వస్తువులను మనము సూర్యకాంతిలో ఏవిధముగా అయితే చూస్తున్నామో అదేవిధముగా చైతన్యప్రకాశము వలననే అన్ని అనుభవములను మనము గుర్తించగలుగు చున్నాము. అంతఃకరణ కేవలము అన్నింటిని తెలిసికొనుటకు ఉపయోగపడు ఒక ఉపకరణము. సూర్యకాంతి తాను ప్రకాశించే వాటిపై ఏవిధముగా ఆధారపడి, సంబంధించబడి లేదో అదే విధముగా చైతన్యజ్యోతి కూడా దేనిమీద ఆధారపడి లేదు, సంబంధించి లేదు.
మానవులు అందరు కోరుకొనేది శాశ్వత ఆనందమే కాని తాత్కాలిక సుఖమును కాదు. శాశ్వత ఆనందమును పొందవలెనన్న తాత్కాలిక సుఖము కొరకు ప్రయత్నమును, వ్యధను విడనాడవలెను. మనస్సు ఎప్పుడు తనకు అనుకూలమైనవి, సుఖమును కలిగించేవి కోరుకొంటుంది. మన ప్రయత్నము అంతా మనస్సుకు కావలసినవి ఏర్పరచుట కొరకే. మనస్సుకు కావలసినవి ఏర్పరచుచున్నావు అంటే కర్మను, ఫలితముతో ముడిపెట్టినట్లే. కామ్యక కర్మలో ఫలాసక్తత ఉంటుంది కనుక వ్యధ తప్పదు.
శాశ్వత ఆనందమునకు నీకు మార్గము గోచరించవలెనన్న ప్రయత్నించి సుఖమును భోగించ రాదు, ప్రయత్నించి దుఃఖమును విడువ రాదు. కోరికలు అలజడిని, అశాంతిని సృస్టిస్తాయి. అలజడి పొందిన మనస్సు విచారభూతమవుతుంది. కోరికలను విడువ గలిగితేనే ఆలోచనల అలజడి తగ్గుతుంది. అలా శాంతించిన మనస్సే ఆనందమునకు ఆటపట్టు. ఈ విధముగా కోరికలు తగ్గినకొద్ది అశాంతి తగ్గి ఆనందము పెరుగుతుంది. నీలోని కోరికలు అంతా ఖాళీ అయితే లభించే అఖండ అనుభూతే ఆత్మానందము.