుకుని,
తాత గారు చెప్పే కధలు వింటూ, వెన్నెట్లొ ఆడుతు, మత్తెక్కించె పూల వాసనలతొ
చల్లని వెన్నెట్లొ హాయిగా ఉండేది.
అదే సంక్రాంతికి ఐతె, ముంగిట ముగ్గులు ఇంటికి వచ్చిన ధాన్యం
గాదెలలొ నింపుతుంటె, ధాన్య లక్ష్మితొ పిల్లా పాపలతొ నిండుగా ఉండేది.
బొమ్మల కొలువులు, పట్టు పరికిణీలు, పూలజడలు, వంటి నిండుగా నగలు, గొబ్బి
పాటలు ఇలా చెప్పుకుంటూ పోతే అంతెక్కడిది ? ఆరోజుల్లో "సావిత్రి గౌరిదేవి
వ్రతమని" సంక్రాంతి తర్వాత తొమ్మిది రోజులు చేసేవారు. అప్పుడు అమ్మలు,
అత్తయ్యలతొ కూడా మేము వెళ్ళే వాళ్ళం. ఇది బొమ్మలు అందరు కలిసి ఒకరి
ఇంట్లొ పెడతారు. మొదటి రోజు బేండు మేళంతొ నోము చేసుకునే వారందరు అంటే,
కొత్త పెళ్ళి కూతుళ్ళు, పాతబడిన పిల్లల తల్లులు అందరు కలసి కుమ్మరి వాని
ఇంటికి స్వయంపాకం తీసుకుని [ అంటే ఇంటికి చీర జామారు వంటకి కావలసిన
బియ్యంతొ సహా కొంత కట్నం డబ్బు ] వెడతారు. అవన్నీ తీసుకుని ఆ కుమ్మరి తన
చక్రం మీద మట్టితొ బొమ్మలు చేసి ఇస్తాడు. అవన్నీ తెచ్చుకుని ఒకరి ఇంట్లొ
పూజారి గారిని పిల్చి మంత్రాలతొ శాస్త్రీయంగా పూజిస్తారు. మర్నాడి నుంచి
ప్రతి రోజు పిండి వంటలతొ నైవేద్య మిడి, చివరి రోజున మళ్ళీ మంగళ
వాయిద్యాలతొ ఊరేగించి, చెరువులొ కలుపుతారు. ఇలా తొమ్మిది రోజులు చొప్పున,
తొమ్మిదేళ్ళు చేయాలి- అదే మన బతుకమ్మలు లాగ అది చాలా బాగుంటుంది.
ఇక అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు తెల్ల వారిఝామునె [ చుక్కొడిచింది
అనేవారు ] లేచి, మడి నీళ్ళు తడి బట్టలతొ, అవసరాన్ని బట్టి ఇత్తడి
బిందెలతొ తెచ్చుకునేవారు. వెలుగొస్తె కరణంగారు, మునసబు, ప్రసిడెంట్ ఎదురు
పడతారని. అంతేనా ? దారిలొ ఇతర కులాల వాళ్ళు గానీ, వెట్టి వాళ్ళు గానీ
ఎదురు పడితె ఇంతే సంగతులు . మడికి భంగం. ఆ నీళ్ళు పారబోసి మళ్ళీ వెళ్ళి,
దారి పొడవునా నీళ్ళు జల్లుకుంటు మంత్రాలు చదువు కుంటూ, ఇంటికొచ్చేసరికి
సగం బిందె ఖాళీ [ అది వేరే విషయం ] . ఇలా కోకొల్లలు. ఇక పెరిగే వయసుతో
బాటుగా, నాగరికత, బస్తీ బ్రతుకులు, చదువులు, అందమైన యవ్వన దశ. క్లాసులొ
అబ్బాయిల కేరింతలు, ఉపాధ్యాయుల అదలింపులు, "వరూధినీ ప్రవరాఖ్యుల" మధుర
ఘట్టాలు. అప్పుడు అదేదో ఇంద్ర లోకం, వారెవరొ కలల రాకుమారులు, తమ మనసును
దోచే గంధర్వులు, మదినిండా వింత వింత ఆనందం. కొంత గర్వం. గుండెలు
బరువెక్కి, సిగ్గు దొంతరల ముసుగులొ ఒయ్యారంగా పైటను సవరించుకుంటూ, ఒకరి
నొకరు చిరు నవ్వుల పలకరింపులతొ, క్రీగంటి చూపుల తూపులు అబ్బాయిలపై
విసురుతూ, మహరాణుల మన్నట్లు హంస నడకలు అదొక అందరికి అందమైన ఆనందమైన
తిరిగి రాని దశ.
తెలిసీ తెలియని మనసు, విరిసీ విరియని వయసు. కళ్ళముందు ఇంద్రలోకం-
అసలు ఆ ఆలొచనలే వేరు. వీలైనంత వరకు అందానికి మెరుగులు దిద్దడం,
అబ్బాయిలను ఆకర్షించాలన్న తాపత్రయం. "నిలువవే వాలు కనుల దాన, కారులొ
షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడీ దాన , నన్ను దోచు కొందు వటే" ఇలాంటి
పాటలు, మాటల డైలాగులు అవన్ని మనసుకి హాయిగా ఉల్లాసంగానె ఉంటాయి. ఇక మనకి
తెలుగు మేష్టారంటే ఇష్టం - సైన్స్ మేష్టారికి మనమంటే ఇష్టం. ఇద్దర్ని
కాదని చాదస్తపు మేష్టారిని చేసుకోవడం [ ఎందుకంటే ఆ రోజుల్లొ ఆసిడ్
ప్రేమలు రాక్షస ప్రేమలు లేవు గనుక. మనం చేసుకోక పోయినా, మనం ప్రేమించిన
వ్యక్తి ఎక్కడ ఉన్నా, ఎవర్ని చేసుకున్నా, సుఖం గా ఉండాలని కోరుకునే వారు
గనుక ] . ఇక ఉద్యోగం లొ[ బాంకి లొ ] సెక్షన్ లొ ఐదుగురు మాత్రమె ఉండి,
పాతిక పైగా మగ వారు ఉండే వారు అందుకని మమ్మల్ని "పంచ భూతాల్లా ఉన్న
ఐదుగురు అస్తమానం కొట్లాడు కుంటారు, మేం పాతిక మందిమి ఉన్నాం ఎప్పుడైనా
కొట్లాడు కున్నామా ?" అనే వారు. ఎన్నో సరదాలు, ఎంతొ అభిమానాలు మరెన్నో
ఆప్యాయతలు అదొక ప్రపంచం.
ఇంకేముంది ? మధురమైన పెళ్ళి ఘట్టం తర్వాత, అత్తిల్లు కొత్త కోడలు
ఊహకందని నిజాలు ఒడిలొ వాలాక, పసి పిల్లలు, ముద్దు ముచ్చట్లు, చేదు నిజాలు
అన్నీ కలసిన సంసార సాగరం ఈది, జీవిత సమరంలొ అలసి పోయి ఊడి పోయిన పళ్ళు,
వెలిసి పోయిన పెన్సిలు జడ, కళ్ళకి జోడు, అందాలు కరిగి ముడతలు పడిన శరీరం
మనమీద మనకె వింత గా ఉంటుంది.
కళ్ళు మూసి తెరిచేలోగా కరిగి పోయిన జీవితం. వద్దన్నా వెనక్కి
వెడుతుంది. పాత రోజులు మననం చేసు కుంటు, బండ బారి బీడు వడిన హృదయం. కాల
గర్భంలొ కలసిపోయిన పెద్దలు, కాలం నేర్పిన అనుభవాలు, తలపోసుకునే
జ్ఞాపకాలు, దూరమౌతున్న అనుబంధాలు, ఇంక మరపు రాని అనుభూతులు నెమరు
వేసుకోవడమే కదా జీవితం !!!
----------------------------------------------
--
---
You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.